నా తెలుగు కుటుంబం-6 శాసనాలు: లోకేశ్

తెలుగుజాతి విశ్వఖ్యాతి మొదటి శాసనం అని, టీడీపీ వల్లే తెలుగువారికి దేశంలో, ప్రపంచంలో ప్రత్యేక గౌరవం, గుర్తింపు లభించిందని అన్నారు.;

Update: 2025-05-27 18:58 GMT

కడపలో టీడీపీ మహానాడు సందర్భంగా ఆరు శాసనాలతో ‘నా తెలుగు కుటుంబం’ లోగోను మంత్రి నారా లోకేశ్ ఆవిష్కరించారు. తెలుగు ప్రజల సమగ్రాభివృద్ధి, సంక్షేమం ధ్యేయంగా 6 కీలక శాసనాలను తెచ్చామని అన్నారు. ఈ ఆరు సూత్రాలను కచ్చితంగా అమలు చేస్తామన్నారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ శాసనాలను రూపొందించామన్నారు. పార్టీ మూల సిద్దాంతం స్ఫూర్తితో ప్రస్తుత ప్రజా అవసరాలకు అనుగుణంగా విధానపరమైన మార్పులు తీసుకురావాలని ఆకాంక్షించారు.

అన్న ఎన్టీఆర్ హయాంలో ఆత్మాభిమానం నినాదం నియంతృత్వాన్ని తరిమేసిందని, చంద్రబాబు హయాంలో ఆత్మవిశ్వాసం నినాదం తెలుగు ప్రజల భవిష్యత్తుకు పునాది వేసిందని చెప్పారు. ఆ ఇద్దరి స్ఫూర్తితో ప్రజలకు, పార్టీకి, కార్యకర్తలకు మంచి భవిష్యత్తు అందించేందుకు ఈ ఆరు శాసనాలను ప్రతిపాదిస్తున్నానని చెప్పారు. ఆ ఆరు శాసనాల అమలుకు కృషి చేస్తానని చెప్పారు.

తెలుగుజాతి విశ్వఖ్యాతి మొదటి శాసనం అని, టీడీపీ వల్లే తెలుగువారికి దేశంలో, ప్రపంచంలో ప్రత్యేక గౌరవం, గుర్తింపు లభించిందని అన్నారు. ఢిల్లీ మెడలు వంచి మళ్లీ ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్ స్ఫూర్తిగా ముందుకు సాగుతామని అన్నారు.. అన్ని రంగాల్లో తెలుగువారే ముందుండాలని, ప్రపంచ పటంలోని ప్రతి దేశంలో తెలుగు వారు పనిచేసేందుకు అవకాశం కల్పించింది చంద్రన్న అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగుజాతి ఖ్యాతి పెంపొందించడమే అజెండాగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

యువగళం రెండో శాసనం అని, పార్టీలో యువతకు పెద్దపీట వేయబోతున్నామని తెలిపారు. అదే సమయంలో సీనియర్లను గౌరవిస్తామని, పనిచేసేవారిని ప్రోత్సహిస్తామని చెప్పారు.

స్త్రీ శక్తి మూడో శాసనం అని... అన్న ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారని గుర్తు చేశారు. అయితే, మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం ఇచ్చిందని చంద్రన్న అని చెప్పారు. మహిళలను మరింత బలోపతం చేసేందుకు స్త్రీ శక్తి ద్వారా కృషి చేయాలని, పార్టీ పదవుల దగ్గర్నుంచి అన్ని రంగాల్లో మహిళలకు సమాన బాధ్యత, భద్రత కల్పించాలని అన్నారు.

పేదల సేవలో – సోషల్ రీ ఇంజనీరింగ్ నాలుగో శాసనం అని చెప్పారు. పేదరికం లేని సమాజం పార్టీ లక్ష్యం అని, 2 రూపాయలకే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పక్కా ఇళ్లు, పెన్షన్ ఇచ్చింది అన్న ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. పెన్షన్ 5 రెట్లు పెంచి 200 నుంచి 4వేలు చేసింది మన చంద్రబాబు అని చెప్పారు. ప్రతి వారికి న్యాయం చేసేలా సోషల్ రీ ఇంజనీరింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

అన్నదాతకు అండగా ఐదో శాసనం అని.. రైతు లేకపోతే సమాజమే లేదని లోకేశ్ చెప్పారు. మట్టిలో నుంచి బంగారం పండించే అన్నదాతకు అండగా ఉంటామని చెప్పారు.

కార్యకర్తే అధినేత ఆరో శాసనం అని...కరుడుగట్టిన కార్యకర్తలే టీడీపీ బలం, బలగం అని చెప్పారు కార్యకర్తలను ఆదుకోవడానికి, సొంత కాళ్లపై నిలబడేందుకు పార్టీ ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోందని అన్నారు.

Tags:    

Similar News