'డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్'.. బెంగాల్ లో వేడిపుట్టిస్తున్న సువేందు

దీంతో దేశ సరిహద్దుల్లోని చెక్ పోస్టుల వద్ద వలసదారుల రద్దీ ఎక్కువగా కనిపిస్తోందని అంటున్నారు.

Update: 2026-05-27 07:52 GMT

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి అక్రమ వలసదారులకు సింహస్వప్నంగా మారుతున్నారు. పక్కనే ఉన్న బంగ్లాదేశ్ నుంచి వచ్చి బెంగాల్ లో అక్రమంగా నివసిస్తున్న వారిని తిరిగి పంపేందుకు వినూత్న కార్యక్రమం చేపట్టారు. 'డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్' (గుర్తించడం, తొలగించడం, దేశం దాటించడం) అనే నినాదంతో వలసదారులను వారి స్వదేశానికి పంపే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీంతో దేశ సరిహద్దుల్లోని చెక్ పోస్టుల వద్ద వలసదారుల రద్దీ ఎక్కువగా కనిపిస్తోందని అంటున్నారు.

ముఖ్యమంత్రిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన సువేందు అధికారి అక్రమ వలసలపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. బెంగాల్‌లో దశాబ్దాలుగా తిష్టవేసిన అక్రమ వలసదారులను వారి స్వదేశానికి పంపాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం రంగంలోకి దిగడంతో నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు 'హకీంపూర్ చెక్‌పోస్ట్' వద్ద ఒక్కసారిగా రద్దీ పెరిగింది. వందలాది మంది బంగ్లాదేశీయులు స్వచ్ఛందంగా తమ దేశానికి తిరుగు ప్రయాణమవుతున్నారు.

గత కొన్నేళ్లుగా హౌరా, దమ్ దమ్, బారాసత్ వంటి ప్రాంతాల్లో మోటార్ మెకానిక్‌లు, తాపీ మేస్త్రీలుగా ఎలాంటి చట్టబద్ధమైన పత్రాలు (ఆధార్, రేషన్ కార్డులు) లేకుండా నివసిస్తున్న వారు ఇప్పుడు సరిహద్దుల వైపు పరుగులు తీస్తున్నారు. "ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది, ఇక్కడ ఇక పనులు దొరకడం లేదు, అందుకే వెనక్కి వెళ్తున్నాం" అని సరిహద్దు వద్ద వేచి ఉన్న పలువురు వలసదారులు స్థానిక మీడియాతో వ్యాఖ్యానించడం అక్కడి పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోందని చెబుతున్నారు.

"త్వరగా పారిపోండి, లేదంటే ప్రభుత్వం రంగంలోకి దిగాల్సి వస్తుంది. వారిని జైళ్లలో పెట్టి, ప్రజల సొమ్ముతో వారికి అన్నం, బట్టలు, మందులు పెట్టడానికి వాళ్లేమైనా మన అల్లుళ్లా? త్వరగా వెళ్ళిపోకపోతే ప్రభుత్వం ఏం చేయాలో అది చేస్తుంది." అంటూ ఇటీవల ఓ సమావేశంలో సీఎం సువేందు అధికారి తీవ్రంగా హెచ్చరించారు. దీంతో అక్రమవలస దారులు తమ స్వదేశానికి వెళ్లేందుకు తట్టాబుట్టా సర్దుకున్నట్లు చెబుతున్నారు. బెంగాల్‌లో ప్రభుత్వం మారిన వెంటనే సరిహద్దు భద్రత, జనాభా మార్పులపై ప్రత్యేక దృష్టి సారించారు.

హోల్డింగ్ సెంటర్ల ఏర్పాటు

కేంద్ర హోం శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా, అక్రమంగా దేశంలో ఉంటున్న విదేశీయులను, శిక్షాకాలం పూర్తయిన బంగ్లాదేశీయులను రోహింగ్యాలను ఉంచడానికి అన్ని జిల్లాల్లో 'హోల్డింగ్ సెంటర్లు' ఏర్పాటు చేయాలని కోర్టులు ఇదివరకే ప్రభుత్వానికి సూచించాయి. ఇప్పటికే మాల్దా జిల్లాలోని ఇంగ్లీష్ బజార్‌లో మొదటి హోల్డింగ్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ కట్టుదిట్టమైన భద్రత, సీసీటీవీల నిఘా నడుమ అనుమానిత వలసదారులను ఉంచి వెరిఫికేషన్ ప్రక్రియ జరుపుతున్నారు.

నేరుగా బీఎస్ఎఫ్ కు అప్పగింత

గతంలో అక్రమ వలసదారులను పట్టుకుంటే సుదీర్ఘమైన చట్టపరమైన ప్రక్రియ నడిచేది. కానీ ఇప్పుడు సీఎం సువేందు అధికారి సరికొత్త ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర పోలీస్ శాఖ ఎక్కడైనా చట్టవిరుద్ధంగా నివసిస్తున్న వారిని గుర్తిస్తే, వారిని నేరుగా సరిహద్దు భద్రతా దళానికి (BSF) అప్పగించాలని స్పష్టం చేశారు. సీఏఏ (CAA) పరిధిలోకి రానివారంతా అక్రమ చొరబాటుదారులేనని ప్రభుత్వం తేల్చి చెప్పింది.

సరిహద్దు ఫెన్సింగ్ పనులు వేగవంతం

మరోవైపు పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్‌తో సుమారు 2,216 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది. ఇందులో దాదాపు 550 కిలోమీటర్ల మేర ఇంకా కంచె లేదు. అయితే ప్రస్తుత ప్రభుత్వం సిలిగురి పరిధిలోని ఫాన్సీదేవా వంటి ప్రాంతాల్లో దాదాపు 27 కిలోమీటర్ల భూమిని బీఎస్ఎఫ్ కు కంచె వేయడానికి తక్షణమే అప్పగించి, పనులను వేగవంతం చేసింది. ఇక సీఎం సువేందు ఆధ్వర్యంలో యంత్రాంగం చేపట్టిన ఈ ఆపరేషన్ బెంగాల్ రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

Tags:    

Similar News