మమత పొంచి ఉంది... సువేందు ముందు సవాళ్ళు
బెంగాల్ భావోద్వేగాల గడ్డ. పోరాటాల అడ్డా. ఇప్పటికి దాదాపు నూటా పాతికేళ్ల క్రితమే ఇక్కడ స్వాతంత్ర్య పోరాటం దేశానికి కొత్త నినాదం అందించింది. ఏ చిన్న విషయం అయినా ప్రకంపనలు టాప్ రేంజిలో ఉంటాయి.;
బెంగాల్ భావోద్వేగాల గడ్డ. పోరాటాల అడ్డా. ఇప్పటికి దాదాపు నూటా పాతికేళ్ల క్రితమే ఇక్కడ స్వాతంత్ర్య పోరాటం దేశానికి కొత్త నినాదం అందించింది. ఏ చిన్న విషయం అయినా ప్రకంపనలు టాప్ రేంజిలో ఉంటాయి. ప్రజలకు ఆవేశం వచ్చినా అభిమానం వచ్చినా కూడా అధిక మోతాదులోనే ఉంటుంది. ఇక బెంగాల్ ప్రజలు ఆత్మ గౌరవానికి ప్రతీకలు. బెంగాల్ అస్థిత్వాన్ని వారు బలంగా కోరుకుంటారు. అదే సమయంలో తాము ఓట్లేసి గెలిపించిన పార్టీని వారు దశాబ్దాల పాటు ఆదరిస్తారు కూడా. అందుకు జ్యోతి బసు, మమతా బెనర్జీ ఉదాహరణలు. జ్యోతి బసు 1977లో వామపక్ష ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏకంగా 23 ఏళ్ళ పాటు పాలించారు. ఆయన వారసుడిగా బుద్ధదేవ్ భట్టాచార్య పదకొండేళ్ళు పాలించారు. ఇలా 34 ఏళ్ళ పాటు వామపక్ష ప్రభుత్వాలు బెంగాల్ గడ్డను ఏలాయి.
మమత ఘన విజయాలు :
మరో వైపు చూస్తే మమతా బెనర్జీ 2011లో ముఖ్యమంత్రిగా తొలిసారి అధికారం చేపట్టారు. ఆమె మూడు టెర్ముల పాటు సుదీర్ఘ పాలన చేసి అప్రతిహత విజయాలను అందుకున్నారు. ఆమె ఒక విధంగా బెంగాల్ ని శాసించారు. ఆమె బెంగాల్ టైగర్ గా కూడా రికార్డుకు క్రియేట్ చేశారు. 294 సీట్లతో అతి పెద్ద రాష్ట్రంగా ఉన్న బెంగాల్ ని ఎవరి పాలించినా వారికి జాతీయ స్థాయిలో గుర్తింపు ఆటోమేటిక్ గా లభిస్తుంది. అలాగే మమత ప్రధాని పదవికి పోటీ పడే స్థాయికి ఎదిగారు. ఇక గతంలో జ్యోతి బసు కూడా ప్రధాని పదవికి యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో మొదటి ఎంపిక అయిన సంగతి విధితమే. ఈ విధంగా చూసుకుంటే బెంగాల్ రాజకీయం అందలాలు ఎక్కిస్తుంది. అత్యధిక కాలం అధికారంలోనూ ఉంచుతుంది. అయితే దానిని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
సువేందు బంధం ఆరేళ్ళు :
ఇక సువేందు అధికారి బెంగాల్ కి 9వ ముఖ్యమంత్రిగా బీజేపీ తరఫున అయ్యారు. ఆయన తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఎదిగి వచ్చిన వారు. అసలైన బీజేపీ వాది కాదు, బీజేపీతో ఆయనకు ఉన్న బంధం ఆరేళ్ళు మాత్రమే. అయితే ఈ రోజున బీజేపీని ఆయన అధికారంలోకి తీసుకుని వచ్చారు. క్షేత్ర స్థాయి నుంచి మంచి పరిచయాలు ఉన్న వారు. తృణమూల్ ని బలహీనం చేసి బీజేపీకి బలం కలిపి ఈ విజయాన్ని సువేందు అందుకున్నారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ లో పనిచేయడం వేరు, బీజేపీలో చేయడం వేరు. ఇక ప్రతిపక్షంలో దూకుడు వేరు, అధికార పక్షంలో ఉండాల్సిన తీరు వేరు అని అంటున్నారు. అంతే కాదు సువేందు అధికారి ముందు ఎన్నో సవాళ్ళు కూడా ఉన్నాయని చెబుతున్నారు.
బీజేపీలో కుదరదు :
బీజేపీలో వ్యక్తిగత ప్రజాకర్షణ కలిగిన నాయకులు ఉన్నా పార్టీయే సుప్రీం. పైగా జాతీయ నాయకుల ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. ఇక్కడే సువేందుకు మమతా బెనర్జీ జ్యోతి బసు కి తేడాలు ఉంటాయని అంటున్నారు. జ్యోతి బసు సీపీఎంలో కీలక నేత అయినప్పటికీ బెంగాల్ వరకూ చూస్తే ఆయన ప్రాంతీయ పార్టీ మాదిరిగానే నడిపారు. ఒక విధంగా బెంగాల్ వరకూ పార్టీకి అంతా తానై నడిపారు. ఆయన మాటే శిరోధార్యం అన్నట్లుగానే పరిస్థితి ఉండేది. మమత అయితే ఏకంగా ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేసి తానే సర్వస్వంగా వ్యవహరించారు. సువేందు విషయంలో అది సాధ్యం పడకపోవచ్చు. ఆయనకు హై కమాండ్ ఉంది. అంతే కాదు బెంగాల్ లో ఎంతో మంది ఒరిజినల్ బీజేపీ నేతలు ఉన్నారు. వారిని అందరినీ కలుపుకుని పోవాల్సిన అవసరం ఉంది. ఇక మమత జ్యోతి బసు తో పోలిస్తే సువేందు అధికారి చరిష్మా ఇంకా ఆ స్థాయికి చేరుకోవాల్సి ఉంది. మొత్తం మీద బలమైన ప్రతిపక్షంగా మమత ఉన్న వేళ సువేందు అధికారి సీఎం అయ్యారు. ఆయన బీజేపీకి మరిన్ని టెర్ములు అధికారం అందిస్తూ తాను సుదీర్ఘం కాలం సీఎం గా కొనసాగగలరా అన్నదే ఇపుడు అతి పెద్ద విశ్లేషణ. చూడాలి మరి ఏమి జరగనుందో.