సొంత ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టిన దాడి
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేసే క్రమంలో సొంత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేశారు;
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేసే క్రమంలో సొంత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేశారు. అనకాపల్లి జిల్లాలో అధికారులు అక్రమాలు అవినీతి అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం ఇపుడు టీడీపీతో పాటు కూటమిలోనూ చర్చనీయాంశం అయింది. దాడి ఎవరిని విమర్శిస్తున్నారు అన్నది అర్ధం కాక అంతా ఆలోచనలో పడిపాయారు.
అనకాపల్లి జిల్లాలో కూటమి ప్రజా ప్రతినిధులే ఉన్నారు. అనకాపల్లి ఎమ్మెల్యేగా దాడి ఒకనాటి రాజకీయ ప్రత్యర్ధి కొణతాల రామకృష్ణ జనసేన నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక అనకాపల్లి రాజకీయం దాడికి అందకుండా పోతోంది అన్న ఆవేదన ఉంది అని అంటున్నారు. అనకాపల్లి ఎంపీగా బీజేపీ నుంచి బిగ్ షాట్ సీఎం రమేష్ ఉన్నారు.
అనకాపల్లి టీడీపీలో మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ ఇతర కీలక నేతల హవా సాగుతోంది. దాంతో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చినా దాడికి సరైన ప్రాధాన్యతగా లభించడం లేదు అని అంటున్నారు. నామినేటెడ్ పదవులు కూడా ఆయన కుటుంబం దాకా రాలేదు. పార్టీలు మారి వచ్చారు అని పక్కన పెడుతున్నారు. అదే విధంగా వచ్చే ఎమ్మెల్సీగా అయినా చోటు కల్పించలేదు అన్న ఆవేదన ఆయనకు ఉంది అని అంటున్నారు.
ఈ నేపధ్యంలో మినీ మహానాడు వేదికగా దాడి అధికారుల మీద తన ఆగ్రహం చూపించారు అని అంటున్నారు. అధికారులు అవినీతి అని ఆయన చేసిన విమర్శలు అటు తిరిగి ఇటు తిరిగి ప్రభుత్వం మీదకే వస్తాయని పెద్దాయన గ్రహించలేకపోయారా అన్న చర్చ సాగుతోంది. అంతే కాదు అవినీతి అధికారుల భరతం పట్టాలని ఆయన కోరుతున్నారు. చంద్రబాబుకు చెడ్డపేరు తెస్తున్నారు అని మండిపడుతున్నారు. అవినీతి అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సిందే అని అంటున్నారు. మొత్తానికి దాడి చేసిన ఈ రీసౌండ్ టీడీపీలో చర్చగా ఉంది. పెద్దాయన చేసిన దాడి ఎవరి మీద అని అంతా హాట్ డిస్కషన్ చేస్తున్నారు.