ప్రొద్దుటూరు పంచాయతీ: బాబుకు మరో తలనొప్పి.. !
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే, టిడిపి సీనియర్ నాయకుడు వరదరాజులు రెడ్డికి ఈ నియోజకవర్గ మాజీ ఇంచార్జి ప్రవీణ్ కు మధ్య ఆదిపత్య కోరు కొనసాగుతోంది.
ఉమ్మడి కడప జిల్లాలోని ప్రొద్దుటూరు నియోజకవర్గం... టిడిపిలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నియోజకవర్గంలో సొంత పార్టీ నాయకులే వీధినపడి రగడ చేసుకోవడం, ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం వంటివి తీవ్ర విమర్శలకు వివాదానికి దారితీసింది. అంతేకాదు పార్టీ పరంగా కూడా ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే, టిడిపి సీనియర్ నాయకుడు వరదరాజులు రెడ్డికి ఈ నియోజకవర్గ మాజీ ఇంచార్జి ప్రవీణ్ కు మధ్య ఆదిపత్య పోరు కొనసాగుతోంది.
వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని ప్రవీణ్ ప్రకటించుకోవడం.. టికెట్ తనకే దక్కుతుందని ఆయన పదేపదే ఆఫ్ ది రికార్డుగా ప్రచారం చేయటం.. వంటివి వరదరాజులు రెడ్డి వర్గానికి తీవ్ర అసంతృప్తిని కలిగిస్తుంది ఇంకా ఎన్నికలకు మూడు సంవత్సరాల సమయం ఉందని ఎవరికి టికెట్ దక్కుతుందనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని ఇటీవల వరదరాజుల రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. అయినప్పటికీ ఇటు ప్రవీణ్ వర్గం మాత్రం తమ ప్రచారాన్ని ఆపడం లేదు. ఇంటింటికి తిరుగుతున్నారు.
ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలను ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రవీణ్ కు అనుకూలంగా అంతర్గత ప్రచారం జరుగుతుండడం ఎమ్మెల్యే వర్గానికి కంటి పై కునుకు లేకుండా చేస్తోంది. మరోవైపు వరదరాజుల రెడ్డి ని టార్గెట్ చేస్తూ ప్రవీణ్ చేస్తున్న రాజకీయం కూడా పార్టీకి ఇబ్బందికరంగా మారింది. సొంత షాపింగ్ కాంప్లెక్స్ పై ప్రవీణ్ అధికారులకు ఫిర్యాదు చేయడం దానిని కూల్చేయాలని ఆయన డిమాండ్ చేస్తూ నిరసనకు దిగడం వంటివి తీవ్ర వివాదానికి దారి తీశాయి.
వరదరాజులు రెడ్డి ప్రొద్దుటూరు మెయిన్ రోడ్ లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించుకున్నారు. అయితే దీనిని నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించి కట్టారు అన్నది ప్రవీణ్ చేస్తున్న ఆరోపణ. ఈ క్రమంలోనే మున్సిపల్ అధికారులకు ఆయన కంప్లైంట్ ఇవ్వడం, అధికారులు రంగంలోకి దిగడం వంటివి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఇది, ఇరు వర్గాల మధ్య రాళ్లదాడికి, విమర్శలకు కూడా కారణం అయింది. దీంతో పరస్పరం ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు.
రాజకీయంగా సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. తాజాగా జరిగిన మహానాడును ఇరువురు విడివిడిగా నిర్వహించడం ఎవరికి వారు కార్యకర్తలను సమీకరించే పని చేయటం వంటివి కూడా టిడిపిలో ఇబ్బందికర పరిస్థితిని తీసుకువచ్చింది. బలమైన కడప జిల్లాలో భవిష్యత్తులో వైసీపీని దీటుగా ఎదుర్కోవాలన్నది టిడిపి ఆలోచన. కానీ నాయకుల మధ్య అంతర్గత విభేదాలు.. టికెట్ పోరు వంటివి పార్టీని ఇప్పుడు ఇబ్బందికర పరిస్తితిని ఎదుర్కొనేలా చేస్తున్నాయి.
ఈ విషయంపై జిల్లా ఇన్చార్జి మంత్రి పరిశీలన చేశారని త్వరలోనే నివేదిక ఇస్తారని ఇటీవల రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావు మీడియాకు చెప్పారు. మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది చూడాలి. ఏది ఏమైనా కీలకమైన జిల్లాలో నాయకుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుండడం పార్టీకి అంత మంచిది కాదని సీనియర్లు చెబుతున్నారు.