ఒక్క మెయిల్ తో సీఈవో సహా ఉద్యోగులంతా ఔట్.. అంతా షాక్

అయితే ఈ తొలగింపు మెయిల్ అందుకున్న వారిలో కంపెనీ సీఈవో కూడా ఉన్నారని తెలుసుకోవడంతో గందరగోళం మరింత పెరిగింది.;

Update: 2025-11-10 14:30 GMT

తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాలు మనవి. ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక ఆయన చేసే తలతిక్క పనులతో ప్రపంచమే అతలాకుతలం అవుతోంది.అన్ని రంగాలు పడిపోతున్నాయి. కలల సాఫ్ట్ వేర్ రంగం కుదేలవుతోంది. ఇప్పుడు ఏఐ కూడా రావడంతో ఉద్యోగులు తమ కొలువులు పెద్ద ఎత్తున కోల్పోతూ రోడ్డున పడుతున్నారు. ఈ టైంలో ఏ ఉద్యోగి కూడా ప్రశాంతంగా నిద్ర పోవడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.ఇంతటి నరకం మధ్య ఓ కంపెనీలో సీఈవో సహా ఉద్యోగులందరినీ తొలగిస్తూ మెయిల్ రావడం చూసి వారంతా హడలి చచ్చారు.. ఈ స్టోరీ ఇప్పుడు రెడిట్ లో వైరల్ అవుతోంది. ఏంటా కథ తెలుసుకుందాం.

కార్పొరేట్ ప్రపంచంలో అపనమ్మకం, భయం కలిగించే సంఘటన ఇది. ఒక ప్రముఖ అమెరికన్ టెక్ కంపెనీలో హెచ్ఆర్ విభాగం చేసిన చిన్న పొరపాటు కారణంగా ఏకంగా 300 మంది ఉద్యోగులు, వారిలో స్వయంగా కంపెనీ సీఈఓ కూడా ఉద్యోగాలు కోల్పోయినట్టు మెసేజ్ వచ్చింది. ఒక్కసారిగా తమ ఉద్యోగాలు కోల్పోయినట్టు భావించి వారంతా భయాందోళనకు గురయ్యారు.

ఈ ఘటనకు కారణం కంపెనీ యొక్క ఆఫ్‌బోర్డింగ్ ఆటోమేషన్ టూల్. ఉద్యోగం ముగిసిన తర్వాత లాంఛనాలు పూర్తి చేయడానికి ఉపయోగించే ఈ సాఫ్ట్‌వేర్‌ను హెచ్ఆర్ బృందం పరీక్షించడం మొదలుపెట్టింది. అయితే, అత్యంత ముఖ్యమైన చర్యను మర్చిపోయింది. అదే 'లైవ్ మోడ్' నుంచి 'టెస్ట్ మోడ్'కి మార్చడం!

మీ చివరి పని దినం వెంటనే అమల్లోకి వస్తుందని మెయిల్

టూల్ లైవ్ మోడ్‌లో ఉండిపోవడంతో సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఒక షాకింగ్ ఈమెయిల్‌ను కంపెనీలో ఉన్న 300 మంది ఉద్యోగులకు పంపించింది. ఆ మెయిల్‌లో ఉన్న సందేశం ఏంటంటే.. " మీ చివరి పని దినం వెంటనే అమల్లోకి వస్తుంది’ అని పేర్కొది.. ఈ మెయిల్ అందిన వెంటనే కంపెనీలో తీవ్ర కలకలం చెలరేగింది. ఒక్కసారిగా అంతమందిని తొలగించడమేంటి? అని ఉద్యోగులు ఆందోళన చెందారు. కొందరు తమ సిస్టమ్స్‌ను లాగ్‌ఆఫ్ చేసి తిరిగి లాగిన్ అయ్యే ప్రయత్నం చేయగా, మరికొందరు తమ సీనియర్ మేనేజ్‌మెంట్‌కు, హెచ్‌ఆర్‌కు కాల్ చేయడం మొదలుపెట్టారు.

షాక్‌లో సీఈఓ కూడా

అయితే ఈ తొలగింపు మెయిల్ అందుకున్న వారిలో కంపెనీ సీఈవో కూడా ఉన్నారని తెలుసుకోవడంతో గందరగోళం మరింత పెరిగింది. ఈ అనూహ్య ఘటనను గురించి ఒక ఉద్యోగి ప్రముఖ సోషల్ మీడియా వేదిక రెడిట్ లో పోస్ట్ చేయడంతో విషయం ప్రపంచానికి తెలిసింది. "మా కంపెనీ ఆఫ్‌బోర్డింగ్ ఆటోమేషన్ టూల్‌ని టెస్ట్ చేస్తోంది. అది లైవ్ మోడ్‌లో ఉందని గమనించలేదు. కేవలం కొద్ది నిమిషాల్లోనే సీఈఓతో పాటు 300 మంది ఉద్యోగులకు ఉద్యోగం ముగిసిందని ఈమెయిల్ వెళ్లిపోయింది." అంటూ ఈ షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు.

వెంటనే క్షమాపణ, వివరణ

పొరపాటును గుర్తించిన హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్ వెంటనే మేల్కొని ఉద్యోగులకు మరో మెయిల్ పంపింది. " సిస్టమ్ లోపం వల్ల కలిగిన గందరగోళానికి చింతిస్తున్నాము’’ అని పేర్కొంటూ క్షమాపణలు చెప్పింది. "ఎవరినీ తొలగించలేదు. ఇది కేవలం టెస్ట్ పొరపాటు మాత్రమే. దయచేసి యథావిధిగా మీ పనిని కొనసాగించండి" అని వివరణ ఇచ్చింది. ఈ క్షమాపణ మెయిల్ ఉద్యోగులకు ఉపశమనం కలిగించినా ఆ కొద్ది నిమిషాల షాక్ మాత్రం ఎవరూ మర్చిపోలేకపోయారు.

ఆటోమేషన్ పట్ల అతి ఆధారపడటమే కారణమా?

ఈ సంఘటన టెక్ కంపెనీల్లో ఆటోమేషన్ సిస్టమ్స్‌పై ఉన్న అతి ఆధారపడటాన్ని మరోసారి ప్రశ్నించింది. ఆటోమేషన్ పనిని ఎంత సులభతరం చేస్తుందో, చిన్న పొరపాటు జరిగితే అది ఎంత పెద్ద గందరగోళానికి దారితీస్తుందో ఈ ఉదంతం కళ్ళకు కట్టింది.

నెటిజన్ల ఫన్నీ కామెంట్స్

ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు దీనిపై సరదాగా కామెంట్లు చేస్తున్నారు. "సీఈఓ కూడా ‘టెర్మినేటెడ్’ అనిపించుకోవడం ఇదే ఫస్ట్ టైమ్ అయ్యుంటుంది!" అంటూ సెటైర్లు వేస్తున్నారు.

మొత్తం మీద ఒక చిన్న సాఫ్ట్‌వేర్ సెట్టింగ్ పొరపాటు కారణంగా కంపెనీ అంతా కొన్ని నిమిషాల పాటు భయం, ఆందోళన, గందరగోళంతో కూడిన మర్చిపోలేని అనుభవాన్ని ఎదుర్కొంది.

Tags:    

Similar News