ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే : డబుల్ కన్ఫ్యూజన్ !
కేంద్రంలో ఎన్డీయే రాష్ట్రంలో ఎన్డీయే. ఇలా రెండు ప్రభుత్వాలు డబుల్ ఇంజన్ సర్కార్ గా ముందుకు దూసుకుని పోతున్నాయని ఇప్పటికి ఎన్నో సార్లు కూటమి పెద్దలు చెబుతూ వస్తున్నారు.
కేంద్రంలో ఎన్డీయే రాష్ట్రంలో ఎన్డీయే. ఇలా రెండు ప్రభుత్వాలు డబుల్ ఇంజన్ సర్కార్ గా ముందుకు దూసుకుని పోతున్నాయని ఇప్పటికి ఎన్నో సార్లు కూటమి పెద్దలు చెబుతూ వస్తున్నారు. అక్కడా ఇక్కడా ఒకే పాలన సాగడం వల్ల అభివృద్ధి వేగంగా అద్భుతంగా సాగుతుందని కూడా అంటూ వస్తున్నారు. అయితే కొన్ని కీలక అంశాలలోనే డబుల్ ఇంజన్ సర్కార్ లో భాగమైన ప్రజా ప్రతినిధుల మధ్య వైరుధ్యాలు కనిపిస్తున్నాయని గుర్తు చేస్తున్నారు. అభివృద్ధికి సంబంధించిన అంశాలుగా ఇవి ఉండడమే గమనార్హం.
ఎయిర్ పోర్టు మీద భిన్న వైఖరి :
భోగాపురం ఎయిర్ పోర్టు విషయంలో విశాఖకు చెందిన టీడీపీ ఎంపీ అలాగే విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే మధ్య భిన్న వైఖరులు వ్యక్తం కావడం విశేషం. ఈ ఎయిర్ పోర్టు విశాఖకు ఎంతో దూరం అని కనీసం మూడు గంటలు పైగా సమయం అక్కడికి చేరుకోవడానికి పడుతుందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు అంటున్నారు. దాని వల్ల సమయం, ఇంధనం, డబ్బు అన్నీ వృధా అవుతాయని పైగా శ్రమ కూడా అవుతుందని ఎమ్మెల్యే చెబుతున్నారు. దానికి టీడీపీ ఎంపీ శ్రీ భరత్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.
జస్ట్ 45 నిమిషాలు :
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్ పోర్టు చేరుకోవడానికి జస్ట్ 45 నిముషాలు మాత్రమే పడుతుందని ఆయన అంటున్నారు. ఏమంతా దూరం కానే కాదని కొట్టి పారేస్తున్నారు. సులువుగానే అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎవరైనా చేరుకునే సదుపాయం ఉందని అంటున్నారు. ఈ విషయంలో బీజేపీ ఎమ్మెల్యే రాజు చేసిన వ్యాఖ్యలు కానీ అనుమానాలు ఆందోళలను కానీ ఎంపీ అయితే అసలు పట్టించుకున్నట్లు ఎక్కడా కనిపించడం లేదని అంటున్నారు.
బీచ్ కారిడార్ విషయం :
అంతే కాదు బీచ్ కారిడార్ విషయం మీద కూడా ఎంపీ ఎమ్మెల్యేల మధ్య భిన్న వాదనలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. బీచ్ కారిడార్ చివరి దశలో ఉంది అని ఎంపీ భరత్ చెబుతూంటే అది ఇపుడపుడే అయ్యేది కాదని బీజేపీ ఎమ్మెల్యే రాజు తేల్చేస్తున్నారు. ఈ బీచ్ కారిడార్ ఎందుకు అంటే విశాఖ నుంచి భోగాపురం ఎయిర్ పోర్టుకు డైరెక్ట్ గా వేగంగా చేరుకోవడానికి అన్న మాట. మరి అది కనుక అనుకున్నంత తొందరగా పూర్తి కాకపోతే ఎయిర్ పోర్టు కట్టినా జనాలకు రాకపోకలు ఇబ్బంది కదా అనందే రాజు గారి వాదన. కానీ అన్నీ అయిపోతాయి నిర్దిష్ట కాల పరిమితిలోనే అని ఎంపీ ధీమాగా చెబుతున్నారు.
డొమెస్టిక్ ఎయిర్ పోర్టుగా :
భోగాపురం ఎయిర్ పోర్టుకు కనెక్టివిటీ రోడ్స్ కానీ కారిడార్ కానీ పూర్తి స్థాయిలో సిద్ధం అయ్యేంతవరకూ అయినా విశాఖ ఎయిర్ పోర్టుని కొనసాగించాలని రాజు కోరుతున్నారు. డొమెస్టిక్ ఎయిర్ పోర్టుగా ఉంచితే అభ్యంతరం ఏముందని ఆయన ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు విశాఖలో ఒక ఎయిర్ పోర్టు భోగాపురంలో మరోటి ఉంటే కూడా అభివృద్ధి బాగా జరుగుతుంది కదా అని అంటున్నారు అయితే రాజు గారి సూచనలు సలహాల మీద కూటమి పెద్దలు ఎంత వరకూ ఆలోచిస్తున్నారో తెలియదు. కానీ టీడీపీ ఎంపీ భరత్ మాత్రం ఆల్ ఈజ్ వెల్ అంటున్నారు. సో డబుల్ ఇంజన్ సర్కార్ లో కీలకమైన రెండు పార్టీలు ఇద్దరు ప్రజా ప్రతినిధుల మధ్య అత్యంత కీలకమైన అంశంలో భిన్న వాదనలు వైఖరులు ఉండడం మాత్రం గమనార్హం. దాంతో అంతా డబుల్ ఇంజన్ లో డబుల్ కన్ఫ్యూజన్ అని సెటైర్లు వేస్తున్నారు.