జనసేనకు ఇచ్చే సీట్లు అవేనట...?

జనసేన టీడీపీ కొత్త పొత్తు మీద రెండు పార్టీలలో చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది.

Update: 2023-10-05 02:45 GMT

జనసేన టీడీపీ కొత్త పొత్తు మీద రెండు పార్టీలలో చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. జనసేన వల్ల టీడీపీ గెలుస్తుంది అంటే తమ్ముళ్ళు ఒప్పడంలేదు, టీడీపీతో పొత్తు వల్లనే జనసేన రేపు సీట్లు ఎన్నో కొన్ని గెలుచుకుంటుంది అంటే సైనికులు కస్సుమంటున్నారు. మా నాయకుడు పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చారు, కీలక సమయంలో వెన్నంటి ఉన్నారు అని సైనికులు అంటున్నారు.

అదే సమయంలో టీడీపీకి మొత్తం 175 సీట్లలో బలం ఉంది. ఒంటరిగా అయినా పోటీ చేసినా గెలవగలదు, కానీ రాజకీయంగా వ్యూహంలో భాగంగానే పొత్తులు పెట్టుకుంటున్నారు అని దిగువ స్థాయిలో తమ్ముళ్ళు అంటున్నారు. అలా రెండు పార్టీల మధ్య అట్టడుగున ఉన్న క్యాడర్ లో అయితే పొత్తుల మీద లడాయి ఒక రేంజిలో సాగుతోంది.

నిజంగా చూస్తే చాలా మంది టీడీపీ నాయకులు సైతం పొత్తుల వల్ల తమ సీట్లు గల్లంతు అవుతాయన కంగారులో ఉన్నారు. జనసేనకు ఎక్కువ సీట్లు ఇస్తే తమ సీట్లు ఏమి కానూ అని వారు తెగ ఫీల్ అయిపోతున్నారు. దాత్నో అట్టడుగు స్థాయిలో క్యాడర్ లో ఒక రకమైన రచ్చ సాగుతూంటే సీట్ల విషయంలో తమ్ముళ్ళు మధన పడుతున్నారు.

జనసేనకు గోదావరి జిల్లాలలో మాత్రమే ఆ పార్టీకి కొంత బలం ఉందని, ఇక జనసేన కాపు సామాజికవర్గంతో పాటు అభిమానులతోనే నడుస్తోందని, పటిష్టమైన పార్టీ యంత్రాంగం లేదని గుర్తు చేస్తున్న వారూ ఉన్నారు. జనసేనలో లీడర్లు కూడా తక్కువ మందే ఉన్నారని అంటున్నారు.

దీంతో జనసేనకు కోరినన్ని సీట్లు ఇచ్చినా అభ్యర్దులు ఉన్నారా అన్న దాని మీద టీడీపీలో కూడా చర్చ సాగుతోందిట. దాంతో జనసేనకు తామున్న చోట పొత్తులలో సీట్లు కేటాయించవద్దు అన్న విన్నపాలు ఎక్కువ అవుతున్నాయట. మరో వైపు చూస్తే టీడీపీ నేతలు ధీమాగా ఉన్నారని అంటున్నారు.

అసలే చంద్రబాబు జిల్లా టూర్లతో పాటు, లోకేష్ పాదయాత్ర వల్ల మంచి రెస్పాన్స్ వచ్చిందని అంటున్నారు. ఇపుడు చంద్రబాబు అక్రమ అరెస్ట్ వల్ల కచ్చితంగా సానుభూతి బాగా పెరిగింది అని నిర్ధారిస్తున్నారు. దాంతో సొంతంగానే టీడీపీకి ఎక్కువ సీట్లు వస్తాయని అంటున్నారు. దీంతోనే పొత్తు పార్టీలకు పెద్దగా సీట్లు ఇవ్వరాదని అంటున్న వారూ గొంతు సవరిస్తున్నారు.

ఇక టీడీపీ అధినాయకత్వం వద్ద ఒక నంబర్ ఉంది. బాబు అరెస్ట్ అయ్యేంతవరకూ ఆ నంబర్ దగ్గరే ఆగింది. ఇపుడు కూడా దానికి అటూ ఇటూగా జనసేనకు సీట్లు ఇస్తారు తప్ప బిగ్ నంబర్ అయితే ఇవ్వరని ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. పది నుంచి పదిహేను సీట్లు ఇవ్వాలని గతంలో అనుకున్నారుట. ఇపుడు అరెస్ట్ తరువాత మరో అయిదు సీట్లు పెంచి ఇస్తారని అంతకు మించి ఇవ్వరని అంటున్నారు. ఈ రకమైన ప్రచారం అయితే టీడీపీలో ఉంది. మరి ఇరవై సీట్లు ఇస్తే జనసేన నేతలు ఊరుకుంటారా అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News