ఎన్డీయే గెలిస్తే తమిళనాడు పేరేంటో తెలుసా ?
తమిళనాడులో ప్రాంతం పట్ల భాష ఆత్మ గౌరవం ఎక్కువ అని అంటారు. సరిగ్గా ఈ పాయింట్ నే స్టాలిన్ పట్టుకుని ఎన్డీయే మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు అని అంటున్నారు.;
బీజేపీ అనగానే ఒక రకమైన భావజాలం కళ్ళ ముందు కదలాడుతుంది. తేడా గల పార్టీ అని కమలనాధులు గొప్పగా చెప్పుకుంటారు. తాము అందరి లాంటి వారం కామని వారి భావన. అయితే ఆ తేడాను ప్రత్యర్ధులు వేరే విధంగా చూస్తారు. బీజేపీ అంటే బాబోయ్ అంటారు. నిజానికి బీజేపీ గతానికి ఇప్పటికీ చాలా మారింది అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఎన్నికల ఎత్తులు జిత్తులలో ఆ పార్టీ కూడా మధ్యే వాద పార్టీలతో పోటీ పడుతోంది. రాజకీయ ఆటలో అందరికీ ఒకే రకమైన నిబంధనలు ఉంటాయి. వాటిని నేర్చుకుని అంతా ఆడాల్సిందే. లేకపోతే ఓడిపోతారు. ఈ సూత్రం వంటబట్టబట్టే బీజేపీకి అప్రతిహత విజయాలు దక్కుతున్నాయి.
ఆ ముద్ర బలంగా :
అయితే వ్యూహాలు చాణక్యాలు ఎలా ఉన్నా బీజేపీకి ఒక బలమైన ఫిలాసఫీ ఉంది. అది మూలం. ఆ మూల సూత్రానికి ఎపుడూ ముప్పు రాకుండా ఆ పార్టీ చూసుకుంటూ వస్తోంది. అయితే రాజకీయ పరిస్థితులు అనుకూలించకపోతే తన అస్త్రాలను అలా వెనక్కి అమ్ముల పొదిలో దాస్తుంది. కుదిరిన చోట ప్రయోగిస్తుంది అని ప్రత్యర్ధులు అంటారు. ఇపుడు ఎన్నికల వేళ బీజేపీని విమర్శిస్తున్న పార్టీలు అన్నీ హిందూత్వ అని మత తత్వ రాజకీయం అని అంటూంటారు అయితే అవన్నీ పాతవి అయిపోయాయి. దాంతో తమిళనాడు సీఎం డీఎంకే అధినేత స్టాలిన్ బీజేపీ మీద కొత్తగా ఆరోపణలు చేశారు. అవి కూడా బీజేపీ భావ జాలానికి తగిన విధంగానే ఉండేలా సరి చూసి మరీ గురి పెట్టారు.
తమిళనాడు పేరు మారుస్తారు :
పొరపాటున తమిళనాడులో ఎన్డీయే కనుక అధికారంలోకి వస్తే కచ్చితంగా రాష్ట్రం పేరుని వారు మార్చేస్తారు అని స్టాలిన్ తాజా ఎన్నికల సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆ పేరు ఏంటి అంటే దక్షిణ ప్రదేశ్‌గా మారుస్తారని ఆయన చెబుతున్నారు. అందుకే ఎన్డీయే కూటమిని ఓడించేందుకు అంతా ఒక్కటి కావాలని ఆయన తిరుచ్చి సభలో ప్రజలకు పిలుపునిచ్చారు. డబుల్ ఇంజన్ సర్కార్ అని బీజేపీ ఎపుడూ చెబుతూ ఉంటుంది. అది బాగా ప్రచారం చేసుకుంటుంది. దానిని కూడా స్టాలిన్ తన ఎన్నికల సభల్లో గట్టిగానే టార్గెట్ చేశారు. బీజేపీ డమ్మీ ఇంజిన్ ముందు ద్రవిడ సూపర్ ఫాస్ట్ ఇంజిన్ ఎప్పటికీ తలవంచదని ఆయన స్పష్టం చేయడం విశేషం. అంతే కాదు భారత దేశం మొత్తంలో తమిళనాడులోనే అధిక సంఖ్యలో మహిళలు పనిచేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. అయినా సరే బీజేపీ పాలిత రాష్ట్రాలలో మాదిరిగా ఇక్కడ అఘాయిత్యాలు జరగవని ఆయన చెప్పడం విశేషం. అంటే మహిళా భద్రతలో కూడా తమ ప్రభుత్వం టాప్ అని ఆయన చెప్పుకున్నారు అన్న మాట.
బ్రహ్మాస్త్రమే తీశారా :
తమిళనాడులో ప్రాంతం పట్ల భాష ఆత్మ గౌరవం ఎక్కువ అని అంటారు. సరిగ్గా ఈ పాయింట్ నే స్టాలిన్ పట్టుకుని ఎన్డీయే మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు అని అంటున్నారు. ఉత్తరాది దక్షిణాది అంటూ తరచూ విమర్శలు చేసే డీఎంకే నేతలు ఎన్నికల వేళ ఏకంగా తమిళ అస్తిత్వానికే బీజేపీ ముప్పు తలపెడుతుందని చెప్పడం వెనక జనాల భావోద్వేగాలను గట్టిగా పండించడమే అని అంటున్నారు. బీజేపీకి తమిళనాడులో అన్నా డీఎంకేతో పొత్తు ఉంది. ఈ కూటమిని నిరోధించేందుకు డీఎంకే ఈ విధంగా ఏకంగా రాష్ట్రం పేరుకే ఎసరు పెడతారు అని సంచలన ఆరోపణలు చేసింది అని అంటున్నారు. మరిపుడు దీనికి కరెక్ట్ గా జవాబు చెప్పి జనాలను కన్వీన్స్ చేయాల్సిన పరిస్థితి అయితే ఎన్డీయే నేతల మీద ఉంది. ఎన్డీయే నేతలు ఎలా రియాక్టు అవుతారో చూడాలి మరి.