బీహార్ రాజకీయాల్లో సీత జన్మస్థలం... అసలేమిటీ వ్యవహారం!
ఇందులో భాగంగా సుమారు 121 నియోజకవర్గాల్లో గురువారం జరిగిన ఓటింగులో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.;
బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సుమారు 121 నియోజకవర్గాల్లో గురువారం జరిగిన ఓటింగులో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మరోవైపు రెండో దశ పోలింగ్ కు సంబంధించిన ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి! ఈ సమయంలో సీత జన్మస్థలం వ్యవహారం బీహార్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
అవును... బీహార్ లో ఎన్నికల వాతావరణం అత్యంత రసవత్తరంగా మారిన వేళ.. సీత జన్మస్థల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సందర్భంగా... శనివారం సీతామర్హిలో జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ.. బీహార్ విశ్వాసాన్ని, మిథిలా సాంస్కృతిక గుర్తింపును ఆయన ప్రభుత్వం అగౌరవపరిచిందని కాంగ్రెస్ ఆరోపించింది. దీంతో వ్యవహారం ఒక్కసారిగా వేడెక్కింది.
ఈ సందర్భంగా... సీతామర్హిలో సీతాదేవి జన్మించిందని చెప్పడానికి చారిత్రక ఆధారాలు లేవని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ గతంలో పార్లమెంటుకు చెప్పిందని కాంగ్రెస్ పార్టీ గుర్తు చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్.. రాజ్యసభలోని పాత రికార్డును తెరపైకి తెస్తూ.. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు!
ఈ సందర్భంగా... ఏప్రిల్ 12 - 2017న రాజ్యసభలో బీజేపీ ప్రభుత్వం ఇలా పేర్కొంది.. అని మొదలుపెట్టిన జైరాం రమేష్... సీతామర్హిలో తల్లి సీతాదేవి జన్మించిందని ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవు.. అనే ఈ ప్రతిస్పందనను భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఇచ్చింది.. ఈ ప్రకటన బీహార్ విశ్వాసం, మిథిలా గుర్తింపు, సాంస్కృతిక గర్వానికి ప్రత్యక్ష అవమానం.. అని అన్నారు.
ఈ నేపథ్యంలోనే... ఈ పవిత్ర భూమిపైకి అడుగు పెట్టే ముందు, ప్రధానమంత్రి క్షమాపణ చెబుతారా? అని జైరాం రమేష్ అడిగారు.
సీతామర్హికి ఒక్క రూపాయి కూడా రాలేదు!:
ఇదే సమయంలో... బీజేపీ ప్రభుత్వం తన పర్యాటక ప్రాజెక్టులలో బీహార్ లోని మతపరమైన ప్రదేశాలను విస్మరించిందని ఆరోపించిన జైరాం రమేష్.. 2011 - 2013 మధ్య కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం రామాయణ సర్క్యూట్ ప్రాజెక్ట్ కింద సీతామర్హి-పునౌరా ధామ్ ను అభివృద్ధి చేయాలని ప్రణాళిక వేసిందని.. కానీ, బీజేపీ ప్రసాద్, స్వదేశ్ దర్శన్ పథకాల కింద సీతామర్హికి ఒక్క రూపాయి కూడా రాలేదని అన్నారు!
రైల్వే ప్రాజెక్ట్ రద్దు!:
అదేవిధంగా... ఈ ప్రాంతంలో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న డిమాండ్ అయిన మోతీహరి - శివహర్ - సీతామర్హి రైల్వే లైన్ రద్దును కూడా కాంగ్రెస్ నేత విమర్శించారు! ఇందులో భాగంగా... ఒకసారి కేంద్ర బడ్జెట్ లో ప్రకటించిన ఈ ప్రాజెక్టును, రైల్వే మంత్రిత్వ శాఖ ఆగస్టు 2024లో తక్కువ ట్రాఫిక్ అంచనాలను పేర్కొంటూ సైలెంట్ గా ఉపసంహరించుకుందని ఆయన అన్నారు.
ఈ నేపథ్యంలోనే.. అసలు సీతామర్హి ప్రజల తప్పు ఏమిటి..? ప్రధానమంత్రి వారికి సమాధానం ఇస్తారా..? అని జైరాం రమేష్ ప్రశ్నించారు.
2017లో రాజ్యసభలో ఏమి జరిగింది?:
కాగా... 2017 ఏప్రిల్ లో రాజ్యసభలో జరిగిన చర్చలో బీజేపీ ఎంపి ప్రభాత్ ఝా అడిగిన ప్రశ్నకు అప్పటి సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్ శర్మ సమాధానమిస్తూ.. సీత జన్మస్థలం విశ్వాసానికి సంబంధించిన విషయం అని.. దానికి పురావస్తు ఆధారాలు లేవని.. సీతామర్హిలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎలాంటి తవ్వకాలు జరపలేదని అన్నారు.
అందువల్ల అది సీత జన్మస్థలం అనే చారిత్రక ఆధారాలు లేవని పేర్కొన్నారు. ఈ సమాధానంపై ప్రతిపక్ష ఎంపీలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు.. ఈ ప్రకటన ప్రజల మత విశ్వాసాలను అగౌరవపరిచేదిగా ఉందని అభివర్ణించారు. ఇదే విషయాన్ని ఇప్పుడు జైరాం రమేష్ లేవనెత్తారు!