చెత్తతో కోట్ల సంపదించేస్తున్నారు
సాధారణంగా మనం బయట ప్రయాణిస్తున్నప్పుడు రోడ్డు పక్కన చెత్త కనిపించినా, వ్యర్థాలు కనిపించినా ముక్కు మూసుకుంటాం లేదా దూరంగా జరిగిపోతాం.;
సాధారణంగా మనం బయట ప్రయాణిస్తున్నప్పుడు రోడ్డు పక్కన చెత్త కనిపించినా, వ్యర్థాలు కనిపించినా ముక్కు మూసుకుంటాం లేదా దూరంగా జరిగిపోతాం. కానీ కొన్ని దేశాలు మాత్రం వ్యర్థాలను కేవలం చెత్తగా చూడకుండా, వాటి నుంచి అద్భుతాలు సృష్టిస్తున్నాయి. ఈ కోవలోకి వచ్చే దేశాల్లో స్వీడన్ అగ్రస్థానంలో ఉంది. యూరప్ ఖండంలో చిన్నదైన ఈ దేశం అభివృద్ధిలో ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తోంది. పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే స్వీడన్, చెత్తను నీటి వనరుల్లో లేదా ఇతర ప్రాంతాల్లో డంప్ చేయకుండా, దానిని ఒక విలువైన వనరుగా మార్చుకుంటూ కోట్లలో సంపాదిస్తోంది.
-వ్యర్థాల పెరుగుదల - స్వీడన్ పరిష్కారం
ప్రపంచవ్యాప్తంగా ఏటేటా వ్యర్థాలు, ముఖ్యంగా ప్రస్తుత స్మార్ట్ యుగంలో ఈ-వ్యర్థాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ వ్యర్థాలను ఎక్కడో ఒకచోట పడేయడం, నీటి వనరులలో డంప్ చేయడం వంటి పద్ధతులు పర్యావరణ కాలుష్యాన్ని విపరీతంగా పెంచుతున్నాయి. విలువైన వనరులలో ప్రమాదకర అవశేషాలు కలవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు స్వీడన్ తన దేశంలో పోగుపడుతున్న వ్యర్థాల నిర్వహణను సక్రమంగా చేపడుతోంది. అంతేకాదు, వాటి నుంచి ఆదాయాన్ని కూడా పొందుతోంది.
స్వీడన్‌లో గృహాల నుంచి వెలువడే వ్యర్థాల్లో 99 శాతం రీసైకిల్ చేస్తున్నారు. తమ దేశంలోనే కాకుండా యునైటెడ్ కింగ్‌డమ్, నార్వే, ఇటలీ వంటి దేశాల నుంచి కూడా చెత్తను దిగుమతి చేసుకుంటోంది. ఈ వ్యర్థాలను విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తోంది. చెత్త ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి సంవత్సరానికి 100 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు ₹857 కోట్లు) సంపాదిస్తోంది. అంతేకాకుండా, ఈ విద్యుత్తుతో 2.5 లక్షల గృహాలకు సరఫరా చేస్తోంది.
-పర్యావరణ పరిరక్షణ, ప్రపంచానికి ఆదర్శం
చెత్త ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడమే కాకుండా స్వీడన్ ఈ రీసైక్లింగ్ ప్రక్రియ ద్వారా పర్యావరణాన్ని కూడా పరిరక్షిస్తోంది. తమ దేశంతో పాటు దాదాపు నాలుగు ఇతర దేశాలను కూడా శుభ్రంగా ఉంచుతోంది. స్వీడన్ చేస్తున్న ఈ అద్భుతమైన ప్రయోగం ప్రపంచ దేశాలకు ఒక గొప్ప ఆదర్శంగా నిలుస్తోంది.
పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్న ప్రకారం, స్వీడన్ పద్ధతిని ఇతర దేశాలు కూడా అనుసరిస్తే సముద్ర జలాలు పరిశుభ్రంగా ఉంటాయి, నీటి వనరులు స్వచ్ఛంగా ఉంటాయి, భూమిపై భారం తగ్గుతుంది. పర్యావరణం పచ్చగా ఉంటుంది. ఇది భూమిని దీర్ఘకాలం పాటు ఇతర జీవులకు జీవనాధారం చేస్తుంది. వ్యర్థాలను సంపదగా మార్చే ఈ విధానం భవిష్యత్ తరాలకు ఒక గొప్ప సందేశం.