2,500 మందిని బలవంతంగా రాజీనామా చేయించిన టీసీఎస్.. కారణమేంటి?

ఇండస్ట్రియల్‌ డిస్ప్యూట్స్‌ యాక్ట్‌, 1947 నిబంధనలను TCS ఉల్లంఘించిందని, ప్రభుత్వానికి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తొలగింపులు చేసిందని సంఘం పేర్కొంది.;

Update: 2025-10-02 11:53 GMT

భారతదేశపు ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) పుణె కార్యాలయంలో 2,500 మంది ఉద్యోగులను బలవంతంగా రాజీనామాలు చేయించిందనే ఆరోపణలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఈ విషయంపై నాసెంట్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఎంప్లాయీస్‌ సెనేట్‌ (NITES) మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు లేఖ రాయడంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది.

ఉద్యోగుల సంఘం (NITES) ప్రధాన ఆరోపణలు

NITES అధ్యక్షుడు హర్ప్రీత్‌ సింగ్‌ సలుజా ముఖ్యమంత్రికి రాసిన లేఖలో ఉద్యోగుల సమస్యపై తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వారి ప్రధాన ఆరోపణలు చూస్తే.. పుణెలో వేలాది మంది మధ్యస్థాయి మరియు సీనియర్‌ ఉద్యోగులను బలవంతంగా రాజీనామా చేయిస్తున్నారని NITES ఆరోపించింది. ఉద్యోగాలు కోల్పోయిన వారిలో చాలామంది 10 నుంచి 20 సంవత్సరాల అనుభవం, 40 ఏళ్లకు పైబడిన వారే ఎక్కువ మంది ఉన్నారని తెలిపారు. ఈ వయస్సు వారికి కొత్త ఉద్యోగాలు దొరకడం కష్టమని, వారిపై గృహ రుణాలు, పిల్లల విద్య, వృద్ధ తల్లిదండ్రుల బాధ్యతలు వంటి తీవ్ర ఆర్థిక భారం ఉందని NITES ఆందోళన వ్యక్తం చేసింది.

ఇండస్ట్రియల్‌ డిస్ప్యూట్స్‌ యాక్ట్‌, 1947 నిబంధనలను TCS ఉల్లంఘించిందని, ప్రభుత్వానికి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తొలగింపులు చేసిందని సంఘం పేర్కొంది. చట్ట ప్రకారం ఇవ్వాల్సిన రీట్రెంచ్‌మెంట్‌ పరిహారం ఇవ్వకుండా, ఉద్యోగులను "స్వచ్ఛంద రాజీనామాలు" చేయమని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించింది.

ఈ తొలగింపులు కేవలం సంస్థ సంఖ్యల సమస్య కాదని, అనేక కుటుంబాల భవిష్యత్తు, ఆర్థిక భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతాయని NITES అభిప్రాయపడింది. ఇప్పటికే కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఈ అంశంపై విచారణ చేయాలని మహారాష్ట్ర కార్మిక కార్యదర్శిని ఆదేశించినట్లు NITES తెలిపింది.

TCS స్పష్టీకరణ

ఆరోపణలను ఖండించిన సంస్థ NITES ఆరోపణలను TCS సంస్థ ఖండించింది. సంస్థ విడుదల చేసిన ప్రకటనలో "ప్రచారం అవుతున్న సమాచారం తప్పుడు.. దుష్ప్రచారంతో కూడుకున్నది. సంస్థలో చేపట్టిన ‘స్కిల్స్‌ రియలైన్‌మెంట్‌’ చర్యలు కేవలం కొద్ది మంది ఉద్యోగులపైనే ప్రభావం చూపాయని, వారికి తగిన జాగ్రత్తలు.. సెవరెన్స్ బెనిఫిట్స్ అందించామని TCS వెల్లడించింది.

ఇదిలా ఉండగా TCS గత జూన్‌లోనే తమ గ్లోబల్‌ వర్క్‌ఫోర్స్‌లో 2 శాతం తగ్గింపు (దాదాపు 12,261 ఉద్యోగాలు) ఉంటుందని, ముఖ్యంగా మధ్యస్థాయి, సీనియర్‌ స్థాయి ఉద్యోగాలను తగ్గిస్తామని ప్రకటించింది.

ముఖ్యమంత్రి జోక్యం కోసం విజ్ఞప్తి

ఈ తొలగింపుల ప్రక్రియ అనేక కుటుంబాలకు "చీకటి సమయం" లాంటిదని NITES అభివర్ణించింది. అక్రమంగా జరుగుతున్న తొలగింపులను ఆపి, ప్రభావిత ఉద్యోగులందరికీ చట్టబద్ధమైన ప్రయోజనాలు అందేలా చూడాలని ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ను NITES తక్షణమే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఉద్యోగుల భద్రతకు సంబంధించి ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News