మనం ఊహించలేం: రిటైర్మెంట్ ప్రకటించిన ఆ దేశ ప్రధాని.. ఎందుకంటే?

రాజకీయాలకు సంబంధించి కొన్ని అంశాలు మనం ఎప్పటికి ఊహించలేం. ఆ మాటకు వస్తే జీర్ణించుకోలేమని చెప్పాలి.

Update: 2024-04-16 04:43 GMT

రాజకీయాలకు సంబంధించి కొన్ని అంశాలు మనం ఎప్పటికి ఊహించలేం. ఆ మాటకు వస్తే జీర్ణించుకోలేమని చెప్పాలి. అత్యుత్తమ పదవుల్లో ఉన్న వారు వయసు ఎంత ఎక్కువైనప్పటికీ అప్రతిహతంగా సాగేందుకే మొగ్గు చూపుతారు తప్పించి.. ఉజ్వలంగా ఉన్న వేళలో.. పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవటం కనిపించదు. తాజాగా అలాంటి కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు సింగపూర్ ప్రధానమంత్రి లీ సీయన్ లూంగ్. ఆయన వయసు 72 ఏళ్లు మాత్రమే.

మన దగ్గర అంతకు మించిన పెద్ద వయస్కులకు చెందిన నేతలే నిక్షేపంగా రాజకీయాలు నిర్వహిస్తూ.. మరిన్ని పదవుల్ని సొంతం చేసుకోవటం అహరహం శ్రమిస్తున్నారు. ఇందుకు భిన్నంగా గడిచిన రెండు దశాబ్దాలుగా సింగపూర్ ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్న లూంగ్ మాత్రం తన రిటైర్మెంట్ ను ప్రకటించారు.

మే 15న తాను సింగపూర్ దేశ ప్రధానమంత్రి బాధ్యత నుంచి తప్పుకోనున్నట్లుగా వెల్లడించారు. తాను రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అదే రోజున ఉప ప్రధానమంత్రి 51 ఏళ్ల లారెన్స్ వాంగ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. వచ్చే నెలలో రిటైర్మెంట్ ప్రకటించిన లూంగ్ సింగపూర్ మూడో ప్రధానమంత్రి.

ఆయన ప్రధానిగా 2004లో బాధ్యతలు చేపట్టారు. తన రిటైర్మెంట్ ప్రకటన నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆయన ఒక పోస్టు పెట్టారు. ఏ దేశానికైనా నాయకత్వ మార్పిడి ఎంతో ముఖ్యమన్న ఆయన.. సింగపూర్ ఉజ్వల భవిష్యత్తును అందించేందుకు వాంగ్ ప్రభుత్వానికి సహకారం అందించాలని సింగపూర్ వాసుల్ని ఆయన కోరారు. ఏమైనా.. అత్యున్నత పదవిలో ఉంటే.. తనకు తానుగా ఆ పదవి నుంచి తప్పుకోవాలనుకోవటం అరుదైన అంశంగా చెప్పక తప్పదు.

Tags:    

Similar News