సాయిధరమ్ తేజ్ ప్రచారంలో ఉద్రిక్తత.. రాయితో దాడి.. త్రుటి తప్పిన పెను ప్రమాదం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.

Update: 2024-05-06 04:43 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరో సాయి ధరమ్ తేజ్.. పవన్ కల్యాణ్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తన ప్రచారంలో భాగంగా ఆయన నియోజకవర్గంలోని తాటిపర్తిలో నిర్వహించిన సభలో పాల్గొన్న వేళ..గుర్తు తెలియని వ్యక్తులు రాయితో దాడికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ పెను ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. అయితే.. తేజ్ పక్కనే నిలుచున్న శ్రీధర్ కు పెద్ద గాయమైంది. కంటి మీదుగా తగిలిన ఈ దెబ్బతో ఆయన్ను హుటాహుటిన దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.

ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.తాటిపర్తిలో పవన్ కు మద్దతుగా ప్రచారం చేయటానికి వచ్చిన సాయి ధరమ్ తేజ్ వస్తున్న నేపథ్యంలో జనసైనికులు భారీగా హాజరయ్యారు. పవన్ కు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇదిలా ఉంటే.. సాయి ధరమ్ తేజ్ ప్రచారంలో భాగంగా ఒక చోటు నుంచి మరో చోటుకు వెళుతున్న క్రమంలో వైసీపీ వర్గాలు.. టపాసులు పేల్చి కవ్వింపు చర్యలకు పాల్పడిన పరిస్థితి.

దీంతో పోటాపోటీ నినాదాలు.. వాగ్వాదాలు.. తోపులాటలు చోటు చేసుకున్నాయి. తేజ్ కాన్వాయ్ తిరిగి వెళుతున్న వేళలో గుర్తు తెలియని వ్యక్తిరాయి విసిరారు. అది సూటిగా వచ్చి సాయి ధరమ్ తేజ్ పక్కనే ఉన్న శ్రీధర్ కు బలంగా తాకింది. దీంతో ఆయనకు తీవ్ర గాయమైంది. ఈ దాడి మొత్తం వైసీపీ వర్గాలదే అంటూ జనసైనికులు మండిపడుతున్నారు. ఓటమి భయంతోనే వంగా గీత ఈ దాడులు చేయించి ఉంటారని ఆరోపించారు. ఈ ఘటనపై పవన్ స్పందిస్తూ.. ఈ తీరును తీవ్రంగా ఖండించారు. ఈ దాడి వెనకున్న నిందితుడ్ని సోమవారానికి అరెస్టు చేయని పక్షంలో కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని జనసైనికులు అల్టిమేటం ఇచ్చారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News