బాబు వద్దన్నా.. అమెరికా వెళ్లిన రఘురామ.. మొత్తం ఐదుగురు ఎమ్మెల్యేలు అక్కడే..
ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగును ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలు లైట్ తీసుకున్నారా? అనే చర్చ జరుగుతోంది.;

ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగును ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలు లైట్ తీసుకున్నారా? అనే చర్చ జరుగుతోంది. తానా సభలకు వెళ్లొద్దంటూ సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలిచ్చినప్పటికీ ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రం అమెరికా వెళ్లడంపై కార్యకర్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ‘సుపరిపాలనలో తొలిఅడుగు’ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అంతా తప్పనిసరిగా పాల్గొనాలని అధినేత, సీఎం చంద్రబాబు ఆదేశించారు. తానా సభలకు ముందే నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ‘తొలి అడుగు’ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేసి ఎవరైనా తానా, ఆటా అంటే తాట తీస్తానని వార్నింగ్ ఇచ్చారు సీఎం. అయితే సీఎం వ్యాఖ్యలతో దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు తమ అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నా, ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రం తమ తానా పర్యటనకే మొగ్గు చూపారు. 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు జరిగిన తానా సభల్లో ఐదుగురు ఎమ్మెల్యేలు ప్రత్యక్షం కావడం చర్చకు దారితీస్తోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలను ధిక్కరించి తానా సభకు వెళ్లిన వారిలో ప్రముఖులు డిప్యూటీ స్పీకర్ రఘురామ రాజు ఉన్నారు. ఆయనతోపాటు నరసారావుపేట ఎమ్మెల్యే అరవిందబాబు, చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ బాబు, నందిగామ, మైలవరం ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, వసంత కృష్ణప్రసాద్ అమెరికా వెళ్లారు. ఈ ఐదుగురిలో రఘురామ, వసంత కృష్ణప్రసాద్ వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు. మిగిలిన ముగ్గురు తొలి నుంచి పార్టీలో ఉన్నప్పటికీ పార్టీ క్రమశిక్షణను అతిక్రమించి అమెరికా వెళ్లడమే అందరినీ ఆశ్యర్యానికి గురిచేస్తోంది.
అమెరికా వెళ్లిన ఐదుగురు ఎమ్మెల్యేలు అధినేత నుంచి అనుమతి తీసుకున్నారా? లేదా? అనే సందేహం వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యేల విదేశీ పర్యటనతో ఐదు నియోజకవర్గాల్లో దాదాపు 15 రోజులు పాటు ‘తొలి అడుగు’ కార్యక్రమం నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణపై తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తోంది. దీంతో ఎమ్మెల్యేల విదేశీ పర్యటనపై పార్టీకి ముందే సమాచారం ఉండి ఉంటుందని అంటున్నారు.
అయితే అధినేత ఆదేశాలను విస్మరించి ఎమ్మెల్యేలు విదేశాలకు వెళ్లడంపైనే అంతా చర్చించుకుంటున్నారు. సహజంగా తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యమిస్తారు. ఇక వ్యక్తిగతంగా క్రమశిక్షణకు విలువనిచ్చే డిప్యూటీ స్పీకర్ రఘురామ.. అసెంబ్లీని క్రమశిక్షణతో నడుపుతానని పలుమార్లు చెప్పారు. అలాంటి నాయకుడే అధినేత ఆదేశాలను కాదని అమెరికా వెళ్లడమేంటని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. అయితే రఘురామ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉండి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రామరాజు ఉండటంతో ‘తొలిఅడుగు’ కార్యక్రమం కొనసాగుతోందని చెబుతున్నారు. కానీ, మిగిలిన నాలుగు నియోజకవర్గాల్లోనే కార్యక్రమం కొనసాగడం లేదని అంటున్నారు.