విశాఖ పీఠంపై పీలా? కూటమి మేయర్ అభ్యర్థి ఫిక్స్

రాష్ట్రం అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ టీడీపీ ఖాతాలోకి చేరింది. వైసీపీకి చెందిన మేయర్ హరి వెంకట కుమారిపై కూటమి పార్టీలు ప్రతిపాదించిన అవిశ్వాసం నెగ్గింది.;

Update: 2025-04-19 07:37 GMT

రాష్ట్రం అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ టీడీపీ ఖాతాలోకి చేరింది. వైసీపీకి చెందిన మేయర్ హరి వెంకట కుమారిపై కూటమి పార్టీలు ప్రతిపాదించిన అవిశ్వాసం నెగ్గింది. దీంతో మేయర్ హరివెంకట కుమారి తన పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కొత్త మేయర్ గా టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు ఎన్నిక లాంఛనమే అంటున్నారు. ఆయన పేరును అధికారికంగా ప్రకటించడమే మిగిలివుందని టాక్ వినిపిస్తోంది.

విశాఖ మేయర్ గా 2021లో జరిగిన ఎన్నికల్లో హరి వెంకట కుమారి ఎన్నికయ్యారు. సుమారు నాలుగేళ్ల పాటు పదవిలో కొనసాగారు. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేయర్ హరివెంకట కుమారి పదవికి ప్రమాదం ఏర్పడింది. వైసీపీకి చెందిన దాదాపు 20 కార్పొరేటర్లు కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరిపోయారు. దీంతో కూటమి బలం 58కి పెరిగింది. ఫలితంగా మేయర్ పై అవిశ్వాసం ప్రవేశపెట్టారు.

వైసీపీ బలం 30కి పడిపోవడంతో శనివారం అవిశ్వాసంపై చర్చ కోసం జరిగిన ప్రత్యేక సమావేశాన్ని ఆ పార్టీ కార్పొరేటర్లు బహిష్కరించారు. అదేసమయంలో సమావేశానికి హాజరైన టీడీపీ కూటమి కార్పొరేటర్లతోపాటు ఎక్స్ అఫీషియో సభ్యులైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కలిపి 74 మంది సభ్యులు మేయర్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి మద్దతుగా ఓటేశారు. దీంతో మేయర్ హరివెంకట కుమారి తన పదవిని కోల్పోయారు. ఇక ఆమె స్థానంలో కొత్తవారి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కావాల్సివుంది.

జీవీఎంసీ మేయర్ పదవీ కాలం ఇంకో పది నెలలు మాత్రమే ఉంది. వచ్చే ఏడాది మార్చిలో కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పది నెలల కాలానికి మేయర్ ఎవరు అవుతారన్నది ఆసక్తి రేపుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కలిపి మేయర్ అభ్యర్థిని నిర్ణయిస్తారని సమావేశానంతరం కూటమి ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వంశీ క్రిష్ణ శ్రీనివాస్ ప్రకటించారు. అయితే మేయర్ అభ్యర్థిని ఇప్పటికే నిర్ణయించారని, అధికారికంగా ప్రకటించడమే పెండింగులో ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

విశాఖ కొత్త మేయర్ గా అనకాపల్లికి చెందిన టీడీపీ నేత, ప్రస్తుత ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. 2021లో జరిగిన ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా ఆయన పేరునే టీడీపీ ప్రకటించింది. ఇప్పుడు కూడా కార్పొరేటర్ల క్యాంపు రాజకీయంతోపాటు వైసీపీ కార్పొరేటర్లను పార్టీలో చేర్చుకోవడం వరకు అన్నీ పీలా శ్రీనివాసరావు పర్యవేక్షించారని అంటున్నారు. అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ సోదరుడైన శ్రీనివాసరావుకి బలమైన సామాజిక నేపథ్యం కూడా కలిసివస్తుందని అంటున్నారు. అదేవిధంగా జనసేన ఎమ్మెల్యే కొణతాల రామక్రిష్ణకు బంధుత్వం ఉంది. ఇది కూడా ఆయన అవకాశాలను మెరుగు పరుస్తుందంటున్నారు.

Tags:    

Similar News