స్టీల్ టిఫిన్, నో హడావుడి కాన్వాయ్.. విజయ్ సింప్లిసిటీ ఎంతకాలం?
దశాబ్దాలుగా ద్రవిడ ముక్కోణపు కోటలైన డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీల చుట్టూనే తిరిగిన తమిళనాడు అధికార రాజకీయాల్లో ఇప్పుడు ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది.
దశాబ్దాలుగా ద్రవిడ ముక్కోణపు కోటలైన డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీల చుట్టూనే తిరిగిన తమిళనాడు అధికార రాజకీయాల్లో ఇప్పుడు ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. కోట్లాది మంది అభిమానుల గుండెల్లో 'తలపతి'గా నిలిచిన సినీ స్టార్ విజయ్.. ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం తమిళనాటనే కాకుండా దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. సినీ గ్లామర్‌తో రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటికీ సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఆయన వ్యవహరిస్తున్న తీరు ప్రజల్లో సరికొత్త ఆశలను, అంచనాలను రేకెత్తిస్తోంది.
వైరల్ అవుతున్న సింప్లిసిటీ.. సరళత్వమా? వ్యూహమా?
అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే విజయ్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలు ప్రజల్లో విస్తృతంగా చర్చకు దారితీస్తున్నాయి. చెన్నైలోని సీఎం కార్యాలయంలో కూర్చుని ఆయన అత్యంత సాధారణమైన స్టీల్ టిఫిన్ బాక్స్‌లో భోజనం చేయడం సామాన్యులను ఆకట్టుకుంటోంది. ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్నప్పుడు సాధారణంగా ఉండే భారీ హడావుడి.. ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా.. సాధారణ రోడ్లపైనే ఆయన కాన్వాయ్ సాగిపోతుండటం విశేషం.
ఈ దృశ్యాలు విజయ్‌ను సామాన్య ప్రజలకు అత్యంత దగ్గరగా ఉండే నాయకుడిగా నిలబెట్టడానికి ఉపయోగపడుతున్నాయి. అయితే రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన నాయకులు మొదట్లో ఇలాంటి సరళ జీవనశైలిని ప్రదర్శించడం ఇదే మొదటిసారి కాదు. తాము ప్రజల కంటే భిన్నమైన వాళ్లం కాదని.. ప్రజల్లో ఒకరిమనే సందేశాన్ని బలంగా పంపడానికి ఇదొక వ్యూహాత్మక రాజకీయ సాధనంగా కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
గతం నేర్పిన పాఠాలు.. అసలు పరీక్ష ఇక్కడే!
మొదట్లో వినమ్రత, క్రమశిక్షణను ప్రదర్శించి, కాలక్రమేణా ఆ విధానాన్ని కొనసాగించలేకపోయిన నాయకుల ఉదాహరణలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. "అధికార యంత్రాంగం, భద్రతా అవసరాలు, రాజకీయ ఒత్తిళ్లు పెరిగేకొద్దీ... తొలి రోజుల్లో ఇచ్చిన హామీలను, సరళత్వాన్ని నిలబెట్టుకోవడం ఏ నాయకుడికైనా కత్తిమీద సామే అవుతుంది." పక్క రాష్ట్రమైన తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం పదవిలోకి వచ్చిన తొలి రోజుల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా కాన్వాయ్ వ్యవహారాలు ఉంటాయని ప్రకటించారు. కానీ ఆ తర్వాత భద్రతా కారణాలు, ప్రోటోకాల్ వల్ల ట్రాఫిక్ ఆంక్షలు, భారీ భద్రతా ఏర్పాట్లు తప్పనిసరి కావడంతో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు విజయ్ విషయంలో కూడా ఇదే ప్రశ్న ఎదురవుతోంది. ప్రస్తుతం కనిపిస్తున్న ఈ సరళత నిజంగా ఆయన అంతర్గత పాలనా విధానంలో భాగమా? లేక కేవలం ప్రజల్లో మైలేజ్ కోసమేనా అనేది కాలమే నిర్ణయించాల్సి ఉంది.
స్క్రిప్ట్ మారాలి.. పరిపాలనే పరమావధి కావాలి!
ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రజలు కేవలం బాహ్య ప్రదర్శనలకు, 'విజువల్ షో'లకు మాత్రమే పరిమితమై సంతృప్తి చెందే పరిస్థితిలో లేరు. నాయకుడు ఎలా కనిపిస్తున్నాడన్న దానికంటే, ప్రజా సమస్యలను ఎలా పరిష్కరిస్తున్నాడు.. ఎలా పాలిస్తున్నాడు అన్నదే ఇక్కడ ముఖ్యం.
విజయ్‌కు ముఖ్యంగా యువతలో తిరుగులేని ప్రజాదరణ ఉంది. ఈ ఆకర్షణే ఆయనను రాజకీయంగా అత్యున్నత పీఠంపై కూర్చోబెట్టింది. అయితే వెండితెరపై చూపించే హీరోయిజానికి, నిజ జీవిత రాజకీయాలకు నక్కకూ నాగలోకానికీ ఉన్నంత తేడా ఉంటుంది. రాజకీయాల్లో నిరంతర క్రమశిక్షణ, పరిపాలనా సామర్థ్యం, క్షేత్రస్థాయి సమస్యలపై స్పష్టమైన అవగాహన, తక్షణ చర్యలు మాత్రమే ఒక నాయకుడిని దీర్ఘకాలం నిలబెడతాయి.
విజయ్ మొదట్లో చూపిస్తున్న ఈ వినమ్రత, సామాన్య జీవనశైలి కేవలం ప్రారంభానికే పరిమితం కాకుండా ఆయన ఐదేళ్ల పాలనలో నిరంతరం కొనసాగితేనే అది తమిళనాడు రాజకీయాల్లో ఒక 'నిజమైన మార్పు'గా గుర్తింపు పొందుతుంది. అలా కాకుండా భద్రత, రాజకీయ ఒత్తిళ్ల పేరుతో పాత పద్ధతులనే అనుసరిస్తే... ఇది కూడా గతంలో ఎంతోమంది నాయకులు ప్రదర్శించిన పాత స్క్రిప్ట్‌గానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. 'తలపతి' విజయ్ కత్తి అంచు మీద నడుస్తున్నారు. ఆయన చూపుతున్న ఈ సరికొత్త బాట ఎంతవరకు విజయవంతమవుతుందో చూడాలి!