'అతి' ఎప్పుడూ మంచిది కాదు బాబూ ..!
నాయకుల కోణం వేరు.. ప్రజల కోణం వేరు. అతిగా ఏం చేసినా.. ప్రజలు అంతే అతిగా తీసుకుంటారు.;

నాయకుల కోణం వేరు.. ప్రజల కోణం వేరు. అతిగా ఏం చేసినా.. ప్రజలు అంతే అతిగా తీసుకుంటారు. అది ఎవరికీ మంచిది కాదు. గతంలో చంద్రబాబును తిట్టించిన, పవన్‌ను దూషించిన నాయకుల పరిస్థితి ఏమైంది? రెండు చోట్ల ఓడిపోయారంటూ.. మూడు పెళ్లిళ్లు చేసుకున్నారంటూ.. పవన్‌పై చేసిన విమర్శల జడి అతిగా మారి.. చివరకు వైసీపీ పుట్టిముంచింది. చంద్రబాబును జైల్లో పెట్టేస్తే.. ఇక, తనకు తిరుగు ఉండదని అనుకుని అతికిపోయిన జగన్ పరిస్థితి ఏమైందో తెలిసిందే.
సో.. అతి అనేది రాజకీయాల్లో ఎంత ప్రమాదమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇది ఒక్క వైసీపీకే కాదు. రాజకీయాల్లో పార్టీలకు.. నాయకులకు శాశ్వత శత్రువులుకానీ... శాశ్వత మిత్రులు కానీ.. లేనట్టుగానే.. ప్రజ లకు కూడా ఇలానే `శాశ్వత అధికార పార్టీ` ఉందా? ఉంటుందా?.. పురుచ్చితలైవిగా పేరొంది, వీధి వీధికీ గుడి కట్టించుకున్న జయలలితను కూడా ఓడించారు. ఒడిశా; పశ్చిమ బెంగాల్‌లలో కూడా.. అధికారం శాశ్వతం అనుకున్న వారు పక్కకు తప్పుకోక తప్పలేదు.
ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. టీడీపీలోని మేధావి వర్గం రహస్యంగా విజయవాడలో భేటీ అయింది. ఈ సందర్భంగా.. భవిష్యత్తు రాజకీయ పరిణామాలపై అంచనా వేసింది. వీరిలో ఒకరిద్దరు నిత్యం చంద్రబాబుకు టచ్‌లో ఉండేవారేనని సమాచారం. ఈ క్రమంలోనే ప్రస్తుతం చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్య లు.. ఫ్యూచర్ పాలిటిక్స్‌పై చర్చించిన మేధావులు.. అతి మంచిది కాదని తీర్మానానికి వచ్చారు. ప్రజలకు మంచి చేయడం, పెట్టుబడులు తీసుకురావడం వరకు కరెక్టేనని.. కానీ.. ప్రతిపక్షాన్ని అతిగా ప్రస్తావించడం ద్వారా.. ఇబ్బందులు వస్తాయన్నది వీరు చెబుతున్న మాట.
అయితే.. ఈ రహస్య సమావేశం ఎక్కడ జరిగింది? అనేది గుట్టుగా ఉంచారు. అధికారంలోకి మళ్లీ వచ్చేస్తాం అనే ధీమా చంద్రబాబు వ్యక్తం చేయడాన్ని తప్పుబట్టారు. ఈ ధీమా ఆయన వరకు పరిమితం అయి తే మంచిదేనని.. కానీ, ఇదే ధీమా క్షేత్రస్థాయికి కూడా పాకి పోయిందిని.. ఇది గత వైసీపీ 30 ఏళ్ల అధికారం ధీమాగా మారుతోందని మేధావులు అంచనా వేశారు. తద్వారా.. నాయకులు కట్టుతప్పి.. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు వ్యవహరించే ప్రమాదం ఉందని, ఫలితంగా పార్టీ ప్రమాదంలో చిక్కుకునే అవకాశం ఉందని టీడీపీ మేదావి వర్గం అంచనా వేస్తోంది.
అధికారం ఇవ్వడం.. ఇవ్వకపోవడం అనేది ప్రజల చేతిలో ఉన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉందని.. అతిగా ఊహించుకున్నా.. అతిగా అంచనా వేసుకున్నా.. మంచిదికాదన్నదివారు చెబుతున్న మాట. అయితే.. దీనికి సంబంధించిన విషయాలు .. చాలా రహస్యంగా ఉంచారు. ఓ సీనియర్ నాయకుడి ద్వారా ఒకటి రెండు విషయాలు మాత్రమే బయటకు పొక్కడం గమనార్హం. మరి చంద్రబాబుకు వీరు ఈ సూచనలు, సలహాలు ఇస్తారా? ఆయన పాటిస్తారా? అనేది చూడాలి.