మోడీతో భేటీ....సోనియాతో లంచ్

తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ ఆ హోదాలో తొలిసారి ఢిల్లీలో అధికారిక పర్యటన చేపడుతున్నారు.;

Update: 2026-05-11 19:30 GMT

తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ ఆ హోదాలో తొలిసారి ఢిల్లీలో అధికారిక పర్యటన చేపడుతున్నారు. విజయ్ చేస్తున్న మొట్టమొదటి అధికారిక పర్యటనగా దీన్ని అంతా భావిస్తున్నారు. విజయ్ ఢిల్లీలో రెండు రోజులు పాటు పర్యటించనున్నారు అని చెబుతున్నారు. ఈ నెల మూడో వారంలో విజయ్ ఢిల్లీ పర్యటన ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. అదేవిధంగా హోం మంత్రి అమిత్ షాతో భేటీ వేయనున్నారు.

వరస భేటేలతో బిజీ :

ఇక తమిళనాడుకే చెందిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తో కూడా కొత్త ముఖ్యమంత్రి భేటీ అయి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల మీద చర్చించనున్నారు. ఆమెతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా విజయ్ ఈ సందర్భంగా కలవనున్నారు ఈ సందర్భంగా తమిళనాడు రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ నుంచి భారీ సహాయాన్ని ముఖ్యమంత్రి హోదాలో విజయ్ కోరనున్నారు. తమిళనాడుకు కేంద్ర సహయం అవసరమని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విన్నవించనున్నారు. మరొకవైపు తమిళనాడుకు అన్ని విధాల సహాయం చేస్తామని కొత్త ముఖ్యమంత్రి విజయ్ కి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎన్డీయే ప్రభుత్వం హామీ ఇచ్చింది.

రాజకీయ ఆసక్తిగా :

ఇదిలా ఉంటే తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి విజయ్ ఢిల్లీ పర్యటనలో రాజకీయ పదనిసలు కూడా అనేకం కనిపించబోతున్నారని అంటున్నారు. విజయ్ టీవీకే ప్రభుత్వం తమిళనాడులో ఏర్పాటు కావడానికి కాంగ్రెస్ ముందుకు వచ్చి మద్దతు ఇచ్చింది. అలా ఆయన కాంగ్రెస్ కి సంబంధించిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు తో తన ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. దాంతో కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీని ప్రత్యేకంగా మర్యాదపూర్వకంగా కలసి ధన్యవాదాలను విజయ్ చెప్పనున్నారని అంటున్నారు. అంతే కాకుండా ఈ సందర్భంగా ఆయన సోనియాగాంధీతో కలిసి మధ్యాహ్నం భోజనాన్ని కూడా స్వీకరించి వస్తారని తెలుస్తోంది. అంటే మోడీతో మీటింగు సోనియాతో ఈటింగ్ అన్నమాట. ఇక విజయ్ రెండు రోజులు పర్యటనలో ఢిల్లీలో పాత్రికేయులు ఉద్దేశించి కూడా మాట్లాడతారని తెలుస్తోంది. ఏం మాట్లాడుతారు, ఆయన ముఖ్యమంత్రిగా తొలి పర్యటన ఏ విధంగా సాగుతుంది, ఎవరెవరిని కలుస్తారు అన్నది పూర్తి ఆసక్తికరమైన పరిణామంగా ఉంది. మరి దానికోసం మరికొద్ది రోజులు వేచి చూడాల్సి ఉంది.

Tags:    

Similar News