గుంటూరులో పొలిటిక‌ల్ 'భాష్యం' మారుతుందా?

ఉమ్మ‌డి గుంటూరు జిల్లా నుంచి సుదీర్ఘ‌కాలం విరామం త‌ర్వాత‌.. టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ప్ర‌ముఖ విద్యా సంస్థ‌ల అధినేత భాష్యం రామ‌కృష్ణ ఎంపిక‌య్యారు.

Update: 2026-06-08 23:30 GMT

ఉమ్మ‌డి గుంటూరు జిల్లా నుంచి సుదీర్ఘ‌కాలం విరామం త‌ర్వాత‌.. టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ప్ర‌ముఖ విద్యా సంస్థ‌ల అధినేత భాష్యం రామ‌కృష్ణ ఎంపిక‌య్యారు. సీఎం చంద్ర‌బాబు ఆయ‌న‌ను ఎంపిక చేయ డంతో జిల్లావ్యాప్తంగా హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అసెంబ్లీలో కూట‌మి పార్టీల‌కు బ‌లం ఉన్న నేప‌థ్యంలో భాష్యం రామ‌కృష్ణ పెద్ద‌ల స‌భ‌లో అడుగు పెట్ట‌డం లాంఛ‌న‌మే కానుంది. ఇదిలావుంటే.. భాష్యం ఎంపిక ప్ర‌క‌ట‌న వ‌చ్చిన త‌ర్వాత‌.. ఆయ‌నను అభినందిస్తూ.. శుభాకాంక్ష‌లు చెబుతూ.. జిల్లా వ్యాప్తంగా ఉన్న పార్టీ నాయ‌కులు క్యూ క‌ట్టారు.

వీరిలో అన్ని నియోజ‌క‌వ‌ర్గాల ఎమ్మెల్యేలు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. అదేవిధంగా సీనియ‌ర్ల నుంచి జూనియ‌ర్ల వ‌ర‌కు కూడా భాష్యం రామ‌కృష్ణ‌ను అభినందించారు. ఈ ప‌రిణామం.. పార్టీలో ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న వాతావ‌ర‌ణాన్ని అనూహ్యంగా మార్చేసింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కుఎవ‌రికి వారుగా ఉన్న కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల నాయ‌కులు.. కార్య‌క‌ర్త‌లు సైతం.. భాష్యం ఇంటికి క్యూ క‌ట్టారు. దీంతో గుంటూరు రాజ‌కీ యాల్లో భ‌విష్య‌త్తు కాలంలో భాష్యం కీల‌క రోల్ పోషించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

క‌లిసి వ‌చ్చేవి ఇవే..

భాష్యం రామ‌కృష్ణ టీడీపీకి అనుకూలంగా ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న ఎప్పుడూ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల జోలికి రాలేదు. అంతేకాదు.. వివాదాల జోలికి కూడా పోలేదు. కానీ, స‌మాజంలోనూ.. పార్టీప‌రంగా కూడా.. ఆయ‌న కు మంచిసానుకూల సంబంధాలే ఉన్నాయి. అంద‌రికీ అందుబాటులో ఉండ‌డ‌మే కాకుండా.. గుంటూరు పై మంచి ప‌ట్టుంది. ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుపుకొని పోయే ల‌క్ష‌ణంతో పాటు.. సౌమ్యుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. మంచి విజ్ఞానం, దూర‌దృష్టి సొంతం చేసుకున్న భాష్యం ఇప్పుడు.. రాజ‌కీయంగా కీల‌క రోల్ పోషించ‌నున్నారు.

వాస్త‌వానికి ఎన్నికైన ప్ర‌జాప్ర‌తినిధితో పోల్చుకుంటే.. రాజ్య‌స‌భ ఒక‌ర‌కంగా నామినేటెడ్ ప‌ద‌వే అయినా.. ఈ స‌భ్యుల‌కు కూడా అన్ని హ‌క్కులు, అధికారాలు, నిధులు వ‌స్తాయి. పైగా పార్టీ అధిష్టానానికి అత్యంత నమ్మ‌క‌మైన నాయ‌కుడిగా ఉండ‌డం.. వివాదాల‌కు అతీతంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో చంద్ర‌బాబు ద‌గ్గ‌ర కూడా భాష్యానికి మంచి మార్కులు ప‌డ్డాయి. ఈ ప‌రిణామం.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి గుంటూరు రాజ‌కీయాల్లో ముఖ్యంగా త‌ట‌స్థులు, వివాదాస్ప‌ద నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆయ‌న జోక్యంతో పార్టీకి మేలు జ‌రుగుతుంద‌న్న చ‌ర్చ సాగుతోంది. ఏదేమైనా ఇది రాబోయే రోజుల్లోనే తేలుతుంది.

Tags:    

Similar News