బలవంతంగా అప్పు వసూలు.. ఐదేళ్లు జైలు.. ఏ రాష్ట్రంలో అంటే?
కొన్ని రుణ సంస్థలు తాము ఇచ్చిన అప్పుల్ని తిరిగి వసూలు చేసుకునే విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించటం.. బలవంతంగా వసూళ్లు చేసే క్రమంలో వారి ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవటం లాంటి చర్యలకు పాల్పడుతున్నారు.;
తమిళనాడు ప్రభుత్వం సరికొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. అప్పు తీసుకున్నోడు.. తిరిగి ఇచ్చే సందర్భంగా పెట్టే తిప్పలు అన్ని ఇన్ని కావు. అలా అని ఇలాంటివి అందరూ చేస్తారని చెప్పలేం. కాకుంటే.. అప్పును తిరిగి ఇచ్చే వేళలో కొందరు వ్యవహరించే తీరుతో విసిగిపోయిన పలువురు.. తాము ఇచ్చిన అప్పును తిరిగి తీసుకునేందుకు కొన్ని బలవంతపు చర్యలకు పాల్పడటం తెలిసిందే. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం సరికొత్త చట్టాన్ని తీసుకొచ్చింది.
ఈ కొత్త రూల్ ప్రకారం బలవంతంగా అప్పు వసూలు చస్తే ఐదేళ్ల వరకు జైలు విధించేలా నిర్ణయించారు. ఈ చట్టాన్ని బిల్లు రూపంలో అసెంబ్లీలో ఆమోదముద్ర వేసిన స్టాలిన్ సర్కారు.. తుది ఆమోదం కోసం గవర్నర్ కు పంపగా..ఆయన స్పందిస్తూ తన ఆమోదముద్రను వేశారు. దీంతో.. అప్పు వసూలు కోసం రుణ సంస్థలు గతంలో మాదిరి బలవంతంగా వసూలు చేసే వీలు ఉండదు.
కొన్ని రుణ సంస్థలు తాము ఇచ్చిన అప్పుల్ని తిరిగి వసూలు చేసుకునే విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించటం.. బలవంతంగా వసూళ్లు చేసే క్రమంలో వారి ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవటం లాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారి ఆగడాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అలాంటి వారికి చెక్ పెట్టేందుకు వీలుగా ఏప్రిల్ 26న డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అసెంబ్లీలో చట్టసవరణ బిల్లు ప్రవేశ పెట్టారు.
బలవంతంగా అప్పు వసూలు చేసినా.. రుణగ్రహీతల ఆస్తులు స్వాధీనం చేసుకున్నా ఐదేళ్లు జైలుశిక్ష.. రూ.5 లక్షల జరిమానా విధించేలా బిల్లు రూపొందించారు. బలవంతంగా అప్పు వసూలు చేసినా.. వారి వసూళ్ల కారణంగా ఆత్మహత్యలకు ప్రేరేపించేలా వ్యవహరించినా.. బెయిల్ రాని విధంగా జైలుశిక్ష విధించేలా బిల్లును రూపొందించారు. దీనికి అసెంబ్లీ ఆమోదం లభించటం..తాజాగా గవర్నర్ దీనికి ఆమోదముద్ర వేయటంతో ఇది కాస్తా చట్టంగా మారింది.