కుమారుడి విషయంలో తమిళనాడు సీఎం కీలక నిర్ణయం?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఐదు దశల్లో ఎన్నికలు పూర్తయిపోయాయి

Update: 2024-05-23 04:25 GMT

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఐదు దశల్లో ఎన్నికలు పూర్తయిపోయాయి. అన్నీ అనుకూలంగా జరిగితే జూన్ 1 తో అన్ని దశల్లోనూ ఎన్నికలు పూర్తయ్యి.. జూన్ 4న ఫలితాలు రాబోతున్నాయి. అయితే... ఈ లోక్ సభ ఎన్నికల ఫలితాల అనంతరం తమిళనాడు రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని అంటున్నారు.

అవును... లోక్ సభ ఎన్నికల ఫలితాల అనంతరం తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా... తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ కేబినెట్ లో ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయనున్నారని కథనాలు వెలువడుతున్నాయి.

వాస్తవానికి ఉదయనిధి స్టాలిన్ విషయంలో ఈ పుకార్లు రావడం ఇదే తొలిసారి కాదు. సీఎం స్టాలిన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో విదేశీ పర్యటనకు బయలుదేరి వెళతారని.. ఆ లోపే ఉదయనిధి స్టాలిన్ కు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు అప్పగిస్తారని కథనాలు వచ్చాయి. ప్రధానంగా... 2024 జనవరి 21న సేలంలో జరిగిన పార్టీ యూత్ వింగ్ సమావేశం అనంతరం ఈ ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు కథనాలొచ్చాయి.

అయితే... ఈ విషయాలపై నాడు స్పందించిన డీఎంకే ఆర్గనైజేషనల్ సెక్రటరీ ఎలంగోవన్... ఆ వార్తలను కొట్టిపారేయలేమని అంటూనే తుది నిర్ణయం మాత్రం సీఎం స్టాలిన్ దే అని అన్నారు. ఇదే సమయంలో ఇప్పటికే ఈ విషయంపై పార్టీలోని పలువురు కీలక నేతలతో సీఎం స్టాలిన్ చర్చించినట్లు తెలుస్తోంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ దిశగా యోచిస్తున్నట్లు సమాచారం.

దీంతో... లోక్ సభ ఎన్నికల అనంతరం తిరిగి 2026లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి! దీంతో.. ఈ లోక్ సభ ఎన్నికల ఫలితాల అనంతరం తన కుమారుడికి డిప్యుటీ సీఎం పదవి ఇచ్చి రాజకీయాల్లో మరింత యాక్టివ్ చేయడం వల్ల 2026నాటికి మరింత రాటుదేలుతారనే ఆలోచన స్టాలిన్ చేస్తున్నారని చెబుతున్నారు. అయితే... దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది!

Tags:    

Similar News