ఒకసారే నిజరూపం...మహిమ అద్భుతం
దేశంలో ఎక్కడ ఆలయాల్లో అయినా స్వామి వారి అసలు రూపంతోనే దర్శనం భక్తులకు లభిస్తుంది.;
దేశంలో ఎక్కడ ఆలయాల్లో అయినా స్వామి వారి అసలు రూపంతోనే దర్శనం భక్తులకు లభిస్తుంది. కానీ ఏకైక ఆలయంగా విశాఖలోని సింహాచలం శ్రీ వరాహ నరసింహ స్వామి వారి ఆలయంలో మాత్రమే ఏడాది మొత్తం స్వామి చందనంతో కప్పబడి ఉంటారు. ఒకే ఒక్క రోజున ఆయన నిజ రూపం కనిపిస్తుంది. అలా ఆ ఒక్క రోజునే స్వామిని దర్శించుకుని తరించే అవకాశం దక్కుతుంది. ఆ రోజు వైశాఖ శుద్ధ తృతీయ. దానినే అక్షర తృతీయగా కూడా చెబుతారు. అందుకే సింహాచలంలో చందనోత్సవం రోజు అంటే ఏపీ తెలంగాణా మాత్రమే కాదు ఒడిశా చతీష్ ఘడ్ వంటి చోట్ల నుంచి భక్తులు వేలల్లో తరలి వస్తారు. ఏడాదికి ఒకసారి కనిపించే నిజ రూప దర్శన భాగ్యాన్ని అందుకునేందుకు క్యూలు కడతారు. గంటల తరబడి వేచి ఉండి మరీ స్వామి రూపాన్ని చూసి జన్మ ధన్యం అయిందని ఆధ్యాత్మిక ఆనందాన్ని గుండె నిండా నింపుకుని వెనక్కి మరలుతారు.
పుట్టలో వెలసిన స్వామి :
ఇదిలా ఉంటే నిజ రూప దర్శనం వెనక ఆసక్తిని కలిగించే పురాగణ గాధ ఒకటి ఉంది. స్వామి వారి విబ్రహం పుట్టలో దొరికింది. దాని కోసం సాగిన అన్వేషణ కూడా ఎంతో ఉత్కంఠగా ఉంటుంది. యుగాల క్రితం చంద్రవంశానికి చెందిన పురూరవ చక్రవర్తి అలా ఆకాశమార్గాన పయనిస్తూ ఉంటే ఆయన విమానం సింహాచలం క్షేత్ర సమీపంలోకి వచ్చాక ముందుకు కదలక ఆగిపోతుంది. దాంతో పురూరవ చక్రవర్తి అక్కడే నేల మీదకు దిగుతాడు. ఆయనకు ఆ సమయంలో అక్కడ అడవిలో పూర్తిగా పుట్టతో కప్పబడిన స్వామి వారి విగ్రహం కనిపిస్తుంది. ఆయన పుట్టను సమీపంలోని గంగా జలంతో తొలగించి స్వామిని కనుగొంటాడు. అయితే ఉగ్ర రూపంలో ఉన్న ఆ నిజ మూర్తిని చూసిన పురూరవ చక్రవర్తి ఆశ్చర్యపోతాడు, భీతిల్లుతాడు. ఆ సమయంలో ఆకాశవాణి ఆయనకు చెబుతుంది. భక్తులు ఎవరూ నిజరూపం సాధారణ రోజులలో చూడలేరని అందువల్ల తిరిగి ఆ విగ్రహాన్ని కప్పి ఉంచి అక్కడే ప్రతిష్టించాలని. దాంతో చందనం పూసి ఆ విగ్రహాన్ని చక్రవర్తి అక్కడ కొలువు తీరుస్తాడు. సింహాచలం క్షేత్రాన్ని కూడా ఆయనే నిర్మిస్తాడు. అలా ఏడాదికి ఒకసారి స్వామి నిజరూప దర్శనం సంప్రదాయం కూడా ఆయనే ప్రారంభించారు. అదే తరువాత కాలంలో సింహాచలం గా ప్రసిద్ధి చెందింది. నాటి నుంచి స్వామి భక్తుల కోరిక మేరకు ఏడాదికి ఒకసారి నిజ రూపం దర్శనం ఇస్తాడు.
నిజరూపం ఎలా ఉంటుందంటే :
స్వామి ఏడాది పొడవునా చందనంతో కప్పబడి లింగాకారంలో భక్తులకు దర్శనం ఇస్తారు. కానీ నిజ రూపంలో ఎలా ఉంటారు అన్న ఆసక్తి అందరికీ ఉంటుంది. స్వామి వరాహ ముఖంతో నరుని శరీరంతో నిజ రూపంలో ఉంటారు. శ్వత వర్ణంతో రెండు చేతులతో ఉంటారు. స్వామివారి భుజంపై తోక ఉంటుంది. అలాగే తలపై తెల్లని జూలు ఉంటుంది. ఇక నిజరూపంలో స్వామివారి పాదాలను దర్శించుకోవచ్చు. అక్షయ తృతీయ నాడు తెల్లవారుజాము నుంచి స్వామి వారి దర్శనాలు భక్తులకు లభిస్తాయి. ఇక నిజరూప దర్శనం అయిన వెంటనే స్వామివారికి మళ్లీ చందనం పూస్తారు. అయితే సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి నిజరూప దర్శనం అనేది సింహాచల క్షేత్రంలో జరిగే అత్యంత పవిత్రమైన విశిష్టమైన ఆధ్యాత్మిక కార్యక్రమంగా ఉంటుంది.
శ్రీకృష్ణదేవరాయల కాలంలో :
సింహాచలం ఆలయాన్ని శ్రీకృష్ణదేవరాయలు కాలంలో ఎంతో అభివృద్ధి చేశారు. శ్రీకృష్ణదేవరాయలు స్వామి వారిని దర్శించుకుని మరీ ఎన్నో అభరణాలు ఆయనకు కానుకగా సమర్పించారు. అంతే కాదు రత్నాల హారాలను బహుమతిగా అందించి భక్తితో కొలిచారు. దాని కంటే ముందు ఈ ఆలయాన్ని 13వ శతాబ్దంలో తూర్పు గంగా రాజవంశానికి చెందిన నరసింహ దేవుడు ఈ అభివృద్ధి చేశారని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆధునిక కాలంలో ప్రభుత్వాలు కూడా ఈ ఆలయాన్ని ఎంతగానో అభివృద్ధి చేస్తూ వస్తున్నాయి. గతానికి పోలిస్తే స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎన్నో సదుపాయాలను కల్పిస్తున్నారు.