పెద్దాయన పిటిషన్ కు నో సరే.. ఆ లాజిక్ మాటేంటి సురేష్ గోపి?
మలయాళ సినీ నటుడు సురేశ్ గోపీని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన నటించిన సినిమాలు.. ఆయన నటన అందరికి తెలిసిన విషయాలే.;
మలయాళ సినీ నటుడు సురేశ్ గోపీని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన నటించిన సినిమాలు.. ఆయన నటన అందరికి తెలిసిన విషయాలే. వెండితెర మీద హీరోయిజం చూపించే ఆయన.. తాను నటించిన థ్రిల్లర్ సినిమాల్లో చెప్పే డైలాగులు.. యాక్షన్ సినిమాల్లో వినిపించే లాజిక్కులు రియల్ లైఫ్ లో ఎలా మిస్ అవుతారు? అందునా.. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. కేంద్ర మంత్రి హోదాలో ఉన్నప్పుడు తన ద్వారా ఏదో మేలు జరుగుతుందని ఆశ పడి తన వద్దకు వచ్చే వారిని నిరాశకు గురి చేయకుండా.. వారి న్యాయమైన కోరికను తీరిస్తే పోయేదేంటి?
చేతిలో ఉన్న పవర్ ఇప్పుడు కాకుండా చేజారిన తర్వాత చేసేదేమీ ఉండదన్న లాజిక్ ను ఆయన ఎలా మిస్ అవుతున్నారన్నది ప్రశ్న. ఈ నెల పన్నెండున త్రిసూర్ లో జరిగిన ఒక కార్యక్రమానికి కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్న సురేష్ గోపీ హాజరయ్యారు. ఈ సందర్భంగా వేలాయుధన్ అనే పెద్దాయన సురేష్ గోపీ వద్దకు వచ్చి తనకు ఇల్లు మంజూరు అయ్యేలా సాయం చేయాలని కోరారు. దీనికి సంబంధించిన ఒక దరఖాస్తును ఆయన చేతికి ఇవ్వబోయారు. అయితే.. ఆ దస్త్రాన్ని తీసుకోని సురేష్ గోపీ.. నిర్మోహమాటంగా పెద్దాయన విన్నపాన్ని రిజెక్టు చేశారు.
ఈ వ్యవహారంపై నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శించటం మొదలుపెట్టారు. దీనిపై తాజాగా ఆయన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. పెద్దాయన దస్త్రాన్ని తీసుకోకుండా చేసిన తప్పు కంటే.. తాజాగా వివరణ రూపంలో చెప్పిన వ్యాఖ్యలు ఆయన ఇమేజ్ ను మరింత దెబ్బ తీసేలా మారాయని చెప్పాలి. అదెలా అన్నది అర్థం కావాలంటే.. ముందుగా సురేష్ గోపీ ఇచ్చిన వివరణను తెలుసుకోవాలి.
‘‘నేను ఎలాంటి పనులు చేయగలను. ఎలాంటివి చేయలేననే విషయంలో నాకంటూ ఒక స్పష్టత ఉంది. చేయలేని పనుల విషయంలో హామీలు ఇవ్వలేను. ఒక ప్రజాప్రతినిధిగా నేనేం చేయగలనో. ఏం చేయలేనో నాకు తెలుసు. సాధ్యం కాని హామీల్ని నేను ఇవ్వలేను. ఎవరికీ ఆశలు కల్పించలేను. ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన అంశం రాష్ట్ర పరిధిలోకి వస్తుంది. దానిపై నిర్ణయాన్ని తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే’’ అని వ్యాఖ్యానించారు.
ఈ వివాద వేళ.. కేరళకు చెందిన రాజకీయ పార్టీ ఒకటి ముందుకు వచ్చి.. సదరు పెద్దాయనకు ఇంటిని ఇప్పిస్తానని మాట ఇవ్వటం గమనార్హం. సదరు రాజకీయ పార్టీ తీరును మెచ్చుకున్న సురేష్ గోపీ.. తాను చేయగలిగిన పనిని తాను చేయలేకపోయానన్న విషయాన్ని ఎలా మిస్ అవుతారు? అని ప్రశ్నిస్తున్నారు. నిజమే.. ఇంటి కేటాయింపు అంశం రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. దీన్ని కాదనలేం. కాకుంటే.. కేంద్ర మంత్రి హోదాలో ఉన్నప్పుడు.. ఒక పెద్దవయస్కుడు వచ్చి సాయం కోసం అభ్యర్థించినప్పుడు.. సదరు వ్యక్తి సరైన వ్యక్తోకాదన్న విషయాన్ని పరిశీలించటం.. ఒకవేళ న్యాయమైన డిమాండ్ కోరితే.. తనకున్నపలుకుబడితో జిల్లాకలెక్టర్ కు చెప్పటం ద్వారా సదరు పని కొలిక్కి తెచ్చే వీలుంది. కానీ.. ఈ విషయాల్ని వదిలేసి.. నో చెప్పటంలో అర్థం లేదనే చెప్పాలి.
ఇంటి కేటాయింపు విషయాన్ని కేంద్రమంత్రిగా ఉన్న సురేష్ గోపీ చేయలేకపోవచ్చు. కానీ.. పార్టీలకు అతీతంగా కేంద్ర మంత్రి హోదాలో రాష్ట్ర మంత్రికి కానీ జిల్లా కలెక్టర్ కు సదరు విన్నపాన్ని చెబితే సరిపోయేది. కేంద్ర మంత్రి హోదాలో ఉన్నప్పుడు రాష్ట్ర అంశాలే అయినప్పటికీ.. కొన్నింటిని వ్యక్తిగతస్థాయిలో చేసుకునే వీలుంది. ఆ అంశాన్ని కేంద్ర మంత్రి హోదాలో ఉన్న సురేష్ గోపీ మిస్ కావటం గమనార్హం. మొత్తంగా పెద్దాయన ఎపిసోడ్ లో రీల్ హీరో రియల్ లైఫ్ లో జీరోగా మిగిలారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్రమంత్రి హోదాలో ఉండి చేయాల్సినవెన్నో ఉంటాయని.. వాటిని చేయకుండా ఉండటం సరికాదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.