తుని కలిసొచ్చింది.. యనమల హ్యాపీ రిటైర్మెంట్
ఎట్టకేలకు తునిలో ఉత్కంఠ తొలగిపోయింది. మున్సిపల్ చైర్మన్ పదవిని టీడీపీ సునాయాశంగా గెలుచుకుంది.;
ఎట్టకేలకు తునిలో ఉత్కంఠ తొలగిపోయింది. మున్సిపల్ చైర్మన్ పదవిని టీడీపీ సునాయాశంగా గెలుచుకుంది. గత ఫిబ్రవరిలో వైఎస్ చైర్మన్ పదవి కోసం నానా తిప్పలు పడిన టీడీపీ నేతలకు.. బంపర్ ఆఫర్ లా చైర్మన్ పదవీ దక్కడం విశేషంగా చెబుతున్నారు. అనేక నాటకీయ పరిణామాల మధ్య సుమారు మూడు నెలలుగా రచ్చరచ్చగా సాగిన తుని రాజకీయానికి ఎట్టకేలకు శుభం కార్డు పడింది.
కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీలో ఎట్టకేలకు టీడీపీ జెండా ఎగరేశారు. చైర్ పర్సన్ సుధారాణి రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన చైర్ పర్సన్ నార్ల భువన సుందరి గెలుపొందారు. అదేవిధంగా వైస్ చైర్మన్ గా ఆచంట సురేశ్ ఎన్నికయ్యారు. వైసీపీ కౌన్సిలర్లు గైర్హాజరుతో వీరి ఎన్నిక ఏకగ్రీవమైంది. గత ఫిబ్రవరి నుంచి తుని మున్సిపాలిటీలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం ఎన్నికల సంఘం ఫిబ్రవరిలో నాలుగుసార్లు సన్నాహాలు చేసింది. అయితే అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మధ్య పోటాపోటీగా రాజకీయాలు నడవడంతో వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించడం సాధ్యపడలేదు. ఈ ఎన్నిక సీనియర్ నేత, మాజీ మంత్రి యనమలకు ప్రతిష్ఠాత్మకంగా మారడంతో రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.
2021లో జరిగిన ఎన్నికల్లో తునిలో 30 కౌన్సిల్ స్థానాలను వైసీపీ గెలుచుకుంది. చైర్మన్ తోపాటు రెండు వైస్ చైర్మన్ పదవులను ఆ పార్టీయే దక్కించుకుంది. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో మిగిలిన పట్టణ సంస్థలు మాదిరిగానే తునిలోనూ రాజకీయం సమూలంగా మారిపోయింది. దాదాపు రెండు దశాబ్దాలు తర్వాత అవకాశం చిక్కడంతో మున్సిపాలిటీపైనా పసుపు జెండా ఎగరేయాలని టీడీపీ పావులు కదిపింది. తొలుత టీడీపీ ఎత్తులను మాజీ మంత్రి, వైసీపీ నేత దాడిశెట్టి రాజా తిప్పికొట్టారు. దీంతో మూడు నెలలుగా రాజకీయం వాడివేడిగా సాగింది.
మొత్తం నాలుగుసార్లు వైస్ చైర్మన్ ఉప ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘం ప్రయత్నించినా సాధ్యపడలేదు. రెండు సార్లు శాంతిభద్రతల సమస్యతో వాయిదా వేయగా, మరో రెండు సార్లు కోరం లేక వాయిదా వేయాల్సివచ్చింది. ఈ పరిస్థితుల్లో వైసీపీ కౌన్సిలర్లు ఒక్కొక్కరుగా టీడీపీలో చేరిపోతుండటంతో వైసీపీ చేతులెత్తేసింది. మరోవైపు చైర్మన్ పదవికి వైసీపీ నేత సుధారాణి రాజీనామా చేయడంతో వైసీపీ పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది.
చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఖాళీగా ఉండటంతో సోమవారం ఎన్నికల కమిషన్ ఎన్నిక నిర్వహించింది. దీనికి వైసీపీ గైర్హాజరు అయింది. దీంతో టీడీపీ జెండా ఎగరేసింది. తునిలో గెలిచి తమ నేత యనమలకు గిఫ్ట్ ఇచ్చామని టీడీపీ నేతలు ప్రకటించారు. సదీర్ఘకాలం తుని ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన యనమలకు గత 20 ఏళ్లుగా తునిలో గెలుపు కష్టంగా మారింది. అదేసమయంలో మున్సిపాలిటీలోనూ ఆధిపత్యం లేక చాలా అవమానంగా భావించేవారు. గత ఎన్నికల్లో యనమల బిడ్డ దివ్య ఎమ్మెల్యేగా ఎన్నికవగా, ఇప్పుడు పట్టణంలోనూ పట్టు సాధించి రిటైర్మెంట్ ముందు పరువు నిలబెట్టుకున్నారని అంటున్నారు.