స్పేస్ ఎక్స్ రాకెట్ ప్రయోగం విఫలం: టెక్సాస్‌లో భారీ పేలుడు!

తాజా ఘటనపై సంస్థ పూర్తిస్థాయి విచారణ చేపట్టి, తదుపరి చర్యలపై త్వరలో స్పష్టత ఇవ్వనుంది.;

Update: 2025-06-19 08:23 GMT
స్పేస్ ఎక్స్ రాకెట్ ప్రయోగం విఫలం: టెక్సాస్‌లో భారీ పేలుడు!

అమెరికాలోని టెక్సాస్‌లో ఉన్న స్పేస్ ఎక్స్ టెస్ట్ సైట్‌లో తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్లలో ఒకటైన స్టార్‌షిప్-36 రాకెట్, స్టాటిక్ టెస్ట్ సమయంలో అనూహ్యంగా పేలిపోయింది. ఈ భారీ పేలుడుతో టెస్ట్ సైట్ ప్రాంతం మొత్తం మంటల్లో చిక్కుకుంది.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ ప్రమాదానికి రాప్టర్ ఇంజిన్‌లలో హార్డ్‌వేర్ వైఫల్యం కారణమని భావిస్తున్నారు. ఈ ఘటనపై స్పేస్ ఎక్స్ సంస్థ ఇప్పటికే విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ పేలుడులో కొందరు వ్యక్తులకు గాయాలైనట్లు సమాచారం అందింది. అయితే, గాయాల తీవ్రత, బాధితుల పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.

సాధారణంగా పరీక్షల నిమిత్తం నిలిపి ఉంచిన స్టార్‌షిప్-36 రాకెట్‌లో ఇంధనం నింపి, దాని మోటార్ల పనితీరును పరిశీలిస్తారు. కానీ ఈసారి పరీక్షలో ఊహించని సాంకేతిక లోపం ఏర్పడిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

గతంలో కూడా స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన కొన్ని రాకెట్లు ప్రయోగ సమయంలో విఫలమైన సందర్భాలు ఉన్నాయి. అయితే ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఈ సంస్థ ప్రతిసారీ ఈ లోపాలను గుర్తించి, వాటిని సరిచేసి విజయవంతమైన ప్రయోగాలు చేసింది. తాజా ఘటనపై సంస్థ పూర్తిస్థాయి విచారణ చేపట్టి, తదుపరి చర్యలపై త్వరలో స్పష్టత ఇవ్వనుంది.

స్పేస్ ఎక్స్ తక్కువ ఖర్చుతో మానవులను చంద్రుడు, మార్స్ వంటి గ్రహాలకు తరలించే లక్ష్యంతో స్టార్‌షిప్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇలాంటి బృహత్తర ప్రాజెక్టులలో ఇటువంటి ప్రమాదాలు అనివార్యమని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Full View
Tags:    

Similar News