హత్యకేసులో టీడీపీ ఎమ్మెల్యే సోదరుడు అరెస్ట్!
'రాజకీయం, రౌడీయిజం ఒక్కటి కాదురొరేర్'... ఒక సినిమాలోని డైలాగ్. కాకపోతే రెండు అవిభక్త కవలలు అనేది చాలామంది అనుభవజ్ఞుల అనుభవం!;
'రాజకీయం, రౌడీయిజం ఒక్కటి కాదురొరేర్'... ఒక సినిమాలోని డైలాగ్. కాకపోతే రెండు అవిభక్త కవలలు అనేది చాలామంది అనుభవజ్ఞుల అనుభవం! ఈ క్రమంలో తాజాగా ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి, ఎమ్మార్పీఎస్ రాయలసీమ జిల్లాల అధ్యక్షుడు చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య కేసులో టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు, గుమ్మనూరు నారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు.
అవును... హత్యకేసులో ఆలూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గుమ్మనూరు నారాయణను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. స్వగ్రామం చిప్పగిరి మండలం, గుమ్మనూరు గ్రామంలోని ఇంట్లో నారాయణ ఉన్నారనే పక్కా సమాచారంతో ఈస్పీ హుసేన్ పీరా, పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్య ఆధ్వర్యంలో భారీఎత్తున పోలీసు బలగాలు గుమ్మనూరు చేరుకొని అరెస్ట్ చేశారు.
కాగా... కాంగ్రెస్ నేత చిప్పగిరి లక్ష్మీనారాయణ గుంతకల్లులో పనులు ముగించుకొని తన వాహనంలో స్వగ్రమం చిప్పగిరికి బయలుదేరగా.. గుంతకల్లు శివారులో రిల్వే గేటు వద్ద పక్కా ప్రణాళికతో.. టిప్పర్ తో ఢీకొట్టి, ఆ వెంటనే మారణాయుధాలతో అతిదారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే.
లక్ష్మీనారాయణ 2007 నవంబర్ 18న జరిగిన కర్నూలు జిల్లా కీలక టీడీపీ నేత, కేడీసీసీబీ మాజీ చైర్మన్ వైంకుంఠ శ్రీరాములు, ఆయన సతీమణి శకుంతలమ్మ దంపతుల జంట హత్య కేసులో ఏడో నిందితుడిగా ఉన్నారు. అయితే.. ఈ కేసును న్యాయస్థానం కొట్టివేసింది. ఈ నేపథ్యంలో దీనికి ప్రతీకారంగానే ఈ హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు!
అయితే... గుంతకల్లు టౌన్ లోని ఓ భూమి విషయంలో లక్ష్మీనారాయణకు, గుంతకల్లుకు చెందిన గౌసియాబేగం మధ్య విభేదాలు తలెత్తడంతో.. గౌసీయా ఈ హత్య చేయించారని పోలీసులు దర్యాప్తులో తేలింది. దీంతో.. గైసీయాతోపాటు ఆమె పెద్దన్న, సైభాగ్య, రాజేష్ లతో పాటు మరో ఆరుగురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం కోర్టులో పరచగా.. న్యాయస్థానం వారికి రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో తాజాగా గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు గుమ్మనూరు నారాయణను పోలీసులు అరెస్ట్ చేయడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.