టీడీపీకి మరింత మంది మహిళా లీడర్లు...?
టిడిపికి మరింత మంది మహిళలు అవసరం అవుతారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.;
టిడిపికి మరింత మంది మహిళలు అవసరం అవుతారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం పార్టీలో మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకు పార్టీ అధినేత సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే ఏర్పాటు చేయనున్న రాష్ట్రస్థాయి కమిటీలో మహిళల రిజర్వేషన్ పెంచాలని భావిస్తున్నారు. తద్వారా 33% మేరకు పార్టీ పదవుల్లో ముఖ్యంగా రాష్ట్రస్థాయి నాయకత్వంలో మహిళలకు అవకాశం దొరుకుతుంది.
ఇది ఒక రకంగా పార్టీ ఆవిర్భావం తర్వాత సంచలన నిర్ణయం అనే చెప్పాలి. ఇప్పటివరకు రాష్ట్రస్థాయి నాయకత్వంలో మహిళా నాయకులకు ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ ఇప్పుడు 33 శాతం మందిని ఖచ్చితంగా నియమించాలని పార్టీ నిర్ణయించింది. తద్వారా మెజారిటీ మహిళ నాయకులకు రాష్ట్రస్థాయి కమిటీలో అవకాశం దొరుకుతుంది. మరోవైపు నియోజకవర్గాల సంఖ్య పెరిగితే.. మహిళా నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు కూడా మరింత మంది మహిళ నాయకులు అవసరం ఏర్పడుతుంది.
దాదాపు 80 నియోజకవర్గాలపైగా మహిళలకు కేటాయిస్తారన్న చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఆమేరకు మహిళా నాయకత్వాన్ని పెంచుకునేందుకు పార్టీ ప్రయత్నిస్తోంది. దీనికి ప్రధానంగా రెండు కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారని సమాచారం.
1) సంస్థా గతంగా పార్టీలో ఉన్న మహిళా నాయకులు. అదేవిధంగా వారసత్వంగా పార్టీకి సేవ చేస్తున్న నేతలు.
2) యువతను ప్రోత్సహించే ఉద్దేశంతో పార్టీ వేస్తున్న అడుగులు, తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా ఆకర్షితులవుతున్న యువతులను పార్టీలోకి తీసుకుని వారికి పదవులు కట్టబెట్టాలని భావిస్తోంది, అయిన ప్పటికీ నాయకత్వం పరంగా చూసుకున్నప్పుడు మహిళల సంఖ్య తక్కువగా ఉంది. ఈ క్రమంలో మహిళా నాయకత్వాన్ని పెంచుకునే దిశగా ఏ విధంగా ముందుకు సాగాలి.. ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి.. అనే విషయంపై చంద్రబాబు పార్టీ సీనియర్లకు బాధ్యతలు అప్పగించారు.
ఎవరిని పడితే వారిని కాకుండా పార్టీకి సంస్థగతంగా ఉండేలాగా సామాజిక వర్గాలపరంగా అదే విధంగా బడుగు బలహీనవర్గాల నుంచి కూడా మహిళా నాయకులను తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. వీరిలో బీసీలు ఎక్కువ మంది ఉండేలా చూడనున్నారు. ఎందుకంటే ఆది నుంచి టిడిపి బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్న క్రమంలో వారి తరఫున బలమైన గళం వినిపించే మహిళా నాయకులకు ఇప్పుడు అవకాశం దక్కనుంది. మొత్తంగా టిడిపికి మరింత మంది మహిళా నాయకుల అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.