బాబు రూట్ లోకి జగన్ వెళ్ళరా ?
రాజకీయాలు అంటే పూర్తిగా ప్రజలతో ముడిపడి ఉన్నవి. ప్రజల ఆలోచనల మేరకు చేయాల్సి ఉంటుంది.;

రాజకీయాలు అంటే పూర్తిగా ప్రజలతో ముడిపడి ఉన్నవి. ప్రజల ఆలోచనల మేరకు చేయాల్సి ఉంటుంది. దాని కోసం నిరంతరం వారి గురించి అధ్యయనం చేయాలి. ఒక్కోసారి ప్రజలు తమను ఎందుకు పక్కన పెట్టారు, వేరే పార్టీని ఎందుకు దగ్గరకు తీశారు అన్నది కూడా ఆలోచించాల్సి ఉంటుంది. అలా ఆలోచిస్తే ఆయా పార్టీలు చేసిన కార్యక్రమాలను తామూ చేయడం ద్వారా ప్రజలకు చేరువ కావచ్చు.
అయితే ఇందులో బేషజాలకు పోవాల్సిన అవసరం లేదు. అంతిమంగా ప్రజలు న్యాయ నిర్ణేతలు కాబట్టి ప్రజలను మెప్పించే విధంగా ఒప్పించే విధంగా చేయడమే రాజకీయం కాబట్టి అందులో ఏ మాత్రం తప్పు అయితే లేదు. ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కచ్చితంగా వ్యవహరిస్తారు. ఆయన ఏమి చేసినా ప్రజల కోసమే అన్నట్లుగా తన రాజకీయ దృక్కోణం ఉంటుంది.
అందుకే జగన్ 2019 నుంచి 2024 వరకూ చేసిన సంక్షేమ పధకాలను తాను చూసి జనాలకు అవి నచ్చాయి కాబట్టి రెట్టింపు చేస్తాను అని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఆ మేరకు సూపర్ సిక్స్ తెచ్చారు. ఇక ఎన్నికలు అయి అధికారంలోకి వచ్చాక మెల్లగా ఒక్కో హామీనీ నెరవేరుస్తున్నారు. ఒక విధంగా చూస్తే బాబు సంక్షేమానికి వ్యతిరేకి అని చెబుతారు.
ఆయన సంస్కరణ వాది అని కూడా అంటారు. కానీ ఏపీలో రాజకీయం వేరే ఉన్నపుడు పోటా పోటీగా పరిస్థితి ఉన్నపుడు పైచేయి సాధించేందుకు బాబు తన మార్గం వీడి మరీ జగన్ రూట్ లోకి వెళ్ళారు. మేము తెచ్చిన పధకాలనే పేర్లు మార్చి ఇస్తున్నారు అని వైసీపీ అన్నా కూడా అసలు పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ప్రజల మెప్పు పొందడమే అంతిమం కనుక.
మరి ఈ విషయంలో ఎలాంటి భేషజాలకు బాబు పోవడం లేదు. అంతే కాదు తన వ్యూహాల ప్రకారమే ఆయన ముందుకు పోతున్నారు. అయితే జగన్ మాత్రం బాబు రూట్ లోకి వస్తున్నారా అన్నదే చర్చగా ఉంది. ఉదాహరణ తీసుకుంటే అమరావతి రాజధాని ఉంది. అది బాబు హయాంలో మొదలైంది. దానిని తాను కూడా కొనసాగిస్తాను అని అయిదేళ్ళ తన పాలనలో జగన్ అనలేకపోయారు అని ఎత్తి చూపిస్తున్నారు.
అంతే కాదు అమరావతి రాజధానిని ఇబ్బంది పెట్టడానికే మూడు రాజధానుల ప్రతిపాదనలను జగన్ తెచ్చారు అని కూడా అంటారు. సరే మూడు రాజధానుల పట్ల జనంలో పెద్దగా ఆదరణ లేదు, ప్రజలు అంతా అమరావతికే ఓటు వేస్తున్నారు. మరి ఆ విధంగా చూస్తే ఒక రాజకీయ పార్టీగా ప్రజలు మెచ్చిన విధంగా వ్యవహరించాలి కదా అన్న చర్చ వస్తోంది.
అలా చూస్తే జగన్ కూడా అమరావతి రాజధానిని తాను అభివృద్ధి చేస్తాను అని 2024 ఎన్నికల్లో ఓటమి తరువాత అయినా చెప్పాలి కదా అని అంటున్నారు. అంతే కాదు ఏపీలో అభివృద్ధి అజెండా తో టీడీపీ దూసుకుని పోతోంది. ఓటర్లు అంటే కేవలం సంక్షేమ పధకాల లబ్దిదారులు మాత్రమే కాదు, అభివృద్ధికి కోరుకునే సెక్షన్లు కూడా చాలానే ఉన్నాయి. మరి వారి విషయంలో వైసీపీ స్టాండ్ ఏమిటి అన్నదే చెప్పాల్సి ఉంది అని అంటున్నారు.
ఏపీలో పెట్టుబడుల రాక విషయంలో కానీ టూరిజం ఐటీ సినీ సెక్టర్ల అభివృద్ధి విషయంలో కానీ ఏపీలో మౌలిక సదుపాయాల కల్పన విషయంలో కానీ ఎయిర్ పోర్టులు రైల్వే లైన్లు ఇతరత్రా విషయంలో కానీ టైర్ టూ సిటీల అభివృద్ధి విషయంలో కానీ మా విజన్ ఇదీ అని వైసీపీ జనాలకు చెప్పాల్సిన అవసరం ఉంది కదా అని అంటున్నారు.
టీడీపీ నేతలు అభివృద్ధి సంక్షేమం మాకు రెండు కళ్ళు అని గట్టిగా చెబుతున్నారు. వైసీపీ మాత్రం సంక్షేమాన్ని నమ్ముకుని ఇంకా అక్కడే ఉందని అంటున్నారు. వైసీపీ సంక్షేమాన్ని ఓడించి రెట్టింపు సంక్షేమంతో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. 2029లో ఇచ్చిన హామీలను నెరవేర్చి మరిన్ని కొత్త హామీలతో కూటమి జనం ముందుకు వెళ్తే ట్రాక్ రికార్డు చూసి కచ్చితంగా జనాలు ఆదరించే అవకాశం ఉంటుంది.
అపుడు వైసీపీకే ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు. అందుకే వైసీపీ కేవలం సంక్షేమాన్ని మాత్రమే నమ్ముకోకుండా తనదైన అభివృద్ధి అజెండాను బయటకు తీయాలని కోరుతున్నారు. అంతే కాదు బాబు విజన్ కి ఆల్టర్నేట్ గా వైసీపీ ఇదీ మా విజన్ అని చెప్పాల్సి ఉంటుందని కూడా సూచిస్తున్నారు. ప్రతీ ఎన్నికకూ ప్రజల తీర్పు విలక్షణంగా ఉంటుందని ఓటర్లను ఎపుడూ తక్కువ అంచనా వేయడానికి వీలు లేదని కూడా అంటున్నారు.