తెలంగాణ టీడీపీ.. ఇంతకుమించిన అవకాశం ఉందా?
తెలంగాణలో టీడీపీ బలపడాలని ఎప్పటి నుంచో కేడర్ కోరుకుంటోంది. అధినేత చంద్రబాబు, యువనేత లోకేశ్ కూడా ఈ విషయంలో తరచూ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు.;
తెలంగాణలో టీడీపీ బలపడాలని ఎప్పటి నుంచో కేడర్ కోరుకుంటోంది. అధినేత చంద్రబాబు, యువనేత లోకేశ్ కూడా ఈ విషయంలో తరచూ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. తెలంగాణలో పార్టీ విస్తరణకు టైమ్ కేటాయిస్తామని చెబుతూనే ఉన్నారు. అయితే, రోజులు గడుస్తున్నాయని కానీ, ఆ సమయమే ఇంతవరకు ఇవ్వడం లేదని కార్యకర్తలు నిట్టూరుస్తున్నారు. ప్రస్తుతం స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైనందున ఇప్పుడైనా తమ గోడు పట్టించుకోవాలని అధినేత చంద్రబాబుకు విన్నవిస్తున్నారు పసుపుదళం కార్యకర్తలు.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి బలమైన కేడర్ ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం బలమైన స్థితిలో ఉండటానికి తెలంగాణ ప్రాంతమే కారణమని విశ్లేషణలు ఉన్నాయి. ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో టీడీపీ ఘనమైన విజయాలను అందుకుంది. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఈ బలం చెల్లాచెదురైంది. చాలా వరకు కేడర్, లీడర్ ఇతర పార్టీల్లో చేరిపోయారు. కానీ, ఖమ్మం, నల్లగొండ వంటి సరిహద్దు జిల్లాలతోపాటు హైదరాబాద్ నగరంలో టీడీపీ కేడర్ ఇప్పటికీ కొనసాగుతోంది. నాయకుడు లేకపోయినా పార్టీ ఆవిర్భావం నుంచి పెంచుకున్న అభిమానంతో పార్టీని అంటిపెట్టుకుని కొనసాగుతున్నారు. ఇలాంటి వారు గత ఎన్నికల్లో పోటీ చేయకపోయినా, పార్టీ కార్యక్రమాల నిర్వహణలో వెనక్కి తగ్గడం లేదు.
ఇక ఏపీలో నాలుగోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో పార్టీ విస్తరణకు సమయం కేటాయించాలని అధినేత చంద్రబాబును పలుమార్లు కలిసిన తెలంగాణ కేడర్ కోరుతూ వస్తోంది. చంద్రబాబు సైతం వీలున్నప్పుడు ఎన్టీఆర్ భవన్ కు వస్తానని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే బాల క్రిష్ణ లేదా మంత్రి లోకేశ్ సతీమణి బ్రాహ్మణికి తెలంగాణ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్లు వినిపించాయి. కానీ, ఏపీలో పార్టీ అవసరాల ద్రుష్ట్యా ఇన్నాళ్లు తెలంగాణపై పెద్దగా ఫోకస్ చేయలేదు చంద్రబాబు. ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీకి కూడా నేతలు అధిష్టానంపై ఒత్తిడి చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ లోగానే స్థానిక ఎన్నికలకు శంఖారావం మోగడంతో టీడీపీ కార్యకర్తలు పోటీకి సై అంటున్నారు.
ఈ నెల 9 నుంచి వచ్చేనెల 11 వరకు తెలంగాణలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. మూడు విడతలుగా పంచాయతీలకు, రెండు విడతలుగా జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో బలం ఉన్న చోట పోటీకి టీడీపీ కార్యకర్తలు ఆసక్తి చూపుతున్నట్లు చెబుతున్నారు. తమకు మద్దతుగా అధిష్టానం నిలవాలని కోరుతున్నారు. పార్టీ ప్రోత్సహిస్తే ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో కొన్ని స్థానాలను కైవసం చేసుకునే సత్తా చూపుతామని కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. క్షేత్రస్థాయిలో బలం నిరూపించుకునే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తే వాస్తవ బలం కూడా తేటతెల్లం అవుతుందని, ఆ తర్వాత పార్టీ విస్తరణ ప్రణాళికను రచించ్చొని కొందరు సీనియర్లు సూచిస్తున్నారు. అయితే దీనిపై అధినేత చంద్రబాబు మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సివుందని అంటున్నారు.