బాబుకు చిక్కులు: కంట్లో న‌లుసులుగా కీల‌క నేత‌లు ..!

ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లా జ‌గ్గంపేట‌లో జ‌రిగిన మినీ మ‌హానాడులో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వ్య‌వ‌హ‌రించిన తీరు.. పార్టీని రోడ్డున ప‌డేసింద‌నే టాక్ వ‌చ్చేలా చేసింది.;

Update: 2025-05-23 10:51 GMT

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు.. కంట్లో న‌లుసుగా మారింది. ఆయ‌న ప‌ట్టించుకోకుండా.. త‌ప్పుకొందామ‌ని అనుకున్నా.. చూసీ చూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించాల‌ని భావించి నా.. ఆ ప‌ని కావ‌డం లేదు. ఎక్క‌డిక‌క్క‌డ నాయ‌కుల అసంతృప్తి గ‌జ్జెక‌ట్టి న‌ర్తిస్తోంది. ముఖ్యంగా ప‌ద‌వులు- ప్రాధాన్యాల వ్య‌వ‌హారం పార్టీలో అగ్గి రాజేస్తోంది. ఈ వ్య‌వ‌హారం.. తాజాగా జ‌రుగుతున్న మినీ మ‌హానాడుల వేదిక‌గా.. స్ప‌ష్టంగా క‌నిపిస్తుండడం గ‌మ‌నార్హం.

ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లా జ‌గ్గంపేట‌లో జ‌రిగిన మినీ మ‌హానాడులో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వ్య‌వ‌హ‌రించిన తీరు.. పార్టీని రోడ్డున ప‌డేసింద‌నే టాక్ వ‌చ్చేలా చేసింది. ప‌ద‌వుల నుంచి ప్రారం భించిన ఆయ‌న‌... పొత్తుల వ‌ర‌కు కూడా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టీడీపీ పొత్తులు నిక‌రం కాద‌ని.. ఎప్పుడు ఏ పార్టీతో ఉంటుందో.. ఊడుతుందో కూడా తెలియ‌ద‌ని ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు నిజానికి పార్టీలో సెగ రేపుతున్నాయి.

అదే స‌మ‌యంలో ప‌ద‌వుల విష‌యంపైనా జ్యోతుల నిప్పులు చెరిగారు. మిత్ర‌ప‌క్షంగా ఉన్న జ‌న‌సేన‌కు మాత్ర‌మే ప‌ద‌వులు ఇస్తున్నార‌ని.. పార్టీని న‌మ్ముకున్న వారికి ఇవ్వ‌డం లేద‌ని.. ఆయ‌న చేసిన విమ‌ర్శ‌లు నిజానికి చంద్ర‌బాబుకు మ‌రింత ఇబ్బందిక‌రంగా మారాయి. ఈ రెండు విష‌యాలే కాదు.. త‌న వ్య‌క్తిగ‌త అంశాల‌ను కూడా ప‌రోక్షంగా ప్ర‌స్తావించిన‌.. ఆయ‌న కాక రేపారు. ఇక‌, అనంత‌పురంలోని క‌ల్యాణ‌దుర్గంలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో సీనియ‌ర్ కార్య‌క‌ర్త ఆత్మ‌హ‌త్య‌కు దిగారు. త‌న‌కు ప్రాధాన్యం లేకుండా పోయింద‌ని.. ఇటీవ‌ల పార్టీ తీర్థం పుచ్చుకున్న‌వారికి ప‌ద‌వులు ఇచ్చార‌ని యాగీ చేశారు.

ప‌ల్నాడులోని ఓ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన మినీ మ‌హానాడులో ఇద్ద‌రు నాయ‌కులు దుమ్మురేపారు. నేరుగా ఎమ్మెల్యే తీరును వారు ప్ర‌శ్నించారు. ఇలా అయితే.. పార్టీ ఎలా వృద్ధి చెందుతుంద‌ని కూడా ప్ర‌శ్నించారు. అంతేకాదు..అవినీతికి సాక్ష్యాలు కూడా ఉన్నాయ‌నిచెప్ప‌డం మ‌రింత మంట పెట్టింది. అలాగే.. మైల‌వ‌రంలో నిర్వ‌హించిన మినీ మ‌హానాడులో సీనియ‌ర్‌నాయ‌కులు దూరంగా ఉన్నారు. ముఖ్యంగా టికెట్ త్యాగం చేసిన దేవినేని ఉమా.. అటు వైపు క‌న్నెత్తి చూడ‌లేదు. ఇలా.. మినీ మ‌హానాడుల్లో నాయ‌కులు వ్య‌వ‌హ‌రించిన తీరు.. చంద్ర‌బాబుకు కంట్లోన‌లుసుగా మార‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News