పవన్ కోసమేనా..? వర్మపై టీడీపీ కఠిన నిర్ణయం!
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు టీడీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్న వర్మను ఆ బాధ్యతల నుంచి తప్పించింది.;
పిఠాపురం రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మను నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి పదవి నుంచి తొలగిస్తూ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయం వెనుక కూటమి రాజకీయాలే ప్రధాన కారణమన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
జనసేనతో సమన్వయం విషయంలో వర్మ వ్యవహార శైలి పార్టీకి ఇబ్బందిగా మారిందన్న భావన టీడీపీ అధిష్టానంలో ఏర్పడినట్లు సమాచారం. ముఖ్యంగా పిఠాపురం వంటి కీలక నియోజకవర్గంలో మిత్రపక్షాలతో విభేదాల సంకేతాలు బయటకు వెళ్లకూడదనే ఉద్దేశంతోనే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.
ఇటీవల పిఠాపురంలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు ఫొటో లేకపోవడంపై వర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత పెండెం దొరబాబుతో జరిగిన వాగ్వాదం కూటమిలో అంతర్గత విభేదాలపై చర్చకు దారి తీసింది. ఈ వ్యవహారం పట్ల సీఎం చంద్రబాబు కూడా అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం అప్పట్లోనే జరిగింది.
చిన్న విషయాలను పెద్ద వివాదాలుగా మార్చొద్దని ఇప్పటికే పార్టీ నేతలకు సూచనలు ఉన్నప్పటికీ, వర్మ వ్యవహారం మరోసారి కూటమి సంబంధాలపై ప్రశ్నలు తెచ్చిందని అంటున్నారు. ఇదే నేపథ్యంలో పార్టీ అధిష్టానం కఠిన నిర్ణయం తీసుకుని వర్మను ఇంచార్జి బాధ్యతల నుంచి తప్పించినట్లు సమాచారం.
పిఠాపురం నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో, అక్కడ జనసేనకు ప్రాధాన్యం పెరుగుతోందన్న భావన టీడీపీ స్థానిక నాయకత్వంలో ఉందని చెబుతున్నారు. జనసేన ఆధిపత్యాన్ని ఎదుర్కొనే ప్రయత్నంలో వర్మ దూకుడుగా వ్యవహరించారని, కానీ అధిష్టానం మాత్రం కూటమి ఐక్యతకే పెద్దపీట వేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక వర్మ స్థానంలో కొత్త ఇంచార్జిని ఇప్పటివరకు ప్రకటించలేదు. అయితే పిఠాపురం రాజకీయాలను ప్రత్యేక కమిటీ ద్వారా పర్యవేక్షించే ఆలోచనలో టీడీపీ ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.