పిఠాపురం వర్మ ఇన్ బిగ్ ట్రబుల్స్!
పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ పవన్ గెలిచిన కొత్తల్లో ఒక్కటే హంగామా చేశారు.;
పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ పవన్ గెలిచిన కొత్తల్లో ఒక్కటే హంగామా చేశారు. అలా పిఠాపురం లాంటి ఒక సాధారణ అసెంబ్లీ నియోజకవర్గం స్టేట్ వైడ్ ఫ్యామస్ అయిపోయింది. పిఠాపురంలో ఎవరు ఎమ్మెల్యే ఏమిటి అక్కడ రాజకీయం అన్నది 2024 ముందు దాకా జనాలకు పెద్దగా తెలిసేది కాదు. అంత కూలెస్ట్ అండ్ పీస్ ఫుల్ నియోజకవర్గంగా ఉండేది.
అయితే అక్కడ నుంచి పోటీ చేసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. దాంతో పిఠాపురం సైతం కలర్ ఫుల్ గా మారిపోయింది. పొలిటికల్ గా ఎపుడూ హాట్ హాట్ టాపిక్స్ తో ఉంటోంది. అలాంటి పిఠాపురంలో టీడీపీకి రాజు లాంటి మాజీ ఎమ్మెల్యే వర్మ ఉన్నారు. ఆయన 2024లో ఎమ్మెల్యే కావాలి. కానీ రాలేదు. దానికి కారణం కూటమి పొత్తులు రాజకీయాలు. ఇలా అన్నీ కలసి వర్మను సైడ్ బెంచ్ కి నెట్టేశాయి.
పోనీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా ఎమ్మెల్సీ దక్కిందా అంటే అదీ కూడా లేదు. ఇక ఎమ్మెల్సీ తప్ప వేరే వరం కోరుకోమని టీడీపీ అధినాయకత్వం వర్మకు స్పష్టంగానే చెప్పింది అని అంటున్నారు. దాంతో మరింతగా పిఠాపురం వర్మ డీలా పడిపోయారని అంటున్నారు. ఇక ఎప్పటికీ చట్ట సభకు వెళ్ళడం అన్నది జరిగే విషయం కాదా అని ఆయన అనుచరులు కూడా తెగ ఫీల్ అవుతున్నారని భోగట్టాలు ప్రచారాలు సాగుతూండేవి.
అయితే వాటిలో నిజం ఉందని ఏకంగా కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ హాట్ కామెంట్స్ చేశారు. వర్మ ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్నారని కూడా కుండబద్దలు కొట్టేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పార్టీని బతికించుకోవాలని జ్యోతుల నవీన్ సూచించడం విశేషం. అంతే కాదు కొద్ది రోజులు ఆలస్యం అయినా వర్మకు సముచిత స్థానం ఇచ్చేందుకు అధినాయకత్వం సిద్ధంగా ఉందని జ్యోతుల నవీన్ చెప్పారు. ఇదంతా జరగాలీ అంటే టీడీపీ క్యాడర్ ఎవరూ ప్రలోభాలకు లొంగకూడదని ఆయన చెప్పుకొచ్చారు.
సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో పిఠాపురంలో నిర్వహించిన సభలో జ్యోతుల నవీన్ చేసిన ఈ కామెంట్స్ ఇపుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యాయి. వర్మ ఇబ్బందులు ఏమిటో నవీన్ చెప్పకపోయినా అందరికీ తెలిసిందే అని అంటున్నారు. అక్కడ జనసేన పాతుకుని పోవాలని చూస్తోంది. జనసేన బలపడాలి అంటే వర్మ జోరు తగ్గించాలని అంటున్నారు.
అందుకే ఆయనకు పెద్ద పదవులు రావడం లేదు అన్నది ఆయన అభిమానుల అనుచరుల మాటగా ఉంది. అయితే జ్యోతుల నెహ్రూ ఈ విషయం ఏకంగా బహిరంగంగా చెప్పడం విశేషం. ఏ పార్టీలో అయినా అసంతృప్తి ఉంటుంది. నేతలు తమకు చాన్స్ రానపుడు నిరాశలో ఉంటరు. అయితే దాని మీద ప్రచారాలు చేస్తూ మీడియాలో వార్తా కధనాలు వస్తాయి. అబ్బే అలాంటిది లేదు అని చెప్పాల్సిన బాధ్యత పార్టీ నేతలది. కానీ మా వర్మ ఇబ్బందుల్లో ఉన్నారని ఏకంగా జిల్లా పార్టీ ప్రెసిడెంటే చెప్పారూ అంటే ఆ అసంతృప్తి చాలా పెద్దదే అని అనుకోవాలి.
అంతకంటే ముందు పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేనగా సాగుతున్న రాజకీయంలో ఇదొక భాగం అనుకోవాలి. ఏది ఏమైనా వర్మ బిగ్ ట్రబుల్స్ నుంచి ఎపుడు బయటకు వస్తారు ఆయనకు ఇవ్వబోయే పదవి ఏమిటి, ఆయన ఆ పదవితో సంతృప్తి చెందుతారా ఇక పిఠాపురంలో జనసేన టీడీపీల మధ్య గ్యాప్ అనేది లేదు అన్న మాట వినిపిస్తుందా ఇవన్నీ ప్రశ్నలే జవాబుల కోసం వేచి చూడాల్సిందే.