ఉగ్రపిశాచి రాణా.. భారత్ కు తేవటానికి ముందు అంత కసరత్తు జరిగింది
ముంబయి ఉగ్రదాడికి సంబంధించిన ప్రధాన నిందితుల్లో ఒకరు రాణా. తాజాగా దేశ రాజధాని ఢిల్లీకి అతడ్ని తీసుకురావటం తెలిసిందే.;
ముంబయి ఉగ్రదాడికి సంబంధించిన ప్రధాన నిందితుల్లో ఒకరు రాణా. తాజాగా దేశ రాజధాని ఢిల్లీకి అతడ్ని తీసుకురావటం తెలిసిందే. అమెరికా నుంచి ఢిల్లీకి తీసుకురావటం అంత సులువుగా జరగలేదు. దాని వెనుక చాలా ప్రాసెస్ మాత్రమే కాదు.. దౌత్యపరమైన ఎన్నో అంశాల్ని క్లియర్ చేయాల్సి వచ్చింది. ఈ మొత్తం క్రతువును దిగ్విజయంగా పూర్తి చేసింది భారత్. ఎన్నో అంశాల్ని ఓపిగ్గా పూర్తి చేసిన తర్వాత అతగాడ్ని ఇండియాకు తీసుకురావటం సాధ్యమైంది.
నిజానికి అమెరికా జైల్లో శిక్ష అనుభవిస్తున్న అతడ్ని భారత్ కు అప్పగించాలని కోరుతూ భారత ప్రభుత్వం ఎంతగానో ప్రయత్నించింది. ఇందులో భాగంగా న్యాయపరమైన అంశాల్ని క్లియర్ చేసింది. అతడ్ని భారత్ కు అప్పగించాలంటూ సెంట్రల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియా జిల్లా కోర్టు 2023 మే పదహారున ఆదేశాలు ఇచ్చింది. అప్పటి నుంచి వరుసగా చేసిన ప్రయత్నాల అనంతరమే రాణాను భారత్ కు తీసుకురాగలిగారు.
కాలిఫోర్నియా జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాల్ని నైన్త్ సర్క్యూట్ కోర్టులో పలు లిటిగేషన్ల ద్వారా సవాలు చేశాడు రాణా. వాటన్నింటిని కోర్టు తిరస్కరించేలా భారత్ కసరత్తు చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత రిట్ ఆఫ్ సర్టియోరరితో పాటు.. హెబియస్ పిటిషన్లను.. అత్యవసర అప్పీళ్లను యూఎస్ సుప్రీంకోర్టులో ఫైల్ చేశాడు. వాటిని సైతం అక్కడి సుప్రీంకోర్టు రిజెక్టు చేసిన తర్వాతే ఇండియాకు తీసుకురావటానికి సాధ్యమైంది.
భారత్ - అమెరికాల మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉండటంతో భారత్ సరెండర్ వారెంట్ ను పొందటం సాధ్యమైంది. ఎప్పడైతే ఈ వారెంట్ భారత్ చేతికి వచ్చిందో.. అతడ్ని తరలించే ప్రాసెస్ మరింత వేగవంతమైంది. ఫిబ్రవరిలో అమెరికా పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోడీ.. రాణా అప్పగింత అంశాన్ని ప్రస్తావించటమే కాదు.. దానికి సంబంధించిన అంశాల మీద ట్రంప్ తో చర్చ జరిపారు. దీనికి అనుగుణంగా మోడీతో మీటింగ్ తర్వాత ఇరువురు అధినేతలు నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో రాణా అప్పగింత అంశాన్ని ట్రంప్ స్వయంగా ప్రస్తావించటంతో ఈ సుదీర్ఘ ప్రక్రియ ఒక కొలిక్కి రానుందన్న అంశం అర్థమైంది. ఎట్టకేలకు అనుకున్నది అనుకున్నట్లుగా చేసిన భారత్.. రాణాను భారత్ కు తీసుకురావటం ద్వారా దౌత్యపరంగా అతి పెద్ద విజయాన్ని నమోదు చేసిందని చెప్పక తప్పదు.