రాజీనామాపై సొంత గడ్డలో క్లారిటీ ఇచ్చిన తమిళిసై

పదవీ కాలం ఉన్నప్పటికీ అనూహ్య రీతిలో రాజీనామా చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై తీరు సంచలనంగా మారటం తెలిసిందే.

Update: 2024-03-20 04:24 GMT

పదవీ కాలం ఉన్నప్పటికీ అనూహ్య రీతిలో రాజీనామా చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై తీరు సంచలనంగా మారటం తెలిసిందే. ఇంతకూ ఆమె ఎందుకు రాజీనామా చేశారన్న విషయం చర్చనీయాంశంగా మారింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రత్యక్ష రాజకీయాల మీద ఆసక్తి ఉన్న ఆమె.. తాను అనుకున్న రీతిలో ప్రజాప్రతినిధిని కావాలన్న ఆకాంక్షను తీర్చుకునేందుకు తాజాగా గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. తాజాగా ఇదే అంశాన్ని మీడియా ముందు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేసి తమిళనాడుకు వెళ్లిన ఆమె చెన్నై విమానాశ్రయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

ప్రజాసమస్యలపై మరింత ఫోకస్ పెట్టేందుకు.. ప్రత్యక్ష రాజకీయాల కోసమే తాను తన గవర్నర్ పదవికి రాజీనామా చేసినట్లుగా ఆమె వెల్లడించారు. తెలంగాణ..పుదుచ్చేరి గవర్నర్ పదవికి రాజీనామా చేసిన ఆమె రాష్ట్రపతికి లేఖ పంపేసి.. చెన్నై వచ్చేశారు. తనకు గవర్నర్ గా అవకాశం ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు.

గవర్నర్ పదవితో తాను చాలా అనుభవం దక్కించుకున్నట్లుగా తెలిపిన ఆమె.. నాలుగున్నరేళ్ల వ్యవధిలో ఇద్దరు సీఎంలు.. రెండు ఎన్నికలు.. గవర్నర్ బాధ్యతల్ని తాను నిర్వర్తించినట్లుగా పేర్కొన్నారు. కరోనా సమయంలో తాను విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొన్నప్పటికీ అందరి అభినందనలు పొందినట్లుగా ఆమె పేర్కొన్నారు. గవర్నర్ లాంటి రాజ్యాంగ బద్ధమైన పదవుల్ని పొంది ఇప్పుడు ఇలా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఇప్పటివరకున్న చట్టాలను మార్చాల్సిన అవసరం ఉందంటున్నారు. అత్యుత్తమ రాజ్యాంగ పదవులను అనుభవించిన వారు వెంటనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండా నియంత్రణ విధించాలన్న డిమాండ్ ఇప్పుడు పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ఇందుకు రాజకీయ పక్షాలు డిమాండ్ చేస్తాయా? అన్నదే ప్రశ్న.

Tags:    

Similar News