నకిలీ మద్యం కలకలం వేళ... మిథున్ రెడ్డి నివాసాల్లో సిట్ సోదాలు
వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఏపీ ప్రత్యేక దర్యాప్తు టీమ్ (సిట్) వదలడం లేదు.;
వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఏపీ ప్రత్యేక దర్యాప్తు టీమ్ (సిట్) వదలడం లేదు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మద్యం విధానంలో కీలక పాత్ర పోషించారనే ఆరోపణలతో మిథున్ రెడ్డిని అరెస్టు చేసి 70 రోజులకు పైగా జైల్లో ఉంచారు. మధ్యలో ఉప రాష్ట్రపతి ఎన్నికకు, ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ రావడంతో కొద్ది రోజుల కిందట మిథున్ బయటకు వచ్చారు. ఈ క్రమంలో బెయిల్ మంజూరు సందర్భంగా ఏపీ హైకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలను వైఎస్సార్సీపీకి పెద్ద బలం ఇచ్చాయి. కొన్ని రోజులుగా స్తబ్ధుగా ఉన్న ఏపీ సిట్... ఉరుము లేని పిడుగులా.. నిను వీడని నీడను నేను అన్నట్లుగా మంగళవారం మిథున్ రెడ్డికి చెందిన హైదరాబాద్ కొండాపూర్ కార్యాలయం, ఫిలింనగర్ ప్రశాసన్ నగర్, యూసుఫ్ గూడ గాయత్రీహిల్స్ నివాసాల్లో తనిఖీలు చేపట్టింది.
నాలుగు టీమ్ లు.. రెండుచోట్ల
మిథున్ రెడ్డికి చెందిన హైదరాబాద్, బెంగళూరుల్లోని నివాసాలు, కార్యాలయాల్లో ఈ తనిఖీలు సాగుతున్నాయి. నాలుగు టీమ్ లు ఇందులో పాల్గొంటున్నాయి. ఈ క్రమంలో మిథున్ రెడ్డి కుటుంబ సభ్యలు, నివాసాలు, కార్యాలయాల్లో పనిచేసేవారిని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. సహజంగానే జరిగినట్లు తమకు కావాల్సిన పేపర్లను స్వాధీనం చేసుకున్నారనే వార్తలు వస్తున్నాయి.
నాలుగో నిందితుడు..
ఏపీలో వైఎస్సార్సీపీ హయాంలో మద్యం విధానంలో రూ.3 వేల కోట్లకు పైగా అవినీతి, అక్రమాలు జరిగాయంటూ కూటమి ప్రభుత్వం వచ్చాక కేసులు నమోదుచేసింది. ఇందులో మిథున్ రెడ్డి ఏ4గా ఉన్నారు. ఈ మేరకు అరెస్టు చేయగా 71 రోజులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు. అయితే, విడుదలైన వెంటనే వైఎస్సార్సీపీ అనంతపురం, శ్రీసత్యసాయి, నెల్లూరు జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ గా తిరిగి నియమితులు అయ్యారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాలకు హాజరయ్యే భారత ప్రతినిధుల్లో ఒకరిగా మిథున్ రెడ్డిని ఎంపిక చేసింది.
అటు నకిలీ మద్యం.. ఇటు సిట్ సోదాలు
ఏపీలో ప్రస్తుతం నకిలీ మద్యం కలకలం రేపుతోంది. టీడీపీ తరఫున గత ఎన్నికల్లో తంబళ్లపల్లె నుంచి పోటీ చేసిన జయచంద్రారెడ్డి, టీడీపీకే చెందిన సురేంద్రనాయుడుతో పాటు జనార్దనరావు దీనివెనుక ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి. సోమవారం జనార్దనరావు ఓ వీడియో విడుదల చేసి వైఎస్సార్సీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ పేరు చెప్పారు. ఇలాంటి సమయంలోనే సిట్... ఎంపీ మిథున్ రెడ్డి నివాసాలు, కార్యాలయంలో సోదాలు చేపట్టడం గమనార్హం.