ఏఐ.. అస్సలు టెన్షనే లేదంటున్న టీసీఎస్
ఈ సరికొత్త సాంకేతికతతో కిందామీదా పడిపోతున్న తీరుకు భిన్నంగా దిగ్గజ ఐటీ సంస్థల్లో ఒకటైన టీసీఎస్ మాత్రం అందుకు భిన్నంగా.. ధీమాగా స్పందిస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది;
ఏఐ పేరు విన్నంతనే ఐటీ కంపెనీలకు చలిజ్వరం వచ్చేసిన పరిస్థితి. ఈ సరికొత్త సాంకేతికతతో కిందామీదా పడిపోతున్న తీరుకు భిన్నంగా దిగ్గజ ఐటీ సంస్థల్లో ఒకటైన టీసీఎస్ మాత్రం అందుకు భిన్నంగా.. ధీమాగా స్పందిస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది. ఏఐ సాంకేతికత మీద తమకు ఎలాంటి ఆందోళన లేదన్న ఆ సంస్థ.. తమ ఉద్యోగులు ఏఐ టూల్స్ వాడటం వల్ల తాము కొంత ఆదాయాన్ని కోల్పోయినా ఫర్లేదని వ్యాఖ్యానించటం గమనార్హం.
ఏఐ ఆధారిత సొల్యూషన్లను డెవలప్ చేసే విషయంలో యువ నిపుణులతో పోలిస్తే.. సీనియర్ స్థాయి ఉద్యోగుల్లో అంత చురుకుదనం లేదంటూ టీసీఎస్ సీఈవో క్రతివాసన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తమ ఆదాయాల మీద ప్రభావాన్ని చూపినా తాము ఏఐ వాడేందుకు తమ ఎంట్రీ లెవల్ ఉద్యోగులను ప్రోత్సహిస్తామన్న ఆయన.. తమ ఆరు లక్షల మంది ఉద్యోగులు ఏఐసాంకేతికతతో నిష్ణాతులుగా ఉండాలనే తాము కోరుకుంటామన్నారు.
ఈ కొత్త టెక్నాలజీ.. జీవనోపాధిని దూరం చేస్తుందన్న భయాలు లేవన్న ఆయన.. ప్రాజెక్టుల్లో ఏఐను ఎలా ఉపయోగించుకోవాలోఅన్వేషించాలంటూ ప్రారంభ స్థాయి ఉద్యోగులకు కంపెనీ సూచించినట్లు చెప్పారు. ఇదే సందర్భంగా ఉద్యోగులకు మరో కీలక సూచన చేశారు. చాట్ జీపీటీని ఉద్యోగులు కొన్ని ప్రాంప్ట్ లు ఇస్తే సరిపోదని.. శారీరకంగా కొంత శ్రమించాలని.. ఏఐ టూల్స్ ను ఉపయోగించి సొల్యూషన్లు రూపొందించాలన్నారు.
ఏఐను.. నాగరికతలో మార్పు తెచ్చే టెక్నాలజీగా తాను చూస్తానన్న ఆయన.. గత 60 ఏళ్లలోపరిష్కారం కాని కొన్ని సమస్యలకు ఈ టెక్నాలజీ పరిష్కారాన్ని ఇస్తుందన్నారు. పలు రకాల ఏజెంట్లను ఉపయోగించి ఏఐనే ఏఐకి ఆదేశాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుందనే కోణంలోనే దీనిని టీసీఎస్ చూస్తోందన్న ఆయన మాటలు చూస్తే.. ఏఐ విషయంలో అనవసరమైన ఆందోళన కంటే.. దాన్ని ఎలా డీల్ చేయాలన్న దానిపై టీసీఎస్ కు ఒక స్ట్రాటజీ ఉందన్న విషయాన్ని తన మాటలతో చెప్పేశారని చెప్పాలి.