ఇదేమైనా సినిమానా సామీ.. ఈ గన్ ఏంది? ఈ బెదిరింపులేంది?

తాజాగా వైసీపీ నేత.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అకస్మాత్తుగా తాడిపత్రికి రావటంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.;

Update: 2025-07-01 07:33 GMT

కొన్ని సందర్భాలు సినిమాటిక్ గా ఉండొచ్చు. ఆ మాత్రం దానికే సినిమాల్లో మాదిరి యాక్షన్ ప్రదర్శిస్తే మొదటికే మోసం వస్తుంది. తాజాగా తాడిపత్రి సీఐ తీరు కూడా అదే రీతిలో ఉందంటున్నారు,. తాజాగా వైసీపీ నేత.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అకస్మాత్తుగా తాడిపత్రికి రావటంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో స్పందించిన పోలీసులు ఆయన్ను.. తాడిపత్రి నుంచి అనంతపురానికి పంపుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆయన్ను అనంతపురానికి తరలించే క్రమంలో పోలీసుల వాహనాన్ని వైసీపీ వర్గీయులు వెంబడించారు.

ఇలాంటి సమయాల్లో మరింత ఫోర్సును వినియోగించటం.. పోలీసు వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నాల్ని నిలువరించే ప్రయత్నం చేశాయి. అందుకు భిన్నంగా చేతిలోని గన్ ను గురి పెట్టి వార్నింగ్ ఇచ్చిన వైనం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాడిపత్రి సీఐ సాయి ప్రసాద్ యాక్షన్ సీక్వెన్స్ ను వైసీపీ వర్గీయులు ప్రత్యేకంగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అవసరానికి మించిన యాక్షన్ ప్రదర్శించిన ఆయన తీరును అందరూ వేలెత్తి చూపేలా సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు.

ఈ వీడియో వైరల్ గా మారింది. తాడిపత్రి సీఐ తీరును పలువురు తప్పు పడుతున్నారు. కేతిరెడ్డి వర్గీయులు అడ్డుకునే ప్రయత్నం చేసిన పక్షంలో ఈ తరహా యాక్షన్ అవసరమేమో కానీ.. ఏదో జరుగుతుందన్న ఉద్దేశంతో చేయటాన్ని తప్పు పడుతున్నారు. ఇలాంటి చర్యలు ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావటం ఖాయమంటున్నారు.

సీఐ చేష్టల్ని పలువురు తప్పు పడుతున్న వేళ.. గన్ తీసి మరీ గురి పెట్టాల్సిన అవసరం ఏముంది? అన్న ప్రశ్నను సంధించిన వేళలో ఆయన స్పందిస్తూ.. ‘‘మా వాహనాన్ని అడ్డగిస్తారేమో అన్న ఉద్దేశంతో గన్ తీయాల్సి వచ్చింది. పెద్దారెడ్డి పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఆయనపై ఎవరైనా దాడికి పాల్పడతారన్న అనుమానంతోనే గన్ చూపించి వారించినట్లుగా పేర్కొన్నారు. పోలీసు అధికారి ఎవరైనా గన్ తీసి వార్నింగ్ ఇచ్చే పరిస్థితి.. చాలా అరుదుగా ఉంటుందని.. తాడిపత్రి ఎపిసోడ్ లో అంత యాక్షన్ అవసరం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి చేష్టలతో ప్రభుత్వాన్ని వేలెత్తి చూపించే అవకాశం ఇచ్చినట్లు అవుతుందని చెబుతున్నారు.

Tags:    

Similar News