బాబు వద్దన్నా ఒత్తిడి తెచ్చారు.. ఇదే టీడీపీ ఇష్యూ!
టీడీపీలో పెను వివాదానికి .. అంతర్గత కుమ్ములాటలకు కారణాలపై పార్టీ అన్వేషిస్తున్న విషయం తెలిసిందే.;
టీడీపీలో పెను వివాదానికి .. అంతర్గత కుమ్ములాటలకు కారణాలపై పార్టీ అన్వేషిస్తున్న విషయం తెలిసిందే. పార్టీలో సుదీర్ఘకాలంగా ఉన్న వారితో ఇబ్బందులు లేకపోయినా.. మధ్యలో వచ్చిన వారు.. గత ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన వారితోనే వివాదం వస్తోందని గుర్తించారు. గత 17 మాసాల్లో పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలపై అధ్యయనం, నివేదికలు కూడా తెప్పించుకున్నాక.. విషయాన్ని గుర్తించారు.
గత ఏడాది సెప్టెంబరులో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం(వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు) వ్యవహారం తర్వాత.. అదేరేంజ్‌లో తిరువూరు నియోజకవర్గంలోనూ చోటు చేసుకుంది. ఆ తర్వాతకూడా ఇతర పార్టీల నుంచి వచ్చి గెలిచిన వారి నియోజకవర్గాల్లోనే వివాదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటిని అధ్యయనం చేసిన పార్టీ అధినేత చంద్రబాబు.. కొత్తవారి కారణంగానే పార్టీలో వివాదాలు, విభేదాలు చోటు చేసుకుంటున్నాయని గుర్తించారు.
అలాగని ఇప్పటికిప్పుడు వారిపై చర్యలు తీసుకుని సస్పెన్షన్ వేటు వేయడమూ సరికాదన్నది పార్టీ అభి ప్రాయం. ఈ నేపథ్యంలో వారిని సరిదిద్దే అంశాలపై పార్టీ దృష్టి పెట్టింది. అయితే.. అసలు ఈ విధంగా నా యకులు ఇతర పార్టీలనుంచి రావడానికి కారణం.. కొందరు నేతలు చేసిన ఒత్తిడేనని గుర్తించారు. అప్ప ట్లోనే చంద్రబాబు వారించినా.. కొందరు సీనియర్లే వారిని చేర్చుకోవాలని.. పార్టీ బలోపేతం అవుతుందని వ్యాఖ్యానించారు. దీంతో చంద్రబాబు ముక్త సరిగా తలూపారు.
కానీ, ఇలా పార్టీలో చేరిన వారు టీడీపీ సిద్ధాంతాలపై అవగాహన లేకపోగా.. కోవర్టులుగా మారారన్నది ప్రస్తుతం వినిపిస్తున్న మాట. దీంతో అసలు వారిని ఎవరు తీసుకు వచ్చారన్న విషయంపై దృష్టి పెట్టిన పార్టీ అధినేత.. వారితోనే మాట్లాడాలని.. తీసుకువచ్చిన వారే సరిచేసేలా వారిని ప్రోత్సహించాలని పార్టీ ఇబ్బందులు పడకుండా చూడాలని కూడా ఆదేశించారు. ఎవరైతే తీసుకువచ్చారో.. ఇక నుంచి పార్టీ వివాదాలకు వారినే బాధ్యులను చేయాలని కూడా ఆలోచన చేస్తున్నారు. మరి ఇది ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.