జోరు మీద శీనన్న....వైసీపీకి షాకేనా ?
వైసీపీ అధినేత జగన్ కి దగ్గర బంధువుగా వైసీపీ పుట్టుక నుంచి ఆ పార్టీలో చక్రం తిప్పిన వారు బాలినేని శ్రీనివాస రెడ్డి.
వైసీపీ అధినేత జగన్ కి దగ్గర బంధువుగా వైసీపీ పుట్టుక నుంచి ఆ పార్టీలో చక్రం తిప్పిన వారు బాలినేని శ్రీనివాస రెడ్డి. వైసీపీ ద్వారా నాలుగు సార్లు పోటీ చేసి రెండు సార్లు గెలిచి మంత్రి పదవిని కూడా నిర్వహించిన బాలినేని 2024 ఎన్నికల్లో ఓటమి తరువాత జనసేనలో చేరిపోయారు. కొంతకాలం ఆ పార్టీలో సర్దుకోవడానికి ఇబ్బందిపడినా ఇటీవల కాలంలో ఆయనకు జనసేనలో ఎంతో ప్రాధాన్యత దక్కుతోంది. అధినేత పవన్ కళ్యాణ్ అయితే బాలినేనికి మంచి గుర్తింపు గౌరవం ఇస్తున్నారు. ఒంగోలు జిల్లా కమిటీని జనసేన రద్దు చేసింది. అంతే కాదు బాలినేనికి జాయినింగ్స్ కమిటీలోకి తీసుకున్నారు. పార్టీ జిల్లా పరిశీలకుడిగా కూడా నియమించారు.
పట్టుదలగా ముందుకు :
కాంగ్రెస్ లో వైసీపీలో అత్యధిక కాలం పనిచేసి ఒంగోలు జిల్లా రాజకీయాల్లో తిరుగులేని పట్టు సాధించిన బాలినేని వైసీపీకి దూరం కావడం ఆ పార్టీకి లోటు అయితే ఆయన జనసేనలో చేరిపోవడంతో పాటు పవన్ సైతం ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో ఇపుడు సైన్యానికి కొత్త ఊపు కనిపిస్తోంది. అంతే కాదు బాలినేని కూడా జిల్లాలో తన పట్టుని మరింతగా పెంచుకోవాలని పట్టుదలగా పనిచేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆయన చేస్తున్న ప్రయత్నాలు వైసీపీకి ప్రత్యేకించి జగన్ కి భారీ షాక్ ఇవ్వబోతున్నాయా అనన్ చర్చ అయితే సాగుతోంది.
మాజీ మంత్రి టార్గెట్ గా :
ఒంగోలు జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేతగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేసిన మానుగుంట మహీధర్ రెడ్డిని జనసేనలోకి తీసుకుని వచ్చేందుకు బాలినేని ప్రయత్నాలు మొదలుపెట్టారని ప్రచారం అయితే సాగుతోంది. కందుకూరు నియోజకవర్గంలో బలం ఉన్న మహీధర్ రెడ్డి 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరి గెలిచారు. అయితే ఆయనకు వైసీపీలో మంత్రి పదవి దక్కలేదు, ఆ అసంతృప్తి అలా ఉండగానే 2024 ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. దాంతో 2024 ఎన్నికల ముందు నుంచే ఆయన వైసీపీకి దూరం పాటించారు అని చెప్పుకున్నారు. ఇక ఎన్నికల్లో కూడా ఆయన పరోక్షంగా కూటమి అభ్యర్థి విజయానికి కృషి చేశారు అని కూడా ప్రచారం సాగింది. గడచిన రెండేళ్ళుగా ఆయన వైసీపీ విషయంలో అంతగా యాక్టివ్ గా లేరు అని అంటున్నారు.
గాజు గ్లాస్ పట్టుకుంటే :
అయితే అధికారికంగా చూస్తే ఆయన వైసీపీకి రాజీనామా చేయలేదు. ఆయనకు ఉన్న స్థాన బలం అన్నది వైసీపీకి కూడా తెలుసు. దాంతో ఆయన విషయంలో వైసీపీ పెద్దలు కూడా ఆలోచిస్తున్నారు అని వార్తలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆయనను జనసేన వైపు తీసుకుని వస్తే జనసేనకు మరింత పట్టు దొరుకుతుందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని మహీధర్ రెడ్డి చూస్తున్నారు. అది కూడా కందుకూరు నుంచే అని అంటున్నారు. ఈ మేరకు ఆయనకు హామీ లభిస్తే జిల్లాలో పరిణామాలు మారుతాయని కూడా అంటున్నారు. మరి ఆయనకు వైసీపీ 2024లోనే టికెట్ ఇవ్వలేదు, 2029లో ఆశలు ఉంటాయా అన్నది చూసుకుని మాజీ మంత్రి కనుక కీలక నిర్ణయం తీసుకుంటే వైసీపీది అది పెద్ద దెబ్బ అవుతుందని అంటున్నారు. ఇప్పటికే జిల్లాలో రాజకీయంగా వైసీపీ ఇబ్బందులు పడుతోంది అని అంటున్నారు. జిల్లాలో సరైన నాయకత్వం లేదని క్యాడర్ కూడా ఆందోళన చెందుతోంది. మరి బాలినేని కనుక తన వ్యూహాన్ని అమలు చేస్తే ఫ్యాన్ పార్టీ పరిస్థితి ఏంటి అన్నదే చర్చగా ఉంది మరి.