తమ్మినేని సౌండ్ లేదు....ఆప్షన్లు ఉన్నాయా ?

తమ్మినేని సీతారాం అయితే ధాటీగా మాట్లాడగలరు, పైగా ఆయన కీలక నేతగా రాష్ట్ర స్థాయి అంశాల మీద పూర్తి అవగాహన ఉన్న వారిగా కూడా అంతా చూస్తారు.;

Update: 2025-12-05 03:55 GMT

ఉత్తరాంధ్రా జిల్లాలో సీనియర్ మోస్ట్ నేతగా తమ్మినేని సీతారాం ఉన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీతో తన పొలిటికల్ కెరీర్ ని స్టార్ట్ చేశారు. 1983 నుంచి మొదలుపెడితే 1999 దాకా వరసగా నాలుగు సార్లు గెలిచారు. మధ్యలో ఒకసారి ఓడారు. ఒక 2004లో ఓటమి తరువాత ఆయన రూటే సెపరేట్ అనుకున్నారు. 2008లో ప్రజారాజ్యంలో చేరిపోయారు. 2009లో పోటీ చేస్తే ఓటమి వరించింది. 2014లో వైసీపీలో చేరినా అదే ఫలితం వచ్చింది. 2019లోనే గెలుపు పిలుపు వినిపించింది. ఇక మంత్రి పదవి కావాలని ఆయన పెట్టుకున్న ఆశలు కాదని జగన్ ఆయనను స్పీకర్ గా చేశారు. అయిదేళ్ళు ఆ పదవిలో ఉన్న తమ్మినేని 2024 లో మరోసారి పోటీ చేసి భారీ ఓటమి మూటగట్టుకున్నారు. ఆనాటి నుంచి తమ్మినేని మౌన వ్రతం పాటిస్తున్నారు అని అంటున్నారు.

స్ట్రాటజీ ఉందా :

తమ్మినేని సీతారాం అయితే ధాటీగా మాట్లాడగలరు, పైగా ఆయన కీలక నేతగా రాష్ట్ర స్థాయి అంశాల మీద పూర్తి అవగాహన ఉన్న వారిగా కూడా అంతా చూస్తారు. ఇక వైసీపీ చూస్తే భారీ కష్టాలలో ఉంది. ఈ సమయంలో ధాటీగా ధీటుగా స్పందించే వారు పార్టీకి ఎంతో అవసరం ఇలాంటి వేళ సైలెంట్ అయ్యారు తమ్మినేని. దాంతో ఆయన ఆలోచనలు ఏమిటో అర్థం కాక పార్టీ హైకమాండ్ తల పట్టుకుంటోంది అంటున్నారు.

ఇష్టం లేదా :

తమ్మినేని 1983 నుంచి ఆముదాల వలసనే నమ్ముకున్నారు. ఇప్పటికి ఆయన ఆ సీటు నుంచే పది సార్లు పోటీ చేశారు, అయిదు సార్లు గెలిచారు, ఎన్నో మంత్రి పదవులు అందుకున్నారు. ఇక తన వారసుడికి ఆ సీటు కావాలని కోరుతున్నారు. కానీ పార్టీ మాత్రం ఆయనను శ్రీకాకుళం పార్లమెంట్ ఇంచార్జిగా నియమించింది. అక్కడ రవికుమార్ అనే కొత్త నాయకుడికి పదవిని ఇచ్చింది. దాంతో తమ్మినేని అలిగారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక ఆయన చురుకుగా పాల్గొనాలని పార్టీ పెద్దలు సూచిస్తే అపుడపుడు మాత్రమే మీడియా ముందుకు వస్తున్నారు తప్ప పెద్దగా రియాక్ట్ కావడం లేదు అని అంటున్నారు.

వీడిపోతారా అన్నదే :

తమ్మినేని టీడీపీ ప్రజారాజ్యం వైసీపీ ఇలా పార్టీలు మారారు. దాంతో ఆయన మరోసారి జంపింగ్ చేసే ఆలోచనలో ఉన్నారా అన్నదే చర్చగా ఉందిట. అయితే ఆయన జనసేనలో చేరుతారు అని టాక్ అప్పట్లో వచ్చింది కానీ ఇపుడు అయితే వినిపించడం లేదు, టీడీపీలో నో చాన్స్. అక్కడ ఆయన మేనల్లుడే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. బీజేపీలోకి వెళ్ళే ఆలోచన లేదని అంటున్నారు. అయితే .ఆప్షన్లు ప్రస్తుతానికి ఏవీ లేకపోవడం వల్లనే వేచి చూసే ధోరణిలోనే ఆయన మౌనంగా ఉన్నారు అని అంటున్నారు. సరైన టైం చూసుకుని ఆయన ఫుల్ యాక్టివ్ అవుతారు అని అంటున్నారు. అయితే ఆముదాలవలసలో తమ్మినేని మౌనంతో పార్టీ ఇబ్బందులో పడుతోంది అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఈ సీనియర్ నేత మీద ఆశలు పెంచుకోవాలా లేక వదులుకోవాలా అన్న సందిగ్దంలో అయితే పార్టీ ఉందని ప్రచారం అయితే సాగుతోంది. చూడాలి మరి ఆయన ఫుల్ యాక్టివ్ గా ఎపుడు జనంలోకి వస్తారో అని అంటున్నారు.

Tags:    

Similar News