ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. అన్నదాతలు, సినీ ప్రియులకు సీఎం విజయ్ అదిరిపోయే గుడ్ న్యూస్
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం ప్రారంభమైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనదైన శైలిలో దూసుకుపోతున్న సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం తాజాగా రెండు సంచలన నిర్ణయాలు తీసుకుంది.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం ప్రారంభమైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనదైన శైలిలో దూసుకుపోతున్న సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం తాజాగా రెండు సంచలన నిర్ణయాలు తీసుకుంది. అటు అన్నదాతలకు అండగా నిలుస్తూ భారీ వ్యవసాయ రుణమాఫీ ప్రకటించడంతో పాటు, ఇటు కోలీవుడ్ వర్గాలకు పండగలాంటి వార్త చెబుతూ సినిమా థియేటర్లలో రోజుకు 5 షోల ప్రదర్శనకు అనుమతి ఇచ్చింది. ఒకే దెబ్బకు అటు రైతులను, ఇటు సినీ పరిశ్రమను ఖుషీ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలపై రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది.
అన్నదాతలకు ఊరట: వ్యవసాయ రుణమాఫీ విధివిధానాలు
రైతు సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తున్న విజయ్ ప్రభుత్వం, ఎన్నికల హామీల అమలులో భాగంగా వ్యవసాయ రుణమాఫీ పథకాన్ని ప్రకటించింది. ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ఉత్తర్వుల ప్రకారం.. 2025 మే 1 నుంచి 2026 ఫిబ్రవరి 28 వరకు సహకార బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన రైతులకు ఈ పథకం వర్తించనుంది.ముఖ్యంగా రూ.50 వేల లోపు రుణాలు తీసుకున్న సన్నకారు రైతులకు వంద శాతం రుణమాఫీ వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. చిన్నకారు రైతులకు మాత్రం 50 శాతం వరకు రుణ ఉపశమనం కల్పించనుంది. దీంతో వేలాది మంది రైతులకు కొంతమేర ఆర్థిక భారం తగ్గనుందని అధికారులు చెబుతున్నారు.
అయితే రూ.50 వేల పైబడిన రుణాలకు ప్రభుత్వం ప్రత్యేక శ్లాబ్ విధానాన్ని అమలు చేయనుంది. రూ.50,001 నుంచి రూ.60 వేల వరకు రుణం ఉన్నవారికి రూ.40 వేల వరకు మాఫీ లభిస్తుంది. రూ.60,001 నుంచి రూ.70 వేల వరకు అప్పు ఉన్న రైతులకు రూ.30 వేల ఉపశమనం ఇవ్వనున్నారు. రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకు రుణం తీసుకున్న వారికి రూ.20 వేల మాఫీ వర్తిస్తుంది. ఇక రూ.80 వేల నుంచి లక్ష రూపాయల వరకు అప్పు ఉన్న రైతులకు రూ.10 వేల వరకు మాత్రమే ప్రభుత్వం రాయితీ ఇవ్వనుంది. లక్ష రూపాయలకుపైగా వ్యవసాయ రుణాలు ఉన్న రైతులకు కేవలం రూ.5 వేల వరకు మాత్రమే మాఫీ వర్తిస్తుందని స్పష్టం చేసింది.
ఈ నిర్ణయంపై రైతుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఎన్నికల సమయంలో ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులందరికీ సంపూర్ణ రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని..కానీ ఇప్పుడు అనేక షరతులు పెట్టడం నిరాశ కలిగించిందని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. ముఖ్యంగా సహకార బ్యాంకుల రుణాలకు మాత్రమే పథకాన్ని పరిమితం చేయడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. అయినప్పటికీ కొంతమంది రైతులు ప్రభుత్వం కనీసం రుణభారం తగ్గించే దిశగా అడుగు వేసిందని అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉండగా తమిళ సినీ పరిశ్రమకు కూడా సీఎం విజయ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల సినీ పరిశ్రమ ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి కొత్త సినిమాలకు రోజుకు ఐదు షోలు ప్రదర్శించేందుకు అనుమతించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం.. కొత్తగా విడుదలయ్యే తమిళ చిత్రాలకు మొదటి వారం రోజులు ఐదు షోలు ప్రదర్శించుకునేలా అనుమతులు జారీ చేసింది. అంతేకాకుండా పండుగలు, ప్రత్యేక ప్రభుత్వ సెలవు దినాల్లో అదనపు ప్రత్యేక షోలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ నిర్ణయంతో తమిళ సినీ పరిశ్రమలో ఆనందం వ్యక్తమవుతోంది. భారీ బడ్జెట్ చిత్రాలకు మంచి వసూళ్లు వచ్చే అవకాశముందని నిర్మాతలు భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే సీఎం విజయ్ ప్రభుత్వం రైతు సంక్షేమం, సినీ పరిశ్రమ అభివృద్ధి అనే రెండు కీలక రంగాలపై దృష్టి సారిస్తూ పాలనలో తనదైన ముద్ర వేయాలని ప్రయత్నిస్తున్నట్టు స్పష్టమవుతోంది.