విజయవాడ పార్లమెంటుకు వాస్తుదోషమా..! తారాస్థాయికి టీడీపీ నేతల క్రమశిక్షణా రాహిత్యం

ఇక మైలవరం, నందిగామ నియోజకవర్గాల్లో కూడా పార్టీ నేతల మధ్య విభేదాలు తరచూ పత్రికలకు ఎక్కుతున్నాయని కార్యకర్తలు వాపోతున్నారు.

Update: 2026-07-28 10:04 GMT

అధికార తెలుగుదేశం పార్టీకి తిరుగులేని ఆదరణ ఉన్న విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో పార్టీ ముఖ్యనేతల క్రమశిక్షణా రాహిత్యం హాట్ టాపిక్ అవుతోంది. సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా వివాదంతో తాజాగా మరోసారి తెరపైకి వచ్చిన ఈ అంశం పార్టీలో అంతర్గతంగా విస్తృత చర్చకు దారితీస్తోంది. విజయవాడ పార్లమెంటు పరిధిలో ఏడు నియోజకవర్గాల్లో ఒకటి రెండు చోట్ల దాదాపు మిగిలిన నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు హీట్ పుట్టిస్తున్నాయని అంటున్నారు. గతంలో ఇదే నియోజకవర్గం పరిధిలోకి వచ్చే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుతో పార్టీకి తలబొప్పి కట్టిందని గుర్తుచేస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య ప్రాతినిధ్యం వహిస్తున్న నందిగామతోపాటు మైలవరం నియోజకవర్గాల్లోనూ పార్టీ నేతల మధ్య విభేదాలు తీవ్రంగా ఉన్నాయని వ్యాఖ్యానిస్తున్నారు.

సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా ధిక్కారంతో అధికార పార్టీలో ఏం జరుగుతుంది అనే ప్రశ్నలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. రాష్ట్ర రాజధాని ప్రాంతంలో పార్టీలో నేతలు ఐక్యంగా ఉండాల్సివుండగా, ఎవరికి వారు స్వతంత్రంగా వ్యవహరిస్తున్న సంకేతాలు కలకలం రేపుతున్నాయని అంటున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి నిన్నమొన్నటి వరకు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుతో కార్యకర్తలు, నేతలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తరచూ క్రమశిక్షణా రాహిత్యంతో అధిష్టానం ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే కొలికపూడి ఇప్పుడిప్పుడే సెట్ రైట్ అవుతున్నారని అనుకుంటుండగా బొండా ఉమా మాటల బాంబులు పేల్చుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక మైలవరం, నందిగామ నియోజకవర్గాల్లో కూడా పార్టీ నేతల మధ్య విభేదాలు తరచూ పత్రికలకు ఎక్కుతున్నాయని కార్యకర్తలు వాపోతున్నారు. పార్టీకి అత్యంత కీలకమైన రాజధాని ప్రాంతంలో నేతలు ఇలా ప్రవర్తించడంపై కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలు గమనిస్తున్న వారు టీడీపీకి విజయవాడ పార్లమెంటులో వాస్తు దోషం వెంటాడుతున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఎప్పుడూ విజయవాడ పార్లమెంటు పరిధిలో ఎమ్మెల్యే లేదా ఎంపీలతో అధిష్టానానికి ఏదో ఒకరకమైన తలనొప్పి ఉంటూ వస్తోందని అంటున్నారు.

2019-24 మధ్య విజయవాడ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన కేశినేని నాని సైతం అధిష్టానంపై తిరుగుబాటు చేయడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఎంపీ చిన్న హైకమాండ్ పై విధేయత చూపుతున్నా పార్లమెంటు పరిధిలోని ఏదో ఒక ఎమ్మెల్యేతో లొల్లి ఉంటూనే ఉందని అంటున్నారు. దీనివల్ల పార్టీకి తలనొప్పులు తప్పడం లేదని అంటున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాలంటే పార్టీ పెద్దలు విజయవాడ పార్లమెంటు పరిధిలో ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో కూలంకుషంగా చర్చించాలని, నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని పరిశీలకులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News