ఏడాది పాల‌న‌పై జ‌న‌సేన 'సెప‌రేట్'!

ఈ విష‌యంలో జ‌న‌సేన ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ ఏర్పాటు చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. పార్టీ నాయ‌కులు తాము ప్ర‌త్యేకంగా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు చెబుతున్నారు.;

Update: 2025-07-04 06:42 GMT

రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం ఏడాది పాల‌న పూర్తి చేసుకున్న నేప‌థ్యంలో టీడీపీ నాయ‌కులు 'సుప‌రిపాలనలో తొలి అడుగు' పేరుతో ఇంటింటికీ 'ఇది మంచి ప్ర‌భుత్వం' కార్య‌క్ర‌మాన్ని చేస్తున్నారు. నాయ‌కు లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజ‌క‌వ‌ర్గం స్థాయి నేత‌లు కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాలు పంచుకుంటున్నారు. అయితే.. ఈ వ్య‌వ‌హారంపై రాజ‌కీయంగా ఎలా ఉన్నా.. సామాజికంగా మాత్రం చిన్న‌పాటి విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

కూట‌మి ప్ర‌భుత్వం అంటే.. బీజేపీ-జన‌సేన‌-టీడీపీ క‌లిసి క‌దా పాల‌న చేస్తున్నాయి. అలాంట‌ప్పుడు టీడీపీ ఒక్క‌టే ఏడాది పాల‌న‌పై కార్య‌క్ర‌మం చేయ‌డం ఏంటి? అనేది ప్ర‌శ్న‌. ఇది వాస్త‌వ‌మే. ఎందుకంటే.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు మూడు పార్టీలు క‌లిసి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌చ్చాయి. మూడు పార్టీలూ క‌లిసి.. ప్ర‌భుత్వం ఏర్పాటు చేశాయి. మ‌రి ఇప్పుడు ఒకే పార్టీ ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు రావ‌డం ఏంటి? మంచైనా చెడైనా.. మూడు పార్టీలూ క‌లిసి క‌దా పంచుకోవాలి? అనేది ప్ర‌శ్న‌.

ఈ విష‌యంలో జ‌న‌సేన ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ ఏర్పాటు చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. పార్టీ నాయ‌కులు తాము ప్ర‌త్యేకంగా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు చెబుతున్నారు. ప్ర‌భుత్వ పాల‌న‌కు ఏడాది పూర్త‌యిన ద‌రిమిలా.. త‌మ‌కు అప్ప‌గించిన శాఖ‌ల్లోనూ మంచిప‌నులు చేశామ‌ని వారు కొన్ని జాబితాలు చెబుతున్నారు. రేష‌న్ బియ్యాన్ని ఠంచ‌నుగా దుకాణాల ద్వారా అందించ‌డం.. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి, పంచాయ‌తీల‌కు నేరుగా నిధులు అందించ‌డం.. అట‌వీ సంప‌ద కాపాడ‌డం వంటివి త‌మ క్రెడిట్‌గా చెబుతున్నాయి.

ఈ స‌మ‌యంలోనే గిరిజ‌న ప్రాంతాల్లో జ‌రుగుతున్న అభివృద్ధి కూడా త‌మ‌కే ద‌క్కుతుంద‌ని నాయ‌కులు అంటున్నారు. ఈ నేప‌థ్యంలో తాము ప్ర‌త్యేకంగా కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేసుకునే దిశగా ఆలోచ‌న చేస్తున్న‌ట్టు చెబుతున్నారు. అంతేకాదు.. ఇప్పుడు అన్ని పార్టీలు క‌లిసి ఒకే స‌మ‌యంలో వెళ్తే.. ఒకే స‌మ‌యంలో కార్య‌క్ర‌మం అయిపోతుంద‌ని.. అలా కాకుండా.. ఏడాది పొడ‌వునా.. ప్ర‌జ‌ల‌కుచేరువ అయ్యేలా.. తాము కార్యాచ‌ర‌ణ చేప‌డుతున్న‌ట్టు తెలిపారు. అంటే.. టీడీపీ కార్య‌క్ర‌మాల త‌ర్వాత‌.. జ‌న‌సేన కార్య‌క్ర‌మాలు ఉండేలా.. ప్లాన్ చేస్తున్నార‌ని స‌మాచారం. అందుకే. ఇప్పుడు టీడీపీ ఒంట‌రిగానే పాల్గొంటోంద‌ని అంటున్నారు.

Tags:    

Similar News