సూసైడ్ చేసుకున్న సచిన్ సెక్యూరిటీ గార్డు!
ఏ కారణంతో అతడు ఆత్మహత్య చేసుకున్న అంశాన్ని తేల్చేందుకు ఎస్ ఆర్ పీఎఫ్ స్వతంత్ర సంస్థ దర్యాప్తు చేపట్టింది.
క్రికెట్ దేవుడిగా కీర్తి ప్రతిష్ఠల్ని అందుకోవటంతో పాటు.. పిన్నవయసులోనే భారతరత్న లాంటి విశిష్ఠ పురస్కారాన్ని అందుకున్న ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కు సెక్యురిటీ గార్డుగా వ్యవహరించే అధికారి సూసైడ్ చేసుకున్నారు. స్టేట్ రిజర్వు ఫోర్సుకు చెందిన సదరు పోలీసు ఆత్మహత్య చేసుకోవటం సంచలనంగా మారింది. కొంతకాలంగా సచిన్ కు రక్షణగా అతగాడు విధుల్ని నిర్వర్తిస్తున్నాడు. మహారాష్ట్ర క్యాడర్ కు చెందిన ప్రకాశ్ కాప్డే.. సూసైడ్ చేసుకోవటం ఏమిటన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
ఏ కారణంతో అతడు ఆత్మహత్య చేసుకున్న అంశాన్ని తేల్చేందుకు ఎస్ ఆర్ పీఎఫ్ స్వతంత్ర సంస్థ దర్యాప్తు చేపట్టింది. కొన్ని రోజులు సెలవు తీసుకొని తన సొంతూరుకు వెళ్లిన ప్రకాశ్.. అక్కడే తన సర్వీరు రివాల్వర్ తో తనను తాను కాల్చుకొని మరణించారు. అర్థరాత్రి వేళలో ఇంటి పెరట్లోకి వెళ్లిన అతడు.. ఈ రీతిలో ఆత్మహత్య చేసుకోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అతనికి భార్య.. ఇద్దరు పిల్లలు ఉన్నట్లుగా చెబుతున్నారు.
వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఉదంతంపై విచారణ జరుగుతోందని.. ఒకసారి ఆ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత వివరాల్ని వెల్లడిస్తామని చెబుతున్నారు. వీవీఐపీకి భద్రతగా ఉండే ప్రకాశ్ ఆత్మహత్య చేసుకోవటం సంచలనంగా మారింది. అధికారుల విచారణలో ఏయే అంశాలు వెల్లడవుతాయో చూడాలి.