ఇంకా తెగని తిరువూరు తంటా! ఫైనల్ డెసిషన్ కు చంద్రబాబు రావాల్సిందే..

టీడీపీలో తిరువూరు పంచాయితీకి ఎండ్ కార్డు పడలేదు. పార్టీ ఆదేశాల ప్రకారం మంగళవారం క్రమశిక్షణ కమిటీ ముందుకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు హాజరయ్యారు.;

Update: 2025-11-05 07:56 GMT

టీడీపీలో తిరువూరు పంచాయితీకి ఎండ్ కార్డు పడలేదు. పార్టీ ఆదేశాల ప్రకారం మంగళవారం క్రమశిక్షణ కమిటీ ముందుకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఇద్దరిని వేర్వేరుగా విచారించిన క్రమశిక్షణ సంఘం సభ్యులు బుధవారం పార్టీ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు నివేదిక ఇవ్వనున్నారు. ఆయన పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరనున్నారు. పార్టీ భావినేత, మంత్రి లోకేశ్ మంగళవారం కేంద్ర పార్టీ కార్యాలయంలోనే ఉన్నప్పటికీ ఇద్దరు నేతలను కలవకపోవడం విశేషం.

తిరువూరు నియోజకవర్గంలో పందెం కోళ్లు మాదిరిగా ఎంపీ, ఎమ్మెల్యే ఘర్షణకు దిగడం వల్ల పార్టీ పరువు బజారున పడుతోందని అధినేత చంద్రబాబు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ పరస్పరం ఆరోపణలు, విమర్శలు చేసుకుంటుండటం వల్ల నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి గందరగోళంగా మారింది. అంతేకాకుండా ఈ వివాదంపై కఠిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఇదే తరహా సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. దీంతో ఇద్దరి నుంచి వివరణ తీసుకోవాల్సిందిగా లండన్ పర్యటనకు ముందు చంద్రబాబు ఆదేశించారు. ఇద్దరి వివరణ పరిశీలించి తాను లండన్ నుంచి రాగానే చర్యలు తీసుకుంటానని వెల్లడించారు.

ఇక చంద్రబాబు గురువారం విదేశీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి రానున్నారు. క్రమశిక్షణ సంఘానికి ఎంపీ చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి ఏం చెప్పారనేది ఉత్కంఠ రేపుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇద్దరూ తమ వాదనకే కట్టుబడినట్లు తెలుస్తోంది. ఎంపీ చిన్ని తన నియోజకవర్గ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వరని ప్రచారం చేస్తూ, తన మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నారని ఎమ్మెల్యే కొలికపూడి ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. ఎంపీ శివనాథ్ తిరువూరు రాజకీయాలను పట్టించుకోని పక్షంలో ఆయనతో తనకు ఎలాంటి గొడవ ఉండదని ఎమ్మెల్యే కొలికపూడి స్పష్టం చేసినట్లు కథనాలు వస్తున్నాయి.

ఇదే సమయంలో ఎంపీ చిన్న సైతం తన వాదన వినిపించారు. తన పార్లమెంటు పరిధిలో పార్టీ బలోపేతం కోసం తాను పనిచేస్తున్నానని, మిగిలిన నియోజకవర్గాలు మాదిరిగానే తిరువూరులో కూడా పర్యటిస్తున్నట్లు వివరణ ఇచ్చారని అంటున్నారు. పార్టీకి నష్టం కలిగించేలా తాను గీత దాటి వ్యవహరించలేదని ఎంపీ చిన్ని స్పష్టం చేశారని అంటున్నారు. పార్టీ కోసం తాను 2014 నుంచి కష్టపడుతున్నానని, పార్టీ సిద్ధాంతాలపై పూర్తి అవగాహన ఉందని తెలిపారు. వ్యక్తిగత అజెండాతో పార్టీని నాశనం చేయాలనుకునే వారి విషయంలో నేనే కఠినంగా ఉండాల్సివస్తోందని వివరణ ఇచ్చారు. తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఎవరితో విభేదాలు లేవని, ఎవరికైనా తనతో సమస్య ఉంటే తానే ఒక అడుగు దిగి పరిష్కరించుకుంటానని వెల్లడించారు. అంతేకాకుండా చంద్రబాబుకు తాను వీర భక్తుడినని, పార్టీయే తనకు దైవమని మీడియాతో ఎంపీ చిన్ని తెలిపారు.

పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో క్రమశిక్షణ సంఘం సభ్యులు వర్ల రామయ్య, పంచుమర్తి అనూరాధ, కొనకళ్ల నారాయణ, ఎంఏ షరీఫ్ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ చిన్ని నుంచి వివరణ తీసుకున్నారు. ఎమ్మెల్యే కొలికపూడితో సుమారు 4 గంటలపాటు క్రమశిక్షణ సంఘం భేటీ అయింది. ఎంపీపై గతంలో ఆయన చేసిన ఆరోపణలకు సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక ఇచ్చారు. కాగా, తనపై పార్టీ అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని మీడియాతో స్పష్టం చేశారు. ఇక క్రమశిక్షణ సంఘం విచారణ అనంతరం ఈ ఇద్దరి పంచాయితీకి ఎలాంటి ముగింపు ఉంటుందనే ఆసక్తి పెరిగిపోయింది. ఇద్దరి వ్యవహారశైలిపై ఆగ్రహంగా ఉన్న సీఎం చంద్రబాబు.. ఇద్దరి వివరణలను పరిశీలించి ఎవరిపై వేటు వేస్తారనేది ఉత్కంఠ రేపుతోంది.

Tags:    

Similar News