శ్రీకాకుళం నుంచి.. నెల్లూరుకు 'మహానాడు' మారిందెలా?
ఈనెల 29న అన్నగారి జయంతిని పురస్కరించుకుని నిర్వహించే మహానాడుకు రెండు ప్రత్యేకతలు ఉ న్నాయి.;
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు.. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఏటా నిర్వహించే పసుపు పండుగ `టీడీపీ మహానాడు.` పార్టీలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ మహానాడును మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఒక్క కరోనా సమయంలోనే ఆన్‌లైన్ వేదికగా దీనిని నిర్వహించా రు. ఆ తర్వాత.. పలు జిల్లాల్లో దీనిని నిర్వహిస్తూ.. పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
ఈనెల 29న అన్నగారి జయంతిని పురస్కరించుకుని నిర్వహించే మహానాడుకు రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. 1) తాజాగా జాతీయ, రాష్ట్ర స్థాయిలో కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోవడం. ఇప్పటికే వారితో ప్రమా ణం కూడా చేయించారు. ప్రస్తుతం వీరి ఆధ్వర్యంలోనే మహానాడును నిర్వహించాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో యువత సెంట్రిక్‌గానే మహానాడును నిర్వహిం చేందుకు ప్రాధాన్యం ఇచ్చారు.
2) మహిళలకు ప్రాధాన్యం: ఈ దఫా టీడీపీలో మహిళా నాయకత్వాన్ని బలోపేతం చేయాలన్న లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే కమిటీలలోనూ వారికి ప్రాధాన్యం ఇచ్చారు. మహానాడు వేదికగా.. మహిళా ప్రాతినిధ్యంపై కీలక ప్రకటన చేయనున్నారు. ఈ నేపథ్యంలో మహానాడుకు అత్యంత ప్రాధాన్యం పెరిగింది. మరో రెండున్నరేళ్లలో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం కూడా రానున్న నేపథ్యం కూడా దీనికి తోడైంది.
వేదిక మార్పు వెను..
వాస్తవానికి ఈ దఫా మహానాడును శ్రీకాకుళంలో నిర్వహించాలని భావించారు. దీనికి సంబంధించి టెక్క లి, ఎచ్చర్ల నియోజకవర్గాల్లో రెండు చోట్ల పలు ప్రాంతాలను కూడా పరిశీలించారు. అయితే.. అనూహ్యంగా ఈ వేదిక నెల్లూరుకు మారింది. శ్రీకాకుళం కడు దూరంగా ఉండడం.. కార్యకర్తలను ఎండలో అక్కడకు తరలించడం ఇబ్బందిగా ఉంటుందన్న నేపథ్యంలో వేదికను నెల్లూరుకు మార్చారు. అదేసమయంలో సీమలో పార్టీని బలోపేతం చేయాలన్న లక్ష్యం కూడా దీనికి కలిసి వచ్చింది. కాగా.. గత ఏడాది మహానాడును కడపలో నిర్వహించిన విషయం తెలిసిందే.