ఎమర్జెన్సీతో ఇందిరకు ఏడాది బోనస్...ఎన్నికల్లో డిఫీట్ !

సాధారణంగా లోక్ సభ కాలపరిమితి అయిదేళ్ళు మాత్రమే. గడువు ముగిసిన తరువాత వెంటనే ఎన్నికలు పెడతారు.

Update: 2026-06-26 01:30 GMT

ఈ దేశంలో అనేక ముఖ్యమైన ఘట్టాలలో ఎమర్జెన్సీ కూడా ఒకటి. 1975 జూన్ 25న ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో అత్యవసర పరిస్థితిని విధించింది. దానికి విపక్షం అంతా ఏకమై కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిరంతర పోరాటం చేయడం అతి ముఖ్యమైన కారణం. అదే సమయంలో 1975 జూన్ 12న అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 1971 ఎన్నికల సమయంలో ఎన్నికల అవకతవకలకు పాల్పడినందుకు ఇందిరా గాంధీని కోర్టు దోషిగా నిర్ధారించి ఆరు సంవత్సరాల పాటు ఎన్నికైన పదవిని చేపట్టకుండా నిషేధించింది. దీని మీద విపక్షం పెద్ద ఎత్తున ఉద్యమిస్తూ ఇందిరాగాంధీని తన ప్రధాని పదవి నుంచి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఇందిరాగాంధీ పదవి నుంచి వైదొలగాలని సోషలిస్టు నాయకుడు జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. జయప్రకాష్ నారాయణ్ సంపూర్ణ విప్లవం కోసం పిలుపు ఇవ్వడంతో దేశంలో ఉద్యమం ఉధృతం అయింది.

అనూహ్యమైన నిర్ణయం :

ఇక విపక్షాలను వారి ఎత్తుగడలను దెబ్బ తీసేందుకు అలాగే దేశంలో భారీ ఎత్తున ఉద్యమాలను అణచివేసేందుకు నాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ఎంచుకున్న ఏకైక మార్గం ఎమర్జెన్సీ విధింపు. ఇందిరాగాంధీ సలహా మేరకు అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ దేశంలో జాతీయ భద్రత స్థిరత్వానికి ముప్పు వాటిల్లుతుందని పేర్కొంటూ 1975 జూన్ 25న అంతర్గత అత్యవసర పరిస్థితిని రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 ప్రకారం ప్రకటించారు. ఈ విధంగా ఎమర్జెన్సీ విధించి ఏకంగా 1975 జూన్ 25 నుండి 1977 మార్చి 21 వరకు 21 నెలల కాలం పాటు కొనసాగించారు.

చీకటి అధ్యాయంగా :

దేశంలో ఎమర్జెన్సీని చీకటి అధ్యాయంగా ప్రతిపక్షలతో పాటు మేధావులు ప్రజాస్వామ్య ప్రియులు అభివర్ణిస్తారు. ఇది స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత వివాదాస్పద అధ్యాయాలలో ఒకటిగా నిలిచిపోయింది అని చెప్పాల్సి ఉంది. ఎమర్జెన్సీ సమయంలో ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ప్రభుత్వం పౌర స్వేచ్ఛలను రద్దు చేయడమే కాదు, పత్రికా స్వేచ్ఛను అణచివేసి వేలాది మంది రాజకీయ ప్రత్యర్థులను జైలులో పెట్టారు. రాజ్యాంగంలోని కీలకమైన వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వేచ్ఛ వంటి ప్రాథమిక హక్కులు తీవ్రంగా ప్రభావితం అయిన సందర్భం ఎమర్జెన్సీ సమయంలో జరిగింది. అంతే కాదు కఠినమైన అంతర్గత భద్రతా పరిరక్షణ చట్టం మీసా కింద ఏకంగా ఒక లక్షా పది వేల మందికి పైగా రాజకీయ నాయకులతో పాటు పాత్రికేయులను, కార్యకర్తలను ఎలాంటి విచారణ లేకుండా జైలులో పెట్టారు. అంతే కాదు ఆ రోజులలో కఠినమైన పత్రికా నియంత్రణ ఉండేది. ప్రభుత్వం అన్ని మీడియా సంస్థలపై ముందస్తు నియంత్రణ విధించింది.

ఆరేళ్ళు పనిచేసిన లోక్ సభ :

సాధారణంగా లోక్ సభ కాలపరిమితి అయిదేళ్ళు మాత్రమే. గడువు ముగిసిన తరువాత వెంటనే ఎన్నికలు పెడతారు. అయితే 1971లో ఏర్పడిన ఇందిరాగాంధీ ప్రభుత్వానికి 1976లో గడువు తీరింది. కానీ ఎమర్జెన్సీని అడ్డుపెట్టుకుని ఇందిరాగాంధీ 1976లో జరగాల్సిన లోక్‌సభ ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేసింది. అలా అయిదవ లోక్ సభ 1976లో ముగియాల్సి ఉండగా మరో ఏడాది పైగా పనిచేసింది. ఆనాడు అధికార కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ ఎన్నికలను ఒక సంవత్సరం పాటు వాయిదా వేస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దేశంలో ఎప్పుడూ జరగని విధంగా అలా లోక్‌సభ పదవీకాలాన్ని అధికారికంగా తొలిసారిగా ఒక సంవత్సరానికి పొడిగించారు.

ఇందిరాగాంధీ చేసుకున్నదే :

లోక్‌సభ కాలపరిమితిని మరో ఏడాది పొడిగించేందుకు పార్లమెంటు ఒక రాజ్యాంగ సవరణను ఆమోదించింది. తద్వారా సార్వత్రిక ఎన్నికలను మరింత ఆలస్యం చేసింది. ఈ విధంగా ఎమర్జెన్సీ వల్ల ఇందిరా గాంధీ ప్రధాని అధికారం మరో ఏడాదికి విస్తరించింది. అయితే ఇందిరా గాంధీ 1977 జనవరిలో అనూహ్యంగా లోక్‌సభను రద్దు చేసి సార్వత్రిక ఎన్నికలను నిర్వహించారు.ఇక 1977 మార్చి 16 నుండి మార్చి 20 వరకూ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఇదిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిని చవి చూసింది. అంటే ఎమర్జెన్సీ ద్వారా ఏడాది పాటు అధికారం దక్కితే ఏకంగా ఎన్నికల్లో ఓడాల్సి రావడం ఇందిరాగాంధీ చేసుకున్నదే అని అంతా విశ్లేషిస్తారు. మొత్తానికి దేశంలో ఈ రోజుకీ నాటి ఎమర్జెన్సీని తలచుకుని విస్తృతంగా చర్చిస్తూనే ఉంటారు.

Tags:    

Similar News