ధర్మాన కొడుకు ఎంపీగానా...అందుకే ?

శ్రీకాకుళం జిల్లా ఎంపీ సీటు వైసీపీకి ఎపుడూ అందరి ద్రాక్షగానే ఉంటోంది. 2014 నుంచి ఇప్పటికి మూడు ఎన్నికలు జరిగితే మూడు సార్లూ వైసీపీ ఓడింది. టీడీపీ గెలిచింది.;

Update: 2025-12-27 05:30 GMT

శ్రీకాకుళం జిల్లా ఎంపీ సీటు వైసీపీకి ఎపుడూ అందరి ద్రాక్షగానే ఉంటోంది. 2014 నుంచి ఇప్పటికి మూడు ఎన్నికలు జరిగితే మూడు సార్లూ వైసీపీ ఓడింది. టీడీపీ గెలిచింది. అది కూడా దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు వారసుడు అయిన రామ్మోహన్ నాయుడు వరసగా గెలిచి హ్యాట్రిక్ ఎంపీ అనిపించుకున్నారు. ఇపుడు కేంద్రంలో కీలకమైన మంత్రిగా ఉన్నారు. అయితే శ్రీకాకుళం జిల్లా టీడీపీ రాజకీయాలు మారుతున్నాయి. రామ్మోహన్ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేస్తారు అని అంటున్నారు. ఆయన నరసన్నపేట నుంచి పోటీకి అంతా సిద్ధం అవుతోందని చెబుతున్నారు.

వైసీపీలో ఆశలు :

బలమైన కింజరాపు కుటుంబం ఎంపీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటే తమ గెలుపు సులువు అవుతుందని జిల్లాకు చెందిన వైసీపీ నేతలు ఆశ పడుతున్నారు. దాంతో ఈసారి సిక్కోలు ఎంపీ సీటు విషయంలో భారీ పోటీనే కనిపిస్తోంది. నిజం చెప్పాలంటే గతంలో అనేక మంది సీనియర్ నేతలను పోటీ చేయాలని హైకమాండ్ కోరినా ఎవరూ ఎస్ అన్నది చెప్పలేదు, కానీ ఈసారి బిగ్ షాట్స్ ఈ పోటీకి సై అంటున్నారు. మాజీ స్పీకర్ తమ్మినెని సీతారాం తన రాజకీయ జీవితం మొత్తంలో అనేక సార్లు ఎమ్మెల్యేగానే పోటీ చేసి గెలిచారు. మంత్రిగా పనిచేశారు. ఆయన పార్లమెంట్ కి వెళ్లాలని అనుకుంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నపుడు రాజ్యసభ ద్వారా ఎంపీ కావాలని చూశారు. కానీ అనేక రాజకీయ సామాజిక ప్రాంతీయ సమీకరణల వల్ల అది కుదరలేదు. ఇక ఆయనకే శ్రీకాకుళం ఎంపీ సీటుకు ఇంచార్జిగా వైసీపీ పెద్దలు బాధ్యతలు అప్పగించారు. దాంతో ఆయన ఈసారి పోటీ చేసి లోక్ సభ సభ్యుడిగా పార్లమెంట్ లో అడుగు పెట్టాలని చూస్తురు అని అంటున్నారు.

దాసన్న వ్యాఖ్యల వెనక :

అయితే ఇటీవల టెక్కలిలో జరిగిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన క్రిష్ణదాస్ మాట్లాడుతూ తమ్మినేని సీతారాం ని రాజ్యసభకు కానీ ఎమ్మెల్సీగా కానీ పంపిస్తామని ఎంపీ సీటుని యువకులకు ఇస్తామని ప్రకటించారు. దాని మీద ఆ తరువాత పెద్ద రాజకీయ రచ్చ సాగింది. కాళింగులకు రాజకీయంగా అణగదొక్కుతున్నారని కూడా దువ్వాడ శ్రీనివాస్ లాంటి వారు విమర్శలు చేశారు. అయితే అలాంటిదేమీ లేదని అధినాయకత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని ధర్మాన క్రిష్ణదాస్ ఆ తరువాత వివరణ ఇచ్చారు. అయితే ఆయన వ్యాఖ్యల వెనక ఉద్దేశ్యాలు ఏమిటి అన్న చర్చ కూడా సాగుతోంది. తన సోదరుడి కుమారుడు రాం మనోహర్ నాయుడుకి ఎంపీ సీటు నుంచి పోటీ చేసే చాన్స్ ఇస్తున్నారా అన్నది కూడా చర్చగా ఉంది.

వారికి ధీటుగా :

జిల్లాలో కింజరాపు ధర్మాన కుటుంబాలు దశాబ్దాలుగా వేరు పార్టీలలో ఎదుగుతూ వస్తున్నాయి. కింజరాపు కుటుంబంలో తరువాత తరం కూడా రాణిస్తోంది. దాంతో ధర్మాన వారసులు కూడా రాజకీయంగా ముందుకు రావాలని తండ్రులు ఆరాటపడుతున్నారని అంటున్నారు. కృష్ణదాస్ కుమారుడు నరసన్నపేట నుంచి ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అని అంటున్నారు. ప్రసాదరావు కుమారుడు శ్రీకాకుళం నుంచి ఎంపీగా బరిలోకి దిగుతారు అని కూడా ప్రచారంలో ఉంది. మరి ఈ కారణంగానే తమ్మినేనిని సైడ్ చేస్తున్నారా అన్న కొత్త చర్చ కూడా ఆ సామాజిక వర్గంలో సాగుతోందిట. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో.

Tags:    

Similar News