అమ్మకాల్లో వివో.. ఒప్పో.. మోటరోలా.. పోకో దూకుడు.. వాటికి మాత్రం షాకులు
తాజాగా 2023- 2024 స్మార్ట్ ఫోన్ల అమ్మకాలకు సంబంధించిన డేటాను విశ్లేషించినప్పుడు ఆసక్తికర అంశాలు వెలుగు చూపాయి.;
స్మార్ట్ ఫోన్ల వినియోగం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. 5జీ టెక్నాలజీ దీనికితోడు మొబైల్ విప్లవంతో నగరాల్లో మాత్రమే కనిపించే స్మార్ట్ ఫోన్ల వినియోగం టైర్ టూ సిటీస్ తో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఇటీవల కాలంలో నగరాల్లో స్మార్ట్ ఫోన్ల అమ్మకాల వ్రద్ధి రేటు మందగమనంగా మారితే.. అందుకు భిన్నంగా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం వ్రద్ధి రేటు అంతకంతకూ పెరుగుతుండటం విశేషం. దీంతో మొబైల్ కంపెనీల చూపు చిన్ననగరాలు.. పట్టణాలు.. గ్రామీణ ప్రాంతాల మీద పడింది.
తాజాగా 2023- 2024 స్మార్ట్ ఫోన్ల అమ్మకాలకు సంబంధించిన డేటాను విశ్లేషించినప్పుడు ఆసక్తికర అంశాలు వెలుగు చూపాయి. ప్రీమియం ఫోన్ల వినియోగంపై ఆసక్తి చిన్న పట్టణాల్లో పెరుగుతోందని.. దీనికి తోడు 5జీ స్మార్ట్ ఫోన్లు తక్కువ ధరలకే రావటం కూడా వీటిపై మక్కువ పెరుగుతున్నట్లు చెబుతున్నారు. క్వాల్కామ్.. మీడియాటెక్ వంటి చిప్ తయారీ దిగ్గజాలు రూ.12 వేల కంటే తక్కువ స్థాయిలో 5జీ ఫోన్లు లభించేలా చౌకైన 5జీ ప్రాసెసర్లను అందుబాటులోకి తీసుకురావటం స్మార్ట్ ఫోన్ మొబైల్ మార్కెట్ కు దన్నుగా మారిందని చెప్పాలి.
ఇటీవల కాలంలో మధ్యతరగతి కొనుగోలుదారులు సైతం ప్రీమియం ఫోన్లకు అప్ గ్రేడ్ కావటం ఒక పరిణామంగా చెబుతున్నారు. 2024లో దేశీ స్మార్ట్ ఫోన్ పరిశ్రమ మొత్తం ఆదాయం ఆల్ టైం గరిష్ఠమైన 9 శాతం వార్షిక వ్రద్ధి రేటుకు చేరుకోవటం విశేషం. ప్రస్తుతం దేశంలో ఏటా 15 కోట్ల స్మార్ట్ ఫోన్ల అమ్మకాలకు చేరుకుంది. అయితే.. ఈ ఏడాది అమ్మకాలు ప్లాట్ గా ఉన్నట్లు చెబుతున్నారు.
2023 - 2024 సంవత్సరాల్లో దిగ్గజ స్మార్ట్ ఫోన్ల కంపెనీల అమ్మకాలు ఎంతలా పెరిగాయన్న విషయం కళ్లకు కట్టేలా గణాంకాలు వెలువడ్డాయి. ఆసక్తికరమైన అంశం ఏమంటే కొన్ని కంపెనీల స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు దూసుకెళ్లగా మరికొన్ని కంపెనీల అమ్మకాలు వెనక్కి వెళ్లటం కనిపిస్తుంది.
2023తో పోలిస్తే 2024లో అమ్మకాల్లో దూకుడు ప్రదర్శించిన కంపెనీల్లో వివో.. ఒప్పో.. రియల్ మీ.. యాపిల్.. మోటరోలో.. పోకో.. ఐకూలు నిలిస్తే.. తిరోగమనంలో శాంసంగ్.. షావోమీ.. వన్ ప్లస్ కంపెనీలు నిలిచాయి. 30 నగరాల్లో నిర్వహించిన మార్కెట్ అధ్యయనం ప్రకారం బడా నగరాల్లో వార్షిక అమ్మకాల వ్రద్ధి సింగిల్ డిజిట్ కు పరిమితం అవుతుంటే.. టైర్ 2.. అంతకంటే చిన్న నగరాల్లో మాత్రం అమ్మకాలు డబుల్ డిజిట్ లో ఉండటం ఆసక్తికరంగా మారింది. ఫీచర్స్ ఫోన్స్ వినియోగదారులు అప్ గ్రేడ్ అవుతున్న వైనం గ్రామీణ.. చిన్న పట్టణాల్లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని చెబుతున్నారు.